Begin typing your search above and press return to search.

ఫైబ‌ర్ నెట్ వెనుక ఇంత కుట్ర దాగుందా?

By:  Tupaki Desk   |   21 Jun 2017 5:56 AM GMT
ఫైబ‌ర్ నెట్ వెనుక ఇంత కుట్ర దాగుందా?
X
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు మ‌రో లేఖాస్త్రం సంధించారు. ఎప్పుడు విమ‌ర్శ‌లు చేసినా... ఆ విమ‌ర్శ‌ల‌కు ప‌క్కా ఆధారాల‌ను చూపుతూ ఉండ‌వ‌ల్లి చేసే ఆరోప‌ణ‌లకు స‌మాధానం చెప్పాలంటే ఏ ప్ర‌భుత్వానికైనా చాలా క‌ష్ట‌మే. త‌న క‌ళ్లెదుట ఏ అన్యాయం జ‌రిగినా... వెంట‌నే స్పందించే ఉండ‌వ‌ల్లి ఈ ద‌ఫా చంద్ర‌బాబు స‌ర్కారు గొప్ప‌గా చెప్పుకుంటున్న ఫైబ‌ర్ గ్రిడ్‌ పై ప్ర‌శ్నాస్త్రాల‌ను సంధించారు.

రూ.149కే టీవీ కేబుల్ క‌నెక్ష‌న్‌ తో పాటు ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్‌ - టెలిఫోన్ సౌక‌ర్యాల‌ను అందించేందుకు ఉద్దేశించిన ఫైబ‌ర్ నెట్‌ వ్య‌వ‌స్థ ఇప్పుడిప్పుడే ఏపీలో విస్త‌రించుకుంటోంది. తొలుత ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప్రారంభమైన ఈ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన నెట్ వ‌ర్క్ రాష్ట్ర‌వ్యాప్తంగా విస్త‌రించేందుకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో కొన్ని జిల్లాల్లో ఇప్ప‌టికే క‌నెక్ష‌న్ల‌ను ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం సిద్ధం చేసుకుంటోంది.

ఇందుకోసం ప్ర‌భుత్వ యంత్రాంగం అవ‌లంబిస్తున్న వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టిన ఉండ‌వ‌ల్లి... ఫైబ‌ర్ నెట్ వెనుక ఉన్న అస‌లు ల‌క్ష్య‌మేమిటో సెల‌వివ్వాలంటూ చంద్ర‌బాబు స‌ర్కారు లేఖ రాశారు. ఫైబ‌ర్ నెట్ సౌక‌ర్యాన్ని ఇష్ట‌మున్న వాళ్లే తీసుకోవ‌చ్చ‌ని, దీనిలో ఎలాంటి బ‌ల‌వంతం లేద‌ని తొలుత చంద్ర‌బాబు చెప్పిన విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఉండ‌వ‌ల్లి... ఇప్పుడు అధికార యంత్రాంగం చేస్తున్న నిర్వాకాన్ని క‌ళ్ల‌కు క‌ట్టారు. ఇప్ప‌టికే కేబుల్ నెట్ వ‌ర్క్ క‌లిగి ఉన్న ఆప‌రేటర్ల‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్న అధికారులు... ఇష్టం ఉన్నా, లేక‌పోయినా త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి ఇంటిలో ఫైబ‌ర్ నెట్ కేబులే ఉండేలా వ్య‌వ‌హరిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

కొన్ని చోట్ల కేబుల్ ఆప‌రేట‌ర్లు అధికారుల మాట విన‌డం లేద‌ని, అలాంటి వారిపై అధికారులు బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని, అప్ప‌టికీ విన‌ని వారి కేబుల్ వైర్ల‌ను కోసేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అధికారుల తీరు చూస్తుంటే... ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట‌వుతున్న ఫైబ‌ర్ నెట్ ను ప్ర‌తి ఇంటిలోకి బ‌ల‌వంతంగా జొప్పించేందుకే చంద్రబాబు స‌ర్కారు ల‌క్ష్యంగా క‌నిపిస్తోందని ఆయ‌న చెప్పారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వం త‌న‌కు ఇష్ట‌మైన ఛానెళ్లను మాత్ర‌మే ప్ర‌సారం చేసి... త‌న‌కు ఇష్టం లేని ఛానెళ్ల‌ను ప్ర‌జ‌ల ఇళ్ల‌ల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకునే దిశఃగా ప‌య‌నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప‌క్కా ఆధారాల‌తో ఉండ‌వ‌ల్లి సంధించిన ఈ లేఖాస్త్రానికి చంద్ర‌బాబు స‌ర్కారు నుంచి ఏం స‌మాధానం వ‌స్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/