Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి లాజిక్!. ఈ రెంటి మ‌ధ్య లింకేది బాబూ?

By:  Tupaki Desk   |   2 Jan 2019 8:42 AM GMT
ఉండ‌వ‌ల్లి లాజిక్!. ఈ రెంటి మ‌ధ్య  లింకేది బాబూ?
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నాలుగున్న‌రేళ్ల త‌న పాల‌న‌పై శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేశారు. రోజుకో శ్వేత‌ప‌త్రం చొప్పున నిన్న‌టిదాకా ప‌ది శ్వేత‌ప‌త్రాల‌ను వ‌దిలిన చంద్ర‌బాబు... శ్వేత ప‌త్రాల విడుద‌ల కార్య‌క్ర‌మానికి శుభం కార్డేశారు. ఈ ప‌త్రాల విడుద‌ల సంద‌ర్భంగా వ‌రుస‌గా మీడియా స‌మావేశాలు పెట్టిన చంద్ర‌బాబు... త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధ్య‌మైంద‌ని, రాష్ట్రం క‌ళ‌క‌ళ‌లాడుతోంద‌ని, దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించ‌నంత అభివృద్ధి ఏపీలో సాకార‌మైంద‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ఈ విష‌యాలు వెల్ల‌డించిన వేదిక‌ల మీద నుంచే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కుట్ర‌లు చేసింద‌ని, రాష్ట్రంలో విప‌క్షం వైసీపీతో పాటు జ‌న‌సేన‌, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు త‌మ వంతు పాత్ర‌ను పోషించాయ‌ని కూడా చెప్పారు. మోదీ అండ్ కో ప‌న్నిన కుట్ర‌ల కార‌ణంగా రాష్ట్రం ఇంకా ఇబ్బందులు ప‌డుతోంద‌ని కూడా చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఓ వైపు త‌మ పాల‌న కార‌ణంగానే రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధించింద‌ని చెబుతూనే... మ‌రోవైపు రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంద‌ని చెప్పుకోవ‌డం ఒక్క చంద్ర‌బాబుకు మాత్ర‌మే సాధ్య‌మైంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

చంద్ర‌బాబు శ్వేత‌ప‌త్రాల విడుద‌ల పూర్త‌య్యే దాకా చాలా ఓపిక‌తో వేచి చూసిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌.. బాబు ప‌త్రాల విడుద‌ల కార్య‌క్ర‌మం ముగిసిన మ‌రునాడే రంగంలోకి దిగేశారు. కాసేప‌టి క్రితం తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఉండ‌వ‌ల్లి... చంద్ర‌బాబు పై, ఆయ‌న విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రాల‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రావ‌డం రావ‌డ‌మే... శ్వేత‌ప‌త్రాల్లోని అంశాలు, చంద్ర‌బాబు కేంద్రం పై చేస్తున్న ఆరోప‌ణ‌లను ప్ర‌స్తావించిన ఉండ‌వ‌ల్లి... అస‌లు ఈ రెండింట‌గి మ‌ధ్య లింకెక్క‌డుంద‌ని మంచి లాజిక్కే తీశారు. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట‌లో న‌డుపుతున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు... శ్వేత‌ప‌త్రాల్లో అంకెల గార‌డీ చేశార‌ని ఆరోపించారు. అయితే అదే స‌మ‌యంలో కేంద్రంలోని మోదీ స‌ర్కారు, రాష్ట్రంలోని విప‌క్షాల ఉమ్మ‌డి కుట్ర‌ల కార‌ణంగా రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయ‌న్న చంద్ర‌బాబు... రాష్ట్రాన్ని ఎలా ప్ర‌గ‌తి బాట‌న న‌డిపారో చెబితే బాగుంటుంద‌ని కూడా ఉండ‌వ‌ల్లి దాదాపుగా క‌డిగిపారేసినంత ప‌ని చేశారు.

సెల్ఫ్ డ‌బ్బాలు కొట్టుకునేందుకే చంద్ర‌బాబు సర్కారు శ్వేత‌ప‌త్రాల విడుద‌ల‌కు తెర తీసింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో చంద్ర‌బాబు... జ‌నాన్ని మాయ చేసేందుకే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టార‌ని కూడాఇ ఉండ‌వ‌ల్లి నేరుగానే విమ‌ర్శ‌లు సంధించారు. శ్వేత‌ప‌త్రాల్లోని అంశాల‌పై చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధ‌మేనా అని కూడా ఉండ‌వ‌ల్లి స‌వాల్ విసిరారు. ఒక‌వేళ చ‌ర్చ‌కు సిద్ధ‌మే అయితే... తానే అమ‌రావ‌తికి వ‌చ్చి ప‌ది రోజుల పాటు అక్క‌డే కూర్చుంటాన‌ని, రోజుకో శ్వేత‌ప‌త్రం చొప్పున చర్చిద్దామ‌ని ఆయ‌న పెను సంచ‌ల‌నం రేపారు. చ‌ర్చ‌లో భాగంగా శ్వేత‌ప‌త్రాల్లోని అంశాలు నిజ‌మేన‌ని ప్ర‌భుత్వం రుజువు చేయ‌గ‌లిగితే... అక్క‌డిక‌క్క‌డే తన త‌ప్పును ఒప్పుకోవ‌డంతో పాటుగా చంద్ర‌బాబు స‌ర్కారుకు బేష‌ర‌తుగా బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెబుతాన‌ని కూడా ఉండ‌వ‌ల్లి డేరింగ్ స‌వాల్ విసిరారు. మ‌రి ఈ స‌వాల్‌ కు చంద్ర‌బాబు అండ్ కో నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.