Begin typing your search above and press return to search.

బాబు దెబ్బకు ఉమ్మారెడ్డికి దిమ్మ తిరిగిందట

By:  Tupaki Desk   |   16 Sep 2016 12:42 PM GMT
బాబు దెబ్బకు ఉమ్మారెడ్డికి దిమ్మ తిరిగిందట
X
చంద్రబాబు పేరెత్తితే చాలు విరుచుకుపడే ఆయన ఒకప్పటి సహచరుడు - ప్రస్తుత వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరోమారు చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని ఆయన విమర్శించారు. ఫుల్లుగా వాడుకుని వదిలేశారని చెప్పారు. తన జీవితంతో చంద్రబాబు ఆడుకున్నారని అన్నారు. పార్టీ ఆవిర్భావం రోజు నుంచి ఉన్న తనను చివరకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించి బయటకు పంపారని తాజాగా మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.

తాను పార్టీ నుంచి వచ్చేయడానికి ముందు సభ్యత్వం కూడా ఇవ్వలేదని..దాంతో అప్పట్లో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పుల్లారావుకు ఈ విషయాన్ని చెప్పానని.. సభ్యత్వం పుస్తకం పంపుతానన్నా ఆయన తర్వాత పట్టించుకోలేదన్నారు. సభ్యత్వ కార్యక్రమ ఇన్‌ చార్జ్‌ గా ఉన్న కేఈ కృష్ణమూర్తిని అడిగితే ఆన్‌ లైన్‌ లో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా సూచించారని.. చివరకు నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి తనకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వడం లేదన్న విషయాన్ని చెప్పానన్నారు. ఆయన కూడా తల ఎత్తకుండా చూస్తాలే అని సరిపెట్టారన్నారు. కానీ సభ్యత్వం మాత్రం తనకు ఇవ్వలేదన్నారు. 20ఏళ్లు పార్టీలో ఉన్న తనకు చివరకు సభ్యత్వం కూడా ఇవ్వకుండా అవమానించారని ఉమ్మారెడ్డి ఆవేదన చెందారు. దాంతో ఏడాది పాటు ఇంటికే పరిమితమయ్యానన్నారు. ఆసమయంలోనే వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారని… జగన్‌ బలవంతపెట్టి మరీ ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపారని ఉమ్మారెడ్డి చెప్పారు.

చంద్రబాబు తన కుమారుడికి టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారనీ ఉమ్మారెడ్డి ఆరోపించారు. ఐటీసీ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న తన కుమారుడికి టికెట్ ఇస్తానంటూ 2004లో ఉద్యోగానికి రాజీనామా చేయించిన చంద్రబాబు టిక్కెటు మాత్రం ఇవ్వలేదన్నారు. ఒక పద్దతి ప్రకారం తనను, తన రాజకీయ వారసత్వాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ పెద్దలు కుట్రపూరితంగా పనిచేశారని ఉమ్మారెడ్డి ఆవేదన చెందారు. ఎన్టీఆర్‌ నాటి విలువలు టీడీపీలో ఏమాత్రం లేవన్నారు. 1999లో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎవరుండాలన్న దానిపై ఎంపీల నుంచి చంద్రబాబు అభిప్రాయాలు సేకరించారని అందరూ తన పేరు సూచించారని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన చంద్రబాబు చివరకు బీసీ అయితే బాగుంటుందంటూ ఎర్నన్నాయుడిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారని చెప్పారు. అప్పుడు తాను చాలా బాధపడ్డానన్నారు. ఒకవేళ నేరుగా బీసీ నేతకు అవకాశం ఇవ్వదలుచుకుంటే అభిప్రాయసేకరణ జరపడం దేనికని ప్రశ్నించానన్నారు. రాజ్యసభ సీటుపైనా ఆశ పెట్టి మోసం చేశారన్నారు. చంద్రబాబు తనను వాడుకుని వదిలేశారని ఆయన ఆరోపించారు.