Begin typing your search above and press return to search.

జగన్ పాలనపై ఉండవల్లి వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయ్?

By:  Tupaki Desk   |   2 Oct 2019 6:08 AM GMT
జగన్ పాలనపై ఉండవల్లి వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయ్?
X
సీనియర్ నేత.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జగన్ పాలన మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరికి వారు తమకు తోచిన అర్థాన్ని తీసుకుంటున్నారు. అయితే.. జగన్ వ్యతిరేక వర్గం మాత్రం ఉండవల్లి చేసిన వ్యాఖ్యల్ని తమకు తోచిన రీతిలో వక్రీకరించటం గమనార్హం. సాపేక్షంగా చూస్తే.. ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు జగన్ కు పొంచి ఉన్న ముప్పును చెప్పటమే కాదు.. ఒక అలెర్ట్ గా చెప్పక తప్పదు.

జగన్ పాలనపై ఆయన రివ్యూను పలువురు స్వాగతిస్తున్నారు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పటమే కాదు.. రాజకీయ చదరంగంలో నిచ్చెనలతో పాటు పాములు కూడా ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. సొంత నేతల సంతోషం విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం చూస్తే.. జగన్ పాలనలోని నిబద్ధత ఇట్టే అర్థం కాక మానదు.

ఇందుకు తగినట్లే ఉండవల్లి చెప్పిన ఉదాహరణ చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఒక మంత్రి ఒక పని కోసం డబ్బులు తీసుకుంటే అది తెలిసి ముఖ్యమంత్రి తిరిగి డబ్బు ఇప్పించేశారని తెలిసింది. ఇది మంచిదే. కానీ.. జగన్ తర్వాత అన్ని స్థాయిలోనూ మంచి ఉండాలన్నారు. పై స్థాయిలో అవినీతి కనిపించటం లేదని.. కింది స్థాయిలో మాత్రం అవినీతి లేకుండా పని జరగటం లేదన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పారని చెప్పాలి.

అంతేకాదు.. జగన్ కు పొంచి ఉన్న ముప్పును ప్రస్తావించటం ద్వారా.. ఆయన్ను మరింత అలెర్ట్ గా ఉండాలన్న భావన ఉండవల్లి మాటల్లో వినిపిస్తుందని చెప్పాలి. అధికారం శాశ్వితం కాదని.. మీ వాళ్లే మీ మీద తిరగబడతారని.. వారు సంతోషంగా ఉండకుంటే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పటం ద్వారా.. జగన్ ను కొన్ని విషయాల్లో చూసి చూడనట్లుగా ఉండాలన్న సంకేతాల్ని ఇచ్చినట్లు చెప్పక తప్పదు.

మీతో పాటు.. మీ ఎమ్మెల్యేలు సంతృప్తి ఉండాలన్న మాటను ఆయన పలుమార్లు ప్రస్తావించటం చూస్తే.. మంత్రులు.. ఎమ్మెల్యేలు చేసే కొన్ని విషయాల్ని చూసిచూడనట్లుగా వదిలేయాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. అవినీతి విషయంలో కరాఖండిగా ఉన్న జగన్ తన పట్టును కాస్త సడలించాలన్న సందేశం ఉండవల్లి మాటల్లో వినిపిస్తోందని చెబుతున్నారు.

అదే సమయంలో చరిత్రను గుర్తు చేయటం ద్వారా జగన్ కు పొంచి ఉన్న డేంజర్ ను ఉండవల్లి చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్ కు 51 శాతం ఓట్లు వచ్చాయని.. టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయని చెప్పిన ఉండవల్లి.. 1972లో పీవీ నరసింహారావు ఉన్నప్పుడు కాంగ్రెస్ కు 56 శాతం ఓట్లు.. 219 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. అయినప్పటికీ తొమ్మిది నెలల్లో ఆయన్ను దింపేశారన్నారు.

1984లో టీడీపీ.. కమ్యునిస్టులకు 54 శాతం ఓట్లు వచ్చాయని.. ఇందులో భాగంగా టీడీపీకి 213 సీట్లు.. సీపీఎం లకు 34 సీట్లు వచ్చాయని.. కాంగ్రెస్ కు 26 సీట్లే వచ్చాయని.. అయిన్పటికీ ఎన్టీఆర్ ను తొమ్మిది నెలల్లో దింపేశారన్నారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరగబడతారని ఎవరైనా అనుకున్నారా? అంటూ.. రాజకీయాల్లో ఊహించనవి జరిగే వీలుందన్న విషయాన్ని చెబుతూ.. జగన్ ను మరింత అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.