Begin typing your search above and press return to search.

ఆర్థిక కష్టాల్లో ఐక్యరాజ్యసమితి

By:  Tupaki Desk   |   9 Oct 2019 5:49 AM GMT
ఆర్థిక కష్టాల్లో ఐక్యరాజ్యసమితి
X
ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్య సమితికి ఇప్పుడు సిత్రమైన కష్టాలతో కిందామీదా పడుతోంది. ప్రపంచంలో ఏం జరిగినా.. దానికి సంబంధించిన అంశాల్ని చక్కదిద్దే పెద్దన్నపాత్రను పోషించే సమితికి ఇప్పుడు ఆర్థికపరమైన చిక్కులతో తల్లడిల్లుతోంన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఐక్యరాజ్యసమితి ఎదుర్కొంటున్న తీవ్రమైన నిధుల కొరత వివరాల్ని సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు.

ప్రస్తుతానికి ఐక్యరాజ్య సమితి 230 మిలియన్ల డాలర్ల లోటులో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి నిధులన్ని ఖాళీ కావటం ఖాయమంటున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పని చేసే 37 మంది ఉద్యోగుల్ని ఉద్దేశించి ఆయనో లేఖ రాశారు. ఆర్థిక సమస్యకు సంబంధించిన సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఇంతకీ ఆర్థికకష్టాలకు కారణం ఎవరు? దేని కారణంగా నిధుల కొరత ఎదుర్కొంటోందన్న విషయంలోకి వెళితే.. పాపమంతా సభ్యదేశాలదే అని చెబుతున్నారు. సమితి నడవటానికి మొత్తం బడ్జెట్ లో 22 శాతం నిధుల్ని అమెరికానే అందిస్తోంది. మిగిలిన నిధుల్ని ఇవ్వాల్సిన దేశాలు కొన్ని లైట్ తీసుకోవటం.. బాధ్యతగా వ్యవహరించని కారణంగా ఆర్థిక తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

గత నెల చివరి నాటికి 230 మిలియన్ డాలర్ల నగదు లోటు ఏర్పడిందని.. అక్టోబరు చివరి నాటికి ఉన్న నిధులన్ని ఖాళీ కావటం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవటానికి పలు సమావేశాల్ని.. సదస్సుల్ని వాయిదా వేస్తున్నారు. అంతేకాదు.. ముఖ్యమైన పర్యటనలు తప్పించి మిగిలిన వాటిపై ఆంక్షల్ని విధించనున్నారు. నిధుల ఆదాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరి.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఖర్చులు తగ్గించుకునే కన్నా.. బకాయిల వసూళ్ల మీద ఫోకస్ పెడితే మంచిదని చెప్పక తప్పదు.