Begin typing your search above and press return to search.

ఒక సీఎంగా జ‌గ‌న్ ఇలా మాట్లాడొచ్చా? ఉండ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   7 July 2021 3:33 PM GMT
ఒక సీఎంగా జ‌గ‌న్ ఇలా మాట్లాడొచ్చా? ఉండ‌వ‌ల్లి
X
రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య గ‌డిచిన రెండు వారాలుగా జ‌రుగుతున్న జ‌ల వివాదాల‌పై రాజ‌మండ్రి మాజీ ఎంపీ, రాజ‌కీయ విశ్లేష‌కులు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఇటు ఏపీ ముఖ్య‌మంత్రిని, అటు తెలంగాణ సీఎంను కూడా క‌డిగి పారేశారు. ముఖ్యంగా అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా వ్య‌వ‌హ‌రించాల్సిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. చేసిన వ్యాఖ్య‌లు స‌రైన‌వి కావ‌ని.. `ఆయ‌న అలా మాట్లాడొచ్చా?`` అని ఉండ‌వ‌ల్లి నిల‌దీశారు.

``అస‌లు మీరు ఏం చేయాల‌ని అనుకుంటున్నారు? కేవ‌లం ఒకే ఒక్క మీటింగ్‌తో ఈ స‌మ‌స్య‌లు స‌మ‌సి పోతాయ‌ని, పోయాయ‌ని అనుకుంటున్నారా? మీరిద్ద‌రూ(ఏపీ, తెలంగాణ సీఎంలు) స్నేహితులు కూడా! అవ‌స‌ర‌మైన‌ప్పుడు క‌లుసుకుని చ‌ర్చించుకోలేరా?`` అని నిప్పులు చెరిగారు. తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నార‌నే తాను సంయ‌మ‌నం పాటిస్తున్నాన‌ని జ‌గ‌న్ పేర్కొన‌డంపై ఉండ‌వ‌ల్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ``ఎవ‌రు మ‌న ప్ర‌జ‌లు? తెలంగాణ‌లో ఉన్న‌వారు భార‌తీయులు కారా? ఒక ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి నోటి నుంచి వ‌చ్చే మాట‌లు ఇలా ఉంటాయా?`` అని జ‌గ‌న్‌ను దుయ్యబ‌ట్టారు.

``కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఆయ‌న జాతీయ నేత‌గా కూడా ఎద‌గాల‌ని భావిస్తున్నారు. మ‌రి అలాంటి నాయ‌కుడు ఇలాంటి విష‌యాల్లో ఇలాగేనా స్పందించేది?`` అని ఉండ‌వ‌ల్లి నిల‌దీశారు. రాయ‌ల‌సీమ జిల్లాల‌కు నీళ్లు ఇవ్వ‌క‌పోతే.. కేసీఆర్‌ను చ‌రిత్ర క్ష‌మించ‌ద‌ని హెచ్చ‌రించారు. అదేస‌మ‌యంలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇమేజ్ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న జ‌గ‌న్‌.. ముందుగా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల గోడును వినాల‌ని ఉండ‌వ‌ల్లి హిత‌వు ప‌లికారు. అప్పుడు మాత్ర‌మే పేద‌ల గుండెల్లో ముద్ర‌ప‌డ్డ‌ వైఎస్ బ్రాండ్ జ‌గ‌న్‌కు సొంతం అవుతుంద‌ని సూచించారు. ప్రాధాన్య‌త‌ల ప్ర‌కారం.. మంత్రులు కూర్చుని చ‌ర్చించుకోవ‌డం ద్వారానే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు.