Begin typing your search above and press return to search.

ఉండవల్లి విభజన పిటిషన్ సంచలనం...?

By:  Tupaki Desk   |   8 April 2022 1:30 PM GMT
ఉండవల్లి విభజన పిటిషన్ సంచలనం...?
X
మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తానికి అనుకున్నది సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అడ్డగోలు విభజన అని ఆయన మొదటి నుంచి ఒక్కరుగానే గొంతు చించుకుంటున్నారు. దీని మీద 2014లోనే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయింది. అయితే ఈ విషయంలో వీలు దొరికినపుడల్లా ఆయన ఏపీ సర్కార్ ని కూడా ఇంప్లీడ్ కావాలని కోరుతూ వచ్చారు.

ఇదిలా ఉంటే ఉండవల్లి పిటిషన్ విషయంలో ఇపుడు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. విభజన ఎటూ అయిపోయింది కాబట్టి సవరణ పిటిషన్ ని ఉండవల్లి మళ్ళీ దాఖలు చేశారు. దాంతో దీన్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ లో ఉండవల్లి పేర్కొన్న అంశాలు ఏంటంటే ఏ రాష్ట్రాన్ని అయినా విభజించే ముందు విధి విధానాలు ఉండాలని, ఏపీలో జరిగిన మాదిరిగా ఇక పైన ఏ ఒక్క రాష్ట్రం నష్టపోరాదని,

దీని మీద భవిష్యత్తులో అయినా పొరపాట్లు జరగకుండా చూసేలా కేంద్రాన్ని ఆదేశించాలని తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో ఉండవల్లి కోరారు. తగిన మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్రాన్ని నిర్దేశించాలని ఉండవల్లి కోరారు. దీని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం వచ్చే వారం దీని మీద విచారణ జైపేలా చూడాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అంటే వచ్చే వారం సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ మీద విచారణ జరుపుతుంది అన్న మాట. మరి అడ్డగోలుగా ఏపీని విభజించారు అన్న వాదనలు అయితే ఉండవల్లి వైపు నుంచి వస్తాయని అంటున్నారు.

ఒక విధంగా ఏపీలో జరిగిన తప్పును ఇపుడు ఎవరూ సవరించలేరు. అదే సమయంలో దేశం మొత్తానికి విభజన ద్వారా ఏపీకి జరిగిన నష్టం ఏంటో ఈ విచారణ ద్వారా తెలుస్తుంది అంటున్నారు. ఆ మీదట కేంద్రం అయినా గతంలో మాదిరిగా కాకుండా ఉదారంగా వ్యవహరించి సాయం చేసేందుకు రాజకీయ డిమాండ్లు కూడా వస్తాయని అంటున్నారు. ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉన్న వేళ ఉండవల్లి పిటిషన్ లో విషయాలు కూడా కచ్చితంగా ప్రస్థావనకు వస్తాయని, అదే విధంగా కోర్టు దీని మీద ఇచ్చే తీర్పు కూడా కేంద్ర పెద్దలలో ఒక కదలిక తెచ్చే వీలుందని భావిస్తున్నారు.

ఇప్పటిదాకా ప్రత్యేక హోదా విషయం సహా అనేక విభజన హామీల విషయంలో పట్టించుకోని కేనంద్ర పెద్దలు అలెర్ట్ అయ్యేలా ఉండవల్లి పిటిషన్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఉండవల్లి పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా పోరాడి అనుకున్నది సాధించారు అంటున్నారు.
ఉండవల్లి ఈ న్యాయ పోరాటం ద్వారా చేసిన మంచి పని ఏంటి అంటే భావి తరాలు ఏపీ ఏ విధంగా విడిపోయింది అన్నది తెలుసుకుంటారు. అదే విధంగా పాలకుల రాజకీయ దుర్నీతి కూడా తేటతెల్లం అవుతుంది. ఎవరేంటి అన్నది కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఏపీకి సంబంధించి రాజకీయ మేధావిగా ఉన్న తాను అనుకున్న పంధాలోనే పోరాడుతూ ఒక విధంగా విజయం సాధించారు అనే చెప్పాలి.