Begin typing your search above and press return to search.

హోదాపై భేటీ!...ఉండ‌వ‌ల్లికి అర్హ‌త ఏంటీ?

By:  Tupaki Desk   |   30 Jan 2019 1:55 PM GMT
హోదాపై భేటీ!...ఉండ‌వ‌ల్లికి అర్హ‌త ఏంటీ?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా... ప్ర‌తి ఆంధ్రుడి నినాద‌మిదే. ఎటోచ్చి అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా మారిన‌ - మారుతున్న రాజ‌కీయ పార్టీల‌కు ఇది ఓ ఎన్నిక‌ల జిమ్మిక్కే. అయితే ఏపీలో అభివృద్ధిని కాంక్షించే ప్ర‌తి వ్య‌క్తికి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం జిమ్మిక్కు ఎంత‌మాత్రం కాదు. ఏపీ అభివృద్ధి కోసం బ‌లంగా కృషి చేస్తున్న వైసీపీ లాంటి పార్టీల‌కు కూడా ప్ర‌త్యేక హోదా జిమ్మిక్కు ఎంత‌మాత్రం కాదు. కేవ‌లం ఎన్నిక‌ల్లో ల‌బ్ధి మాత్ర‌మే కాంక్షించే టీడీపీ లాంటి పార్టీల‌కు మాత్రం ప్ర‌త్యేక హోదా ఓ జిమ్మిక్కే. అందుకే నాలుగేళ్ల పాటు బీజేపీతో క‌లిసి సాగిన టీడీపీ... అస‌లు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మే లేద‌ని చాలా గ‌ట్టిగా చెప్పింది. ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెబుతున్నార‌ని - ఆ మాట‌ను మేం విశ్వ‌సిస్తున్నామ‌ని - మా మాట కాద‌ని మ‌ళ్లీ ఎవ‌రైనా హోదా మాటెత్తితే జైల్లో వేస్తామ‌ని కూడా చంద్ర‌బాబు స‌ర్కారు హూంక‌రించింది. ఇన్ని ఆంక్ష‌ల్లోనూ ప్ర‌త్యేక హోదా నినాద‌మెత్తుకుని యువ భేరీల పేరిట రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌త్యేక స‌భ‌లు నిర్వ‌హించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... హోదా నినాదాన్ని స‌జీవంగా ఉండేలా చేశారు. అయినా ఇప్పుడు ఈ పార్టీల వాద‌న‌ - ప్ర‌జ‌ల గ‌ళం మాటెందుకంటే.... నిన్న‌టిదాకా సైలెంట్‌ గానే ఉన్న సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ ఎంపీ ఉండ‌వల్లి అరుణ్ కుమార్‌... ఇప్పుడు కొత్త‌గా హోదా నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. మ‌రి ఉండ‌వ‌ల్లి కొత్త ఉద్య‌మంలో బ‌ల‌మైన కాంక్షే ఉందా? లేదంటే టీడీపీ త‌ర‌హాలో జిమ్మిక్కు రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర తీశారా? అన్న అంశంపై ఇప్పుడు పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా ఇంటికి మాత్ర‌మే ప‌రిమితం అయిన ఉండ‌వ‌ల్లి... ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ముందుకు వ‌స్తూ.. ఆయా స‌మ‌యాల్లో ప్ర‌జ‌ల నోళ్ల‌లో నానుతున్న ప‌లు అంశాల‌పై ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు చేయ‌డంతో పాటు ఆయా పార్టీల‌ను డైల‌మాలో ప‌డేయ‌డంతో పాటుగా హ‌డ‌తెత్తించే వ్యాఖ్య‌లు కూడా చేశారు. అంతేనా ఏపీకి కేంద్రం ఏ మేర అన్యాయం చేసింద‌న్న విష‌యంపై జ‌న‌సేన అధినేత ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీ భేటీకి కూడా ఆయ‌న వెళ్లారు. ఆ త‌ర్వాత అటు జ‌న‌సేన‌తో పాటుగా ఇటు ఉండ‌వ‌ల్లి కూడా సైలెంట్ అయిపోయారు. హోదా వాద‌న‌ను అట‌కెక్కించేశారు. తీరా ఎన్నిక‌ల‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డిన నేప‌థ్యంలో ఇత‌ర రాజ‌కీయ పార్టీల కంటే కూడా ఉండ‌వ‌ల్లి హ‌డావిడి ఎక్కువైపోయింద‌ని చెప్పాలి. ప్ర‌త్యేక హోదా సాధ‌న దిశ‌గా భ‌విష్య‌త్తు ఉద్యమం ఎలా ఉండాల‌న్న దానిపై చ‌ర్చిద్దాం ర‌మ్మంటూ ఆయ‌న అన్ని రాజ‌కీయ పార్టీల‌కు లేఖ‌లు రాశారు. ఉండ‌వ‌ల్లి ఆహ్వానానికి త‌న‌దైన స్టైల్లో స్పందించిన వైసీపీ.... ఎన్నిక‌ల వేళ ఈ గోలెందుకు? ఇంత‌కాలం ఏం చేశారు? అయినా ప్ర‌త్యేక హోదా కోసం ఆది నుంచి పోరాడుతున్న తాము... ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే దిశ‌గా సాగుతున్న ఈ భేటీల‌కు హాజ‌రు కాలేమ‌ని తేల్చి చెప్పింది. అయితే ఈ త‌ర‌హా భేటీలు ఏర్పాటు కావ‌డ‌మే ఆల‌స్య‌మ‌న్న‌ట్లుగా పిల‌వంగానే సై అన్న టీడీపీతో పాటు జ‌న‌సేన‌ - వామ‌ప‌క్షాలు ప‌రుగు ప‌రుగున ఈ భేటీకి హాజ‌ర‌య్యారు.

నిన్న జ‌రిగిన ఈ భేటీలో ఏం తేల్చార‌న్న విషయంపై కూడా ఉండ‌వ‌ల్లి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోయారు. ఇలాంటి దారి తెన్నూ లేని భేటీల‌తో ప్ర‌యోజ‌నం ఏముంటుంద‌న్న‌ది ఇప్పుడు జ‌నం ప్ర‌శ్నించే ప్ర‌మాదం లేక‌పోలేదు. అయినా నిన్న‌టిదాకా సైలెంట్‌ గానే ఉన్న ఉండ‌వ‌ల్లి ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా ఈ భేటీలు నిర్వ‌హించ‌డం - ఆ భేటీల ద్వారా ఏం సాధించారో కూడా చెప్పలేని వైనం చూస్తుంటే... ఏదో ఒక రాజ‌కీయ పార్టీ వెన‌కుండి న‌డిపిస్తుంటే... ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను హైరానాలోకి నెట్టేసేందుకు ఉండ‌వ‌ల్లి య‌త్నించార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ఈ భేటీతో ఉండ‌వ‌ల్లి త‌న క్రెడిబిలిటీని ప్ర‌మాదంలో ప‌డేసుకున్నార‌న్న విశ్లేషణ‌లు మొద‌ల‌య్యాయి. అయితే ఎవ‌రెన్ని చేసినా ప్ర‌త్యేక హోదాపై త‌న‌దైన స్టాండ్‌ ను కొన‌సాగిస్తున్న వైసీపీ... ఉండ‌వ‌ల్లి జిమ్మిక్కుల‌కు కూడా లొంగ‌కుండా చాలా బ‌లంగానే నిల‌బడింద‌ని చెప్పాలి.