Begin typing your search above and press return to search.

జగన్‌ కు ఉండవల్లి క్లీన్ చిట్

By:  Tupaki Desk   |   19 March 2018 4:48 PM GMT
జగన్‌ కు ఉండవల్లి క్లీన్ చిట్
X
జగన్ పేరెత్తితే చాలు రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు గుప్పిస్తారు టీడీపీ నేతలు. ఈ ఆరోపణలు వినీవినీ చాలామంది నిజమనే అనుకుంటుంటారు. కానీ.. నిజానికి జగన్‌ పై ఉన్న అక్రమాస్తుల కేసుల లెక్కెంతో తెలుసా...? రూ.1300 కోట్లు. అందులోనూ రూ.500 కోట్ల లెక్కకు కేసులు తేలిపోయాయి. దీంతో ఇక మిగిలింది రూ.800 కోట్ల విషయంలో కేసులు మాత్రమే. కానీ... టీడీపీ నేతలు మాత్రం ఇప్పటికీ రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ జగన్‌ పై నిందలేస్తూనే ఉన్నారు. అయితే.. జగన్ కూడా ఎప్పుడూ చెప్పని ఈ లెక్క బయటకెలా వచ్చిందో తెలుసా... వైఎస్ అభిమాని - నిజాలు బయటపెట్టడంలో స్పెషలిస్టు అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ లెక్క బయటపెట్టారు.

ఉండవల్లి సోమవారం ఓ చానల్‌ లో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు బయటపెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆధారాలను బయటపెడితే ఎవరూ పట్టించుకోవడం లేదని ఉండవల్లి అన్నారు. జగన్ లక్ష కోట్లు తిన్నాడని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నా అసలు జగన్ మీద మొత్తం పెట్టిన 13 చార్జీషీట్ల విలువ రూ.1300 కోట్లు అని చెప్పారు. అంతేకాదు... ఇటీవల ఎయిర్‌ పోర్టులో జగన్‌ ను తాను కలిశానని.. ఆ సందర్భంగా ఆయన ఇంకో విషయం చెప్పారని... ‘‘అన్నా నువ్వు 1300 కోట్లకు చార్జి షీటు ఉందని చెప్తున్నావు. కానీ, అందులో రూ.500 కోట్ల విలువకు సంబంధించి కేసులు క్లియర్ అయిపోయాయి... ఇంకా రూ.800 కోట్లపైనే వివాదం ఉంది’’ అని చెప్పారు. రూ.800 కోట్లకు కేసులున్న వ్యక్తిపై రూ.లక్ష కోట్లు అంటూ నిందలేయడం సరికాదని ఉండవల్లి అన్నారు.

జగన్ తనపై ఉన్న కేసుల గురించి ప్రజలకు వివరిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఈ విషయం తాను జగన్‌ తో - ఆ పార్టీ వాళ్లతో పలుమార్లు చెప్పానని.. జగన్ కూడా అసెంబ్లీలో ఈ విషయం చెప్పారట కానీ, తాను అప్పుడు వినలేదని ఉండవల్లి అన్నారు. తండ్రి సీఎం అయినంత మాత్రాన ఎవరూ బిజినెస్ చేయకూడదని రూలేమీ లేదని... అంతేకాదు.. జగన్ పెట్టింది పెట్టుబడి అని, ఆయన రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టారని అన్నారు. అదే లంచం అయితే, దానికి రసీదు ఇస్తారా..? కానీ, జగన్ వారికి షేర్లు ఇచ్చి - రసీదు ఇచ్చాడని - ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ఉండవల్లి ప్రశ్నించారు. అయితే, జగన్ రసీదు ఇచ్చాడు కాబట్టి ఇలా కేసుల్లో ఇరుక్కుపోయాడని అన్నారు.

అంతేకాదు.. జగన్ వద్ద ఎంత డబ్బుందో కూడా ఉండవల్లి చెప్పారు. జగన్ వద్ద ఉన్న డబ్బు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌లో రిజిస్టర్ అయి ఉన్నవే తప్ప ఒక్క రూపాయి ఎక్కువ లేదని, ఈ విషయాన్ని జగన్ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదో తెలియడం లేదన్నారు. అంత డబ్బు లేదని తెలిస్తే ప్రమాదమని జగన్ భావిస్తున్నారేమో అని ఆయన అన్నారు.