Begin typing your search above and press return to search.

పాత నోట్లు తీసుకోలేద‌ని...మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌

By:  Tupaki Desk   |   5 Jan 2017 6:14 AM GMT
పాత నోట్లు తీసుకోలేద‌ని...మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌
X
న‌ల్ల‌ధ‌నం అంతు చూసేందుకంటూ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం దేశంలో ఎన్నెన్నో వింత‌లు - విశేషాల‌కు కార‌ణంగా నిలుస్తోంది. బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులున్నా... తీసుకోలేని దుస్థితిలో సామాన్య జ‌నం నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడిప్పుడే కరెన్సీ క‌ష్టాలు కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్టినా... ఆర్బీఐ వ్య‌వ‌హార స‌ర‌ళిని క‌ళ్లకు క‌ట్టేలా ఉన్న ఓ ఘ‌ట‌న నిన్న ఢిల్లీలో చోటుచేసుకుంది. మీడియా దృష్టి అంత‌గా ప‌డ‌ని ఈ ఘ‌ట‌న‌లో ఓ నిరుపేద మహిళ‌.,.. నిండా పాతికేళ్లు కూడా లేని వ‌య‌సులో భ‌ర్త వ‌దిలేస్తే... ఇద్ద‌రు చిన్నారుల‌ను పోషించుకుంటూ అష్ట‌క‌ష్టాలు ప‌డుతూ... ఆర్బీఐ అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఆగ్ర‌హావేశాల‌కు లోనై... ప‌ట్ట ప‌గ‌లు - బ‌హిరంగంగా ఒలువ‌లు విడిచేసి వినూత్న నిర‌స‌న‌కు దిగింది. పార్ల‌మెంటుకు కూత వేటు దూరంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌... ఆర్బీఐ అధికారుల నిర్వాకానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంలా నిలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక నిన్న‌టి ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... ఢిల్లీలోని నంగోలి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వివాహిత‌కు ఓ కొడుకు - ఓ కూతురు ఉన్నారు. ఇటీవ‌లే పిల్ల‌ల‌తో స‌హా ఆ మ‌హిళ‌ను భ‌ర్త వ‌దిలేశాడు.

అయితే క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌ను పోషించుకునేందుకు దిన‌స‌రి కూలీగా మారిన ఆ మ‌హిళ‌... చేతుల క‌ష్టంతో సంపాదించుకుని ఎక్క‌డో దాచేసుకున్న ఓ రెండు వెయ్యి రూపాయ‌ల నోట్లు - మ‌రో నాలుగు రూ.500 నోట్లు... మొత్తం విలువ రూ.4 వేలు... చేత‌బ‌ట్టుకుని మంగ‌వారం బ‌య‌లుదేరింది. ఎందుకంటే... అప్ప‌టికే ఆ నోట్ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో వాటిని మార్చుకునేందుకు ఆమె ఢిల్లీలోని ఆర్బీఐ కార్యాల‌యానికి వెళ్లింది. అంద‌రిలాగే క్యూలో నిలుచుంది. చంటి పిల్లాడిని వెంట‌బెట్టుకుని వెళ్లిన ఆ మ‌హిళ‌... గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిలుచుని కౌంట‌ర్ వ‌ద్ద‌కు కూడా చేరింది. అయితే కౌంట‌ర్‌ లోని ఆర్బీఐ సిబ్బంది ఆమెకు షాకిచ్చారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేద‌ని - ఇలా గుర్తింపు కార్డు లేకుంటే... పాత‌నోట్లు తీసుకోబోమ‌ని తేల్చి చెప్పేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ మ‌హిళ‌... అక్క‌డే మ‌రింత సేపు నిల‌బ‌డి వేడుకుంది. అయినా ఆమె మొర‌ను ఆల‌కించిన వారెవ‌రూ లేక‌పోయారు. ఈలోగా చిన్న‌పిల్లాడైన ఆమె కుమారుడు ఆర్బీఐ ప్రాంగ‌ణంలో మూత్రం పోశాడ‌ట‌. ఈ విష‌యాన్ని మాత్రం ప‌క్కాగా క‌నిపెట్టేసిన ఆర్బీఐ అధికారులు... ఆ పిల్లాడితో పాటు ఆమెను పోలీసుల చేత బ‌ట‌య‌కు గెంటివేయించారు. దీంతో తీవ్ర నిరాశ‌కు గురైన ఆమె మంగ‌ళ‌వారం సాయంత్రం ఇంటికి వెళ్లిపోయింది.



మ‌రునాడు... అంటే నిన్న (బుధ‌వారం) మ‌ళ్లీ ఆర్బీఐ కార్యాల‌యానికి వెళ్లింది. మంగ‌ళ‌వారం నాడు ఎదురైన ప‌రిస్థితులే నిన్న కూడా ఎదుర‌య్యాయి. అంతేకాకుండా మొన్న‌టిలానే నిన్న కూడా ఆమెను అక్క‌డి భ‌ద్ర‌తా సిబ్బంది బ‌య‌ట‌కు పంపేశారు. దీంతో చేతిలో ఉన్న న‌గ‌దు మార‌క‌పోవ‌డంతో ఆ మ‌హిళ తీవ్ర వేద‌న‌లో కూరుకుపోయింది. ఓ ప‌క్క రెండేళ్ల వ‌య‌సున్న కుమారుడు గుక్క‌ప‌ట్టి ఏడుస్తుండ‌గా.. ఆ మ‌హిళ కూడా దిక్కుతోచ‌ని స్థితిలో ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఆ ఏడుపుల‌కు అల‌ర్ట్ అయిపోయిన పోలీసులు ఇద్ద‌రు మ‌హిళా కానిస్టేబుళ్ల‌ను అక్క‌డికి పంపారు. ఆమెను అక్క‌డి నుంచి త‌ర‌లించేందుకు య‌త్నించారు. అయితే అప్ప‌టికే తీవ్ర వేద‌న‌తో ఏడుస్తున్న ఆ మ‌హిళ‌... పోలీసుల‌ను ప్ర‌తిఘ‌టించింది. అయినా పోలీసులు ఆమెను ప‌ట్టి లాగేసేందుకే య‌త్నించారు. ఈ క్ర‌మంలో త‌న బాధ‌ను వ్య‌క్తం చేసేందుకు వినూత్న నిర‌స‌న‌కు దిగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిలో... ఆ మహిళ అక్క‌డిక‌క్క‌డే త‌న దుస్తులు విడిచేసి న‌గ్న నిర‌స‌న తెలిపింది. అయితే ఈ ఊహించని ప‌రిణామానికి షాక్ తిన్న పోలీసులు ఆమెను పిల్లాడితో స‌హా వ్యాన్‌ లోకి ఎక్కించుకుని పార్ల‌మెంటు స్ట్రీట్ పోలీస్ స్టేష‌న్‌ కు ఆ త‌ర్వాత ఆమె ఇంటికి త‌ర‌లించారు. పార్ల‌మెంటుకు కూతేవ‌టు దూరంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌... నోట్ల మార్పిడిలో ఆర్బీఐ వ్య‌వ‌హ‌రిస్తున్న క‌ఠిన వైఖ‌రిని నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/