Begin typing your search above and press return to search.

చేతులు జోడించినా.... మాట్లాడరా... ఏపీకి బ్లాక్ డే...?

By:  Tupaki Desk   |   18 Feb 2022 10:32 AM GMT
చేతులు జోడించినా.... మాట్లాడరా... ఏపీకి బ్లాక్ డే...?
X
ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా అసలు జరగ‌లేదని ఆయన అన్నారు. ఒక రాష్ట్రాన్ని రూల్స్ ని పక్కన పెట్టేసి అడ్డగోలుగా విభజించి మాకు తోచింది చేశామని ఏపీని అలా నాటి యూపీఏ సర్కార్ పెద్దలు వదిలేశారని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీ విభజన నిబంధనల ప్రకారం జరగలేదని ఆయన అన్నారు. పార్లమెంట్ నిబంధనలను పక్కన పెట్టి మరీ ఏపీని విభజించారని ఆయన మండిపడ్డారు.

ఈ విషయం మీద తాను న్యాయ పోరాటం చేస్తున్నానని, తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అల్లంకి రమేష్ ద్వారా అర్జెంట్ హీయరింగ్ కింద పిటీషన్ దాఖలు చేశానన్నారు. తాను వేసిన పిటిషన్ కి సంబంధించి ఏపీ కూడా రియాక్ట్ కావాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి చేతులు జోడించి వేడుకుంటున్నట్లుగా చెప్పారు.

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజును ఉండవల్లి గుర్తు చేసుకున్నారు. ఏపీ చరిత్రలో ఈ రోజును బ్లాక్ డే’గా పేర్కొంటూ, విభజన అశాస్త్రీయంగా, అనైతికంగా జరిగిందని ఉండవల్లి పునరుద్ఘాటించారు. ఇక జ‌మ్మూ కాశ్మీర్ విభజనపై కాంగ్రెస్ బిజెపిని ప్రశ్నించినప్పుడు, హోం మంత్రి అమిత్ షా ఆంధ్రా విభజనతో ఆ పార్టీకి ఎదురుదాడి చేశారు. ఏపీ విభజన క్రమపద్ధతిలో జరగలేదని అమిత్ షా, ప్రధాని మోదీ ఇద్దరూ చెప్పారని, అందుకే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కారం లేకుండా పడి ఉన్నాయని ఉండవల్లి అన్నారు.

చాలా మంది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఉమ్మడి ఏపీ విభజనను ఆనాడు వ్యతిరేకించాయని, అందుకే ఎలాంటి ఎటువంటి చర్చ మరియు ఓటింగ్ ప్రక్రియ లేకుండానే, బిల్లు లోక్‌సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ ఆమోదించబడిందని మాజీ ఎంపీ వెల్లడించారు. ఇక ఆనాడు పార్లమెంట్‌లో ఏపీ విభజనపై ఏపీ ఎంపీలు మాట్లాడితే టీఆర్‌ఎస్ ఎంపీలు రెచ్చిపోయి గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

ఏపీ విభజన చట్టం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ సభలో లేరు. అయినప్పటికీ ఆ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకుని టీయారెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ అత్యంత ధనిక రాష్ట్రమని, ఆంధ్ర పేద రాష్ట్రమని కేసీఆర్ ఇపుడు చెబుతున్నారు. మరో వైపు చూస్తే లేటెస్ట్ గా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, మమ్మల్ని అందులో భాగస్వాములను చేసి, విభజన వల్ల ఆంధ్రకు న్యాయం జరిగేలా సహకరించాలని ఆయనను కోరుతున్నానని ఉండవల్లి కోరారు

ఇక ఏపీకి ఇంతటి దుర్గతిని పట్టించి అడ్డగోలుగా విభజన చేస్తే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగన్ మౌనంగా ఉండడమేంటి అని ఆయన అన్నారు. జగన్ మౌనంతో మరింతగా ఏపీకి అన్యాయం జరుగుతోందని కూడా ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఏపీ విభజన జరిగిన తీరు దారుణమని చెప్పానని, అదే మాటను ఇప్పటికి అనేకసార్లు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు.

మరి బీజేపీ పెద్దలు కూడా ఇలా ఏపీని విభజించడం దారుణమని చెప్పాక అయినా ఏపీ నాయకులు దీని మీద నిలదీయకపోతే అంతకంటే బాధాకరం మరోటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఏపీ అన్ని విధాలుగా నష్టపోతున్నా, ఏపీకి రావాల్సినవి కేంద్రం ఇవ్వకపోయినా చంద్రబాబు జగన్ చోద్యం చూస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ ఇద్దరూ రాజకీయంగా గొడవలు పడితే పడండి కానీ ఏపీకి అన్యాయం చేయడమేంటి అని ఆయన నిలదీశారు.

ఇక జగన్ ఇప్పటికైనా ఏపీకి జరిగిన అన్యాయం మీద తన పార్టీకి చెందిన ఎంపీలతో పార్లమెంట్ లో చర్చను పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవిడవిట్ ఇవ్వాలని కూడా కోరారు. ఏపీకి జరిగిన అన్యాయం మీద పూర్తి ఆధారాలు తాను సుప్రీం కోర్టుకు సమర్పించానని ఆయన అన్నారు. ప్రభుత్వం పరంగా నాడు చంద్రబాబు స్పందించలేదు, ఇపుడు జగన్ అయినా స్పందించాలని ఆయన కోరారు.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఏపీ విభజన, పోలవరం అంశాలపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ సూచించారు. మొత్తం మీద చూసుకుంటే ఉండవల్లి వారం రోజుల తేడాలో మరోమారు మీడియా ముందుకు వచ్చి ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టడం విశేషం. ఇక్కడ ఒక పాయింట్ అయితే అందరికీ ఆలోచింపచేస్తోంది.

ఏపీకి ఇంతటి అన్యాయం జరిగింది. అన్ని రకాల ఆధారాలతో ఉండవల్లి కేసు వేశారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి అన్నదే అందరి సందేహం. అదే విధంగా ఏపీకి రావాల్సిన వాటి మీద పార్లమెంటులో చర్చ జరిగితే యావత్తు దేశానికి మరోసారి తెలిసి వస్తుంది కదా, కేంద్రం కూడా ఏమైనా సాయం చేయవచ్చు కదా. ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయరని కూడా ఏపీ ప్రజల సూటి ప్రశ్న.

గతంలో ఉండవల్లి ఏపీ విభజన అన్యాయం అంటే ఎవరికీ పెద్దగా పట్టలేదు కానీ వరసబెట్టి ఆయన మీడియా సమావేశాలు పెట్టి మొత్తం వాస్తవాలు వివరిస్తూండడంతో సామాన్యుడికి కూడా అన్నీ అర్ధం అవుతున్నాయి. ఒక విధంగా సగటు ఏపీ పౌరుడు ఈ విషయాలను తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు బాధ్యతగా ఏపీ సర్కార్, అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు స్పందించకపోతే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు అన్నది అయితే ఉంది. ఇక ఇదే ఊపున ఉండవల్లి కూడా ఏపీ అంతా తిరిగి జనాభిప్రాయం కూడగట్టాలని ఏపీ సర్కార్ మీద తీవ్ర వత్తిడి పెంచేలా చూడాలని కూడా సూచనలు అందుతున్నాయి.