Begin typing your search above and press return to search.

పరువు పోయేలా అగ్రరాజ్యం బకాయి పడిందే!

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:03 AM GMT
పరువు పోయేలా అగ్రరాజ్యం బకాయి పడిందే!
X
రాజుగారి చిన్న భార్య మంచిదంటే.. పెద్ద భార్య ఏమిటన్న సంగతి ఇట్టే అర్థంకాక మానదు. నిత్యం నీతులు చెబుతూ.. ప్రపంచానికి పెద్దన్న అంటూ ఫోజులు కొట్టే అమెరికా దరిద్రపు బుద్ధి ప్రపంచానికి అర్థమయ్యే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ మధ్యనే అప్పుల కుప్పగా మారిన ఐక్యరాజ్య సమితి ఆర్థిక వ్యవహారాలపై ఆసక్తికర సమాచారం బయటకు రావటం తెలిసిందే. సమితిలోని సభ్య దేశాలు తాము చెల్లించాల్సిన మొత్తాల్ని చెల్లించని వైనం కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే.

దాదాపు 230 మిలియన్ డాలర్ల లోటుతో నడుస్తున్న సమితి ప్రస్తుతం తన దగ్గర పని చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ దేశాలు తాము ఇవ్వాల్సిన వాటాను ఇవ్వకపోవటమా? అన్న విస్మయం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే సమితికి బకాయిలు ఎవరెవరు ఉన్నారన్న విషయంపై కొత్త విషయం బయటకు వచ్చింది.

సమితికున్న విధానాల కారణంగా.. బకాయిలు పడిన దేశాల వివరాల్ని బయటకు వెల్లడించదు. కానీ.. సమితికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన వారి వివరాల్ని ప్రకటిస్తారు. దీంతో.. బకాయిలు పడిన వారి వివరాలు ఇట్టే అర్థమైపోతాయి.తాజాగా వెల్లడించిన జాబితాలో బకాయిలు చెల్లించిన దేశాలు 34 మాత్రమేనని వెల్లడించారు. ఆ దేశాల వివరాల్ని వెల్లడించగా.. అందులో భారత్ తో సహా న్యూజిలాండ్.. సింగపూర్.. స్విట్జర్లాండ్.. జర్మనీ.. ఫిన్లాండ్.. కెనడా.. భూటాన్.. ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి.

మొత్తం 193 దేశాలకు కాను.. బకాయిలు అంటూ లేని దేశాలు కేవలం 34 మాత్రమే కావటంతో.. మిగిలిన వారెవరన్నది ఇప్పుడు లోకానికి తెలిసిపోయింది. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా తాను చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించలేదన్న విషయం బయటకు వచ్చింది. పేరుకు అగ్రరాజ్యమే కానీ.. బకాయిలు కూడా చెల్లించలేదా? అన్న ప్రశ్న వేస్తుంటే.. పెద్దన్నకు అంతకు మించిన అవమానం ఏముంటుంది చెప్పండి.