Begin typing your search above and press return to search.

సహకరించని మాన్సాస్ అధికారులు

By:  Tupaki Desk   |   6 July 2021 4:44 AM GMT
సహకరించని మాన్సాస్ అధికారులు
X
వివాదాల్లో కూరుకుపోతున్న మాన్సాస్ ట్రస్టు అధికారులు ఆడిటింగ్ కు సహకరించటంలేదా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఆడిట్ అధికారులకు ట్రస్టు అధికారులు ఏమాత్రం సహకరించటంలేదట. ట్రస్టు ఆదాయ వివరాలను, జమా ఖర్చులను ఆడిట్ చేయబోతున్నట్లు మొన్నటి ఫిబ్రవరిలోనే విజయనగరం జిల్లా ఆడిట్ అధికారి హిమబిందు సమాచారం ఇచ్చారట.

తాము ఆడిట్ చేయటానికి వీలుగా అన్నీ రికార్డులను తమకు అందుబాటులో ఉంచాలని చెప్పినా ట్రస్టు అధికారులు పట్టించుకోలేదని ఆమె చెప్పారు. 2004-05 నుండి ట్రస్టుకు చెందిన లెక్కలేవీ తమకు ఇవ్వలేదన్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించిన లెక్కలు ఇవ్వనపుడు తర్వాత సంవత్సరాల లెక్కలను ఆడిట్ చేయటం సాధ్యం కాదన్నారు.

ట్రస్టులోని కొన్ని విభాగాలకు సంబంధించిన లెక్కలు వచ్చినా అందులోని ఓచర్లలో ఎవరి సంతకాలు లేవన్నారు. మొత్తానికి హిమబిందు చెప్పిన విషయాలు చూస్తుంటే ట్రస్టు అధికారులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించటం లేదని స్పష్టమైపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ట్రస్టు అధికారులంటే దశాబ్దాలుగా ఛైర్మన్ అశోక్ గజపతిరాజు కుటుంబం నియమించిన వ్యక్తులు. ట్రస్టుకు ఈవో అంటే ప్రభుత్వం నియమించిన అధికారి.

కోర్టు తీర్పువల్ల సంచైత బాధ్యతల నుండి తప్పకోగానే ట్రస్టు ఈవోగా ఈమధ్యనే ప్రభుత్వం కొత్త అధికారిని నియమించింది. సంచైత బాధ్యతలు తీసుకోగానే ఆడిటింగ్ కు ప్రయత్నించినా అప్పటి సిబ్బంది పెద్దగా సహకరించలేదని ఆమె చెప్పారు. ఇపుడు ప్రభుత్వం కొత్త ఈవోను నియమించినా ట్రస్టు అధికారుల ధోరణిలో మార్పు వచ్చినట్లులేదు. ట్రస్టు అధికారులు ఎంతగా సహాయ నిరాకరణ చేస్తే అశోక్ గజపతిరాజుకు అంత ఇబ్బందులు తప్పవు.