Begin typing your search above and press return to search.

ఎన్నిక‌లొస్తే టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌దుః ఉండ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   28 Jun 2017 12:34 PM GMT
ఎన్నిక‌లొస్తే టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌దుః ఉండ‌వ‌ల్లి
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత -మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీకి ఘోరప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని జోస్యం చెప్పారు. దివంగ‌త నేత వైఎస్ రాజశేఖ‌ర రెడ్డి బతికుంటే 2011లోపే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయ్యేదని ఆయ‌న బుధ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో అన్నారు. చంద్ర‌బాబునాయుడు కడుతున్నది పోలవరం ప్రాజెక్ట్‌ కాదని, అదికేవ‌లం కాపర్‌ డ్యాం మాత్రమేన‌ని చెప్పారు. 2018లోపు పోలవరం నిర్మాణం అసాధ్యమ‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

గ‌త పదేళ్లలో జూన్‌ మాసంలో కృష్ణా డెల్టాకు నీళ్లివ్వలేదని బాబు అన‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. గత 25 ఏళ్లలో మిగులు జలాలు ఏనాడూ లేవ‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు తెలుసుకోవాల‌న్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాల‌ని ఐవైఆర్‌ కృష్ణారావును కోరి ఉంటే బాగుండేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అకార‌ణంగా ఆయనను ప‌దవి నుంచి తప్పించడం సరికాదు. ఈ చర్య వల్ల చంద్రబాబు నాయుడికే వందరెట్లు నష్టం జరిగింద‌న్నారు. చంద్రబాబు అపాయింట్‌ మెంట్‌ దొరకనందునే ఐవైఆర్‌ సోషల్‌ మీడియాను ఆశ్రయించార‌న్నారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబుకు ఎందుకు అంత భ‌య‌మో త‌న‌కు అర్థం కావ‌డం లేదన్నారు.

చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఓటుకు రూ.5వేలు ఇస్తానంటూ స్వయాన ఒక రాష్ట్రముఖ్యమంత్రే వ్యాఖ్యానించడం దురదదృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు. ఏపీలో ఏం జరిగినా వైఎస్‌ జగన్‌ పైకి నెట్టివేయడం సీఎం - మంత్రులకు ఫ్యాషన్‌ గా మారిందని చెప్పారు. ప్రపంచ బ్యాంక్‌ కు ఎవరో ఉత్తరం రాస్తే దానికి జగనే కారణం అనడం ఎంతవరకూ సమంజసమ‌ని ప్ర‌శ్నించారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో చంద్రబాబు నిర్మిస్తున్నది అమరావతికాదు..భ్రమరావతి అని ఉండ‌వ‌ల్లి ఎద్దేవా చేశారు. ఏపీలో జరిగిన అన్ని కుంభకోణాలపై ఐవైఆర్‌ కృష్ణారావుకు పూర్తిఅవగాహన ఉందని, విశాఖ భూ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆయన ద‌గ్గ‌రున్నాయ‌ని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్ర‌బాబు లోకువ అయ్యారని, ఏపీకి అన్యాయం జరుగుతున్నా ఆయ‌న‌ తెలంగాణ ప్రభుత్వాన్నినిలదీయడం లేదని ఉండ‌వ‌ల్లి అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/