Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై ఉండవల్లికి జాలేస్తోందట

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:18 PM GMT
చంద్రబాబుపై ఉండవల్లికి జాలేస్తోందట
X
చంద్రబాబు అధికార పార్టీ అధినేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉండవల్లి ఏమో రాష్ట్రంలో అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకు ఏ పదవీ లేదు. అలాంటి వాడు చంద్రబాబును చూసి జాలిపడుతున్నాడట. బాబును చూసి జాలి పడటమే కాక.. తన మీద తనకే జాలి వేస్తోందని అంటున్నారు ఉండవల్లి. ప్రత్యేకహోదా విషయంలో పోరాడమని అంటుంటే.. చంద్రబాబు అరిటాకు-ముల్లు సామెత చెప్పడం ఏంటంటూ ఉండవల్లి విమర్శించారు.

‘‘ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ కు ఎప్పటినుంచో ఉన్న హక్కు. దాని కోసం పోరాడమంటే చంద్రబాబు సామెతలు చెబుతున్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే జాలి కలుగుతోంది. నా మీద నాకే జాలేస్తోంది. ప్రజలు అనుకుంటున్నట్లుగా కేసుల గురించి ఏమైనా భయపడుతున్నారేమో అర్థం కావట్లేదు. ఒకవేళ కేసులున్నా కూడా మీరు తిరగబడితే అరెస్టు చేసే దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఇలా భయపడుతూ ఉంటే మాత్రం కచ్చితంగా చర్య తీసుకుంటారు. అసలు మీకు తిరగబడాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? మూడేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి ఏం చేసినా పర్వాలేదని అనుకుంటున్నారా? చంద్రబాబు ఉద్రేకం మొత్తం మూడు రోజుల్లో జావగారి పోయింది. ఏమైనా అయితే తనకు నష్టమని బాబు డైరెక్టుగా చెప్పేస్తున్నాడు. ఐతే పోరాడటం వల్ల ఆయనకేమైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. మనకు రావల్సిన దాన్ని గట్టిగా అడగాల్సింది పోయి.. అరిటాకు చిరిగిపోతుందని మాటలు మాట్లాడ్డమేంటి?’’ అంటూ ఉండవల్లి చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.

చంద్రబాబును తిడుతూ పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు ఉండవల్లి. జలయజ్నం చేసి దేశాన్ని దోచేశారని రాజశేఖరరెడ్డి మీద అనేక ఆరోపణలు చేశారని.. కానీ ఆయన కట్టించిన పోలవరం కాలవకు ఒక్క చిన్న చిల్లు కూడా పడలేదని.. ఐతే చంద్రబాబు గొప్పలు చెప్పుకుని కట్టించిన కాలువకు ఏడాది లోపే రెండు గండ్లు పడ్డాయని అన్నారు. అప్పట్లో 17,500 క్యూసెక్కుల ప్రవాహానికి సరిపోయేలా రాజశేఖరరెడ్డి కాలువలు కట్టిస్తే.. ఇప్పుడు 3,500 క్యూసెక్కుల నీళ్లకే కాలువలు కూలిపోతున్నాయని.. దీన్ని బట్టే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోందని ఉండవల్లి అన్నారు.