Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి జ‌గ‌న్ మేలు కోరే ఈ మాట చెప్పాడ‌ట‌

By:  Tupaki Desk   |   3 Nov 2017 2:57 PM GMT
ఉండ‌వ‌ల్లి జ‌గ‌న్ మేలు కోరే ఈ మాట చెప్పాడ‌ట‌
X
ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విష‌యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఈనెల 6వ తేదీ నుంచి జగన్ చేపట్టనున్న పాదయాత్రపై స్పందించ‌డంతో పాటుగా...అసెంబ్లీ స‌మావేశాలపై కూడా ఉండ‌వ‌ల్లి మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని, దానికి నిరసనగా తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని వైసీపీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిని ఉండ‌వ‌ల్లి తప్పుప‌ట్టారు.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను బహిష్కరించాలన్న వైసీపీ అధినేత నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని ఉండ‌వ‌ల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపైనే ఉందని ఆయన అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించే స‌రైన వేదిక అసెంబ్లీ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో, జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఉండవల్లి ఆకాంక్షించారు.

మ‌రోవైపు మంత్రి అచ్చెన్నాయుడు సైతం వైఎస్ జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీకి వ‌చ్చి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ మాట్లాడాల‌న్న మంత్రి అచ్చెన్న‌.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కూడ‌బెట్టుకున్నార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. తాము వేసిన రోడ్ల‌పై జ‌గ‌న్ పాద‌యాత్ర చేయాల‌న్న మంత్రి.. చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని అన్నారు.

ఇదిలాఉండ‌గా...గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వొద్దంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో అడిషనల్ డీజీ హరీష్ కుమార్ గుప్తాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.