Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి తీర్పు!... జ‌నం మ‌దిలో జ‌గనే!

By:  Tupaki Desk   |   31 March 2018 9:32 AM GMT
ఉండ‌వ‌ల్లి తీర్పు!... జ‌నం మ‌దిలో జ‌గనే!
X
ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌... ఏమాత్రం ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరే. రాష్ట్ర విభ‌జ‌న దాకా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగిన ఈ మాజీ ఎంపీ రాజ‌కీయాల‌పై స‌మ‌గ్ర విశ్లేష‌ణ చేయ‌గ‌లిగిన నేత‌గా ఉండ‌వ‌ల్లికి మంచి పేరే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. భ‌విష్య‌త్తు ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌డంలోనే కాకుండా జ‌నం మ‌దిలో ఏముందున్న విష‌యాన్ని నిగ్గు తేల్చ‌డంలోనూ ఉండ‌వ‌ల్లి ఘ‌నాపాఠేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆయా పార్టీల విధి విధానాలు - ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయా పార్టీలు ఇచ్చిన హామీలు - అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ పార్టీలు నెర‌వేర్చిన హామీలు... ఇలా ప్ర‌తి అంశంపైనా స‌మ‌గ్ర వివ‌రాల‌న్నీ చేతిలో పెట్టుకునే ఉండ‌వ‌ల్లి మీడియా ముందుకు వ‌స్తారు. నిత్యం స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను చాలా ద‌గ్గ‌ర‌గానే చూడ‌టంతో పాటు వాటిపై విశ్లేష‌ణ‌ను కూడా సిద్ధం చేసుకుని మ‌రీ ఉండ‌వ‌ల్లి రంగంలోకి దిగుతారు. మొత్తంగా ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా ఉండ‌వల్లిని ఇబ్బంది పెట్టే మీడియా ప్ర‌తినిధే ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో. ఎందుకంటే... తాను మాట్లాడే అంశంపై స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌తో పాటుగా స‌ద‌రు అంశంపై మీడియా సంధించే ప్ర‌శ్న‌లను కూడా ముందే ఊహించి వాటికి స‌మాధానాల‌ను కూడా సిద్ధం చేసుకుని ఉండ‌వ‌ల్లి ఎంట్రీ ఇస్తార‌ట‌.

ఇంత‌టి ప‌క్కా స‌న్న‌ద్ధ‌త క‌లిగిన రాజ‌కీయ నేత‌లు చాలా అరుదుగానే ఉంటార‌ని చెప్పాలి. అయినా ఇప్పుడు ఉండ‌వ‌ల్లికి సంబంధించి ఇంత గొప్ప‌గా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఉద్య‌మంలోకి దిగేశాయి. అంతేకాకుండా మ‌రో ఏడాదిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇలాంటి కీల‌క త‌రుణంలో అందుబాటులో ఉన్న సింగిల్ ఇయ‌ర్‌ ను ఆయా పార్టీలు ఎలా స‌ద్వినియోగం చేసుకుంటాయ‌న్న అంశ‌మే ఎన్నిక‌ల్లో ఆ పార్టీల‌కు కీల‌కం కానుంది. ఇది భ‌విష్య‌త్తు అంశ‌మైతే... ప్ర‌స్తుతం ఉన్న జ‌నం నాడి మేర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? అలా అదికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలున్న నేత‌ల్లో ఎవ‌రికి ఎన్ని మార్కులు ఇస్తారు? అందుకు గ‌ల కార‌ణాలు ఏమిటి? అన్న ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఉండ‌వ‌ల్లి చాలా సూటిగానే స‌మాధానాలు ఇచ్చేశారు.

ఉండ‌వ‌ల్లి మార్కులేసిన లీడ‌ర్లు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీలో కీల‌క పార్టీల‌కు అధినేత‌లుగా కొన‌సాగుతున్న నారా చంద్ర‌బాబునాయుడు - వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ లే. వీరు ముగ్గురిలో వైఎస్ జ‌గ‌న్ కు ఫుల్ మార్కులేసిన ఉండ‌వ‌ల్లి... ఆయ‌న‌ను టాప్ ర్యాంకులో కూర్చోబెట్టారు. ఇందుకు గ‌ల కార‌ణాన్ని వివ‌రిస్తూ... జ‌గ‌న్ త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాదిరే ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తార‌న్న భాన‌న ప్ర‌జ‌ల్లో ఉంద‌ట‌. అంటే ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చే హామీల‌ను జ‌గ‌న్ అమ‌లు చేసి తీరతార‌ని ఉండ‌వ‌ల్లి తేల్చేశారు. ఇక రాజ‌కీయాల్లో నిల‌క‌డ లేని త‌నంతో త‌న అభిమానుల‌తో పాటు జ‌నాన్ని కూడా అయోమ‌యానికి గురి చేస్తున్న జ‌నసేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉండ‌వ‌ల్లి రెండో ర్యాంకు ఇచ్చారు. ఇందుకు గ‌ల కార‌ణాన్ని వివ‌రించిన ఉండ‌వల్లి... ఆస‌క్తిక‌ర కోణాన్ని ఆవిష్క‌రించారు. ప‌వ‌న్ మాదిరి స్టార్ ఇమేజీ ఉన్న వారు ఎవ‌రు పాలిటిక్స్ లోకి వ‌చ్చినా... అప్ప‌టిక‌ప్పుడు తాము సీఎం అయిపోవాల‌ని భావిస్తార‌ని, అయితే ప‌వ‌న్‌లో ఆ భావ‌న క‌నిపించ‌డం లేద‌ని ఉండవ‌ల్లి చెప్పారు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీని ప‌టిష్ఠం చేయ‌డంపైనే ప‌వ‌న్ దృష్టి పెట్టారు త‌ప్పించి... సీఎం కావాల‌ని కోరుకోవ‌డం లేద‌ని, ఈ ఒక్క కార‌ణ‌మే ప‌వ‌న్‌కు మంచి మార్కులు ప‌డ‌టానికి కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇక టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్ర‌బాబునాయుడికి ఉండ‌వ‌ల్లి చిట్ట చివ‌రి ర్యాంకు ఇచ్చారు. జ‌గ‌న్‌కు ఫ‌స్ట్ ర్యాంకు - ప‌వ‌న్‌ కు సెకండ్ ర్యాంకు ఇచ్చిన ఉండ‌వ‌ల్లి చంద్ర‌బాబుకు మాత్రం మూడో ర్యాంకు ఇచ్చారు. ప‌నితీరును బ‌ట్టి చూస్తే... చంద్ర‌బాబు హార్డ్ వ‌ర్కింగేన‌ని చెప్పిన ఉండ‌వ‌ల్లి ఏపీ సీఎంగా ఉన్న ఆయ‌న‌కు మూడో ర్యాంకు ఇచ్చారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో బొక్క బోర్లా ప‌డ్డ చంద్ర‌బాబు... ఇప్ప‌టికే అంతా అయిపోయిన నేప‌థ్యంలో జ‌రిగిన న‌ష్టాన్ని బాబు పూడ్చుతార‌నే భావ‌న ఏ ఒక్క‌రిలో లేద‌ని, ఈ కార‌ణంగా తాను చంద్ర‌బాబుకు మూడో ర్యాంకు ఇస్తున్న‌ట్లు కూడా ఉండ‌వ‌ల్లి ప్ర‌క‌టించారు.