Begin typing your search above and press return to search.

నేనెపుడూ చంద్ర‌బాబు క్రిటిక్ నే:ఉండ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   5 Aug 2018 9:08 AM GMT
నేనెపుడూ చంద్ర‌బాబు క్రిటిక్ నే:ఉండ‌వ‌ల్లి
X
ఇరు రాష్ట్రాల్లోని స‌మ‌కాలీన రాజ‌కీయ నాయ‌కుల్లో మాజీ ఎంపీ - సీనియ‌ర్ పొలిటిషియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కు ఉన్న ప్ర‌త్యేక‌త వేరు. సుత్తి లేకుండా ...ముక్కు సూటిగా ...చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాన్ని క‌న్విన్సింగ్ గా చెప్ప‌గ‌లిగిన నేర్పు ఉన్న నేత ఉండ‌వ‌ల్లి. అంత‌టి వాగ్ధాటి...విష‌య ప‌రిజ్ఞానం ఉన్న ఉండ‌వ‌ల్లిని సీఎం నుంచి సీనియ‌ర్ నాయ‌కుల వ‌ర‌కు గౌర‌విస్తారు. పోల‌వరం లెక్క‌ల‌పై....టీడీపీ - చంద్ర‌బాబుల‌ను విమ‌ర్శించిన ఉండ‌వ‌ల్లిని....కొద్ది రోజుల క్రితం స్వ‌యంగా చంద్ర‌బాబు పిలిచి స‌ల‌హా అడిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఏపీ రాజకీయాలపై ఉండ‌వ‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉన్నందున ఏమైనా జరగొచ్చని, చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దని ఉండ‌వ‌ల్లి అన్న‌ట్లు మీడియాలో వార్తలు వ‌చ్చాయి. చంద్ర‌బాబును జ‌గ‌న్ ఎదుర్కొన లేరు అంటూ జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించిన‌ట్లు ప‌లుర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ప్ర‌ముఖ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉండ‌వ‌ల్లి....ఆ వ్యాఖ్య‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. అస‌లు తాను ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని....తాను అన్న మాట‌ల‌ను ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు అన్వ‌యించుకొని ...మీడియాలో వార్త‌లు రాశార‌ని అన్నారు.

కొద్ది రోజుల క్రితం చంద్రబాబును క‌లిసిన త‌ర్వాత ఉండ‌వల్లి స్వ‌రం మారింద‌ని...టాక్ వ‌స్తోంద‌న్న ప్ర‌శ్న‌కు ఉండ‌వ‌ల్లి త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చారు. త‌న స్వ‌రం మారిందో లేదో మీరే క‌నిపెట్టాల‌ని....చంద్ర‌బాబును ఎదుర్కొనే స‌త్తా జ‌గ‌న్ కు లేదు...అని ర‌క‌ర‌కాల హెడ్డింగ్ లు పెట్టార‌ని.....మీరే హెడ్డింగ్ లు పెట్టి మీరే మోస‌పోతే ఎలా అని ఆ విలేక‌రిని ఉద్దేశించి చ‌మ‌త్క‌రించారు.చంద్ర‌బాబును జ‌గ‌న్ ఎదుర్కొన‌లేడు అన్న కామెంట్ తాను చేయ‌లేదని....ఎవ‌రికి వారు సొంత వ్యాఖ్యానాలు చేసుకొని హెడ్డింగ్ లు పెట్టుకున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌గ‌న్ మోస్ట్ అడ్వాంటేజ్ పొజిష‌న్ లో ఉన్నాడ‌ని.....అయితే, ఎల‌క్ష‌న్ ల‌కు ఏడాది స‌మ‌యం ఉన్నందున ప‌రిణామాలు ఇప్పుడే చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని తాను అన్నాన‌ని ఉండ‌వ‌ల్లి గుర్తు చేశారు. చంద్ర‌బాబుకు ఎల‌క్ష‌న్ మేనేజ్ మెంట్ తెలుస‌ని - జ‌గ‌న్ ద‌గ్గ‌ర అలా ఎల‌క్ష‌న్ మేనేజ్ మెంట్ తెలిసిన‌ వారున్నారో లేదో త‌న‌కు తెలీద‌ని మాత్ర‌మే అన్నాన‌ని చెప్పారు. 2014లో కూడా ఇలానే అనుకున్నార‌ని...లాస్ట్ మినిట్ లో చంద్ర‌బాబు గెలిచార‌ని....చంద్ర‌బాబును త‌క్కువ అంచ‌నా వేయొద్ద‌ని మాత్ర‌మే తాను చెప్పాన‌ని అన్నారు.

తాను చాలాకాలం నుంచి ఒకే మాట చెబుతున్నాన‌ని....వైఎస్ కొడుకుగా జ‌గ‌న్ త‌న‌కు సుప‌రిచితుడ‌ని....వైసీపీలోనే కాంగ్రెస్ వారు ఎక్కువ‌గా ఉన్నార‌ని అన్నారు. ఒక‌వేళ రేపు రేపు ఏద‌న్నా మినిస్ట‌ర్ తో ప‌ని ఉండి ఆయ‌న‌తో మాట్లాడాలంటే జ‌గ‌న్ సీఎం అయితే త‌న‌కు ఆ అవ‌కాశం ఉంటుంది త‌ప్ప‌ - చంద్ర‌బాబు సీఎం అయితే ఆ అవ‌కాశం ఉండ‌ద‌ని....సీక్రెట్ గా మాట్లాడాలని అన్నారు. చంద్ర‌బాబుతో మాట్లాడితే....దానిని ఓ కాన్ స్పిర‌సీ...కుట్ర అని అంటార‌ని...వాస్త‌వానికి నేనెపుడూ చంద్ర‌బాబుకు క్రిటిక్ గానే ఉన్నాన‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న్ సీఎం అయితేనే త‌న‌కు అడ్వాంటేజ్ అన్న ఉండ‌వ‌ల్లి తాజా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి...2019లో వైసీపీ గెల‌వాల‌న్న‌ది ఉండ‌వ‌ల్లి మ‌న‌సులో మాట‌లా అనిపిస్తోంది. అందుకే బాబుతో పోటీప‌డాలంటే జ‌గ‌న్ మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఎల‌క్ష‌న్ మేనేజ్ మెంట్ చేయాలని ఉండ‌వ‌ల్లి అభిప్రాయ ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.