Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మ్యాచ్లో తెలుగులో మాట్లాడిన అంపైర్.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   30 Oct 2020 3:35 PM GMT
ఐపీఎల్ మ్యాచ్లో తెలుగులో మాట్లాడిన  అంపైర్.. వీడియో వైరల్
X
ఐపీఎల్ 2020లో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. క్రికెటర్ల వివాదాలు, ఘర్షణలు ఐపీఎల్లో కామనే. ఈ ఏడాది చీర్ గర్ల్స్ సందడి.. అభిమానుల కోలాహలం లేకపోవడంతో కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ ఇళ్లలో టీవీల ముందు కూర్చొని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. గత సీజన్ల కంటే ఈ సారి టీవీ వీక్షకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. గురువారం రాత్రి చెన్నై సూపర్కింగ్స్ కోల్కత్తా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సరదా సన్నివేశం జరిగింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మ్యాచ్ మధ్యలో చెన్నై బౌలర్ సామ్ కరాన్ బౌలింగ్ లో బంతి నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు అందకుండా వికెట్టుకు కాస్త దూరంగా వెళ్లింది. దీంతో వైడ్ కాదా అంటూ దినేష్ తెలుగులో ప్రశ్నించాడు. దీనికి హైదరాబాద్ కు చెందిన అంపైర్ షంషుద్దీన్ తెలుగులోనే సమాధానం చెప్పాడు. ‘లోపల.. చాలా లోపల కొంచెం కూడా వైడ్ కాదు’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు కామెంట్స్ సైతం పెడుతున్నారు. షంషుద్దీన్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా, తమిళనాడుకు చెందిన దినేష్‌ కార్తీక్‌కి తెలుగు వస్తుందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ దినేష్‌ కార్తీక్‌ పూర్వీకులు తెలుగు వారే అని, మరికొందరేమో కార్తీక్‌ తెలుగు, తమిళం, పంజాబీ, హిందీ కూడా మాట్లాడగలరని కామెంట్లు పెడుతున్నారు.