Begin typing your search above and press return to search.

ఉండవల్లి మాటలు విన్నారా జగన్? వడపోతలో జాగ్రత్త..

By:  Tupaki Desk   |   8 Feb 2020 8:10 AM GMT
ఉండవల్లి మాటలు విన్నారా జగన్? వడపోతలో జాగ్రత్త..
X
సంక్షేమ పథకాలు వరంలానే కాదు.. శాపంలా మారుతుంటాయి. వ్యవస్థను క్రమ పద్దతి లో నడిపించటం కూడా కొన్నిసార్లు ప్రజల్లో ప్రభుత్వం పట్ల కొత్త కోపాన్ని కలిగించేలా చేస్తుంటాయి. ఇదే విషయాన్ని తాజాగా సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పటమే కాదు.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల వడపోత ప్రభుత్వానికి కొత్త తిప్పలు గా మారుతుందన్న మాటను చెప్పుకొచ్చారు.

చెన్నారెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హుల వద్ద ఉన్న తెల్ల రేషన్ కార్డుల్ని తొలగించేందుకు వీలుగా వడబోత కార్యక్రమాన్ని చేపట్టటంతో ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైందని.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమికి కారణమైందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడీ విషయం ఎందుకంటే.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి భారీ వడబోత కార్యక్రమాన్ని షురూ చేశారు.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్ని కూడా దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారు మాత్రమే ఉండాలే తప్పించి.. ఆర్థికంగా పుష్టిగా ఉన్న వారు వినియోగించటం మంచిది కాదన్నది జగన్ ఆలోచన. నిజమే.. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలు ఎప్పుడూ అర్హులకు వాటిని అందించాలని భావిస్తుందే కానీ అనర్హులకు అందాలని కోరుకోదు. అలా జరిగితే.. ఎప్పటికి ఆర్థికంగా అణగారిన వర్గం ఎప్పటికి పైకి రాలేదు.

ఈ మంచి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లకార్డులు ఉన్న వారిలో అర్హులు ఎంతమంది? అనర్హులు ఎంతమంది? అన్న విషయంపై తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకూ చేపట్టిన సర్వేల ప్రకారం దగ్గర దగ్గర 18 లక్షలమంది వరకూ అనర్హులకు తెల్ల కార్డులు ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెబుతున్నారు. అలాంటి వారి వద్ద ఉన్న కార్డుల్ని తొలగించటం తో పాటు.. వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా చూడాలన్న ఆలోచన లో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు.. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్న వారు రేషన్ బియ్యానికి అనర్హులు. అదే సమయంలో స్వీపర్లు.. శానిటరీ వర్కర్లు.. సఫాయి కర్మచారి వర్కర్లుగా పని చేస్తున్న వారికి మాత్రం జీతంలో సంబంధం లేకుండా మినహాయింపు ఇచ్చారు. అదే సమయం లో మగాణి భూమి మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదని.. మెట్ట పది ఎకరాలు ఉన్న వారి వరకూ అభ్యంతరం లేదన్న నిబంధనలు ఉన్నాయి. అందుకు భిన్నంగా ఉన్న వారి కార్డుల్ని ఏరివేరేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఇంత పెద్ద ఎత్తున కార్డుల ఏరివేత ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందన్న విషయంపై జగన్ ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.