Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి మాట‌!...బాబుకు ఆ ధైర్యం లేదు!

By:  Tupaki Desk   |   5 Feb 2018 11:28 AM GMT
ఉండ‌వ‌ల్లి మాట‌!...బాబుకు ఆ ధైర్యం లేదు!
X
మొన్న పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగిన వైనం... ఆ త‌ర్వాత మిత్ర‌ప‌క్షాలుగానే ఉన్న టీడీపీ, బీజేపీ మ‌ధ్య అంత‌రం ఏర్ప‌డ‌టం మ‌న‌కు తెలిసిందే. ఒకానొక స‌మ‌యంలో బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుందామంటూ పార్టీ నేత‌ల నుంచి వ‌చ్చిన మాట‌ను టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు దాదాపుగా ఖ‌రారు చేశార‌ని, నేడో, రేపో ఆ దిశ‌గా నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. బ‌డ్జెట్ కంటే ముందు నుంచే బీజేపీ వ‌ద్ద‌నుకుంటే... ఓ దండం పెట్టేసి బ‌య‌ట‌కు వెళ్లిపోతామ‌ని చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌లు కూడా పెద్ద సంచ‌ల‌నం రేపాయ‌నే చెప్పాలి. అయితే జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగియ‌గానే... టీడీపీ ఎంపీలు, మంత్రుల‌తో విడ‌త‌ల‌వారీగా మంత‌నాలు సాగించిన చంద్రబాబు... రాష్ట్రానికి న్యాయం చేసేలా బీజేపీపై ఒత్తిడి తేవాల‌ని, అప్ప‌టికీ కాకుంటే ఆ త‌ర్వాత పొత్తుకు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుందామ‌ని చెప్పిన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ట‌.

అయినా బీజేపీతో చంద్ర‌బాబు మిత్ర‌బేధం పాటించే అవ‌కాశాలే లేవ‌ట‌. బీజేపీతో టీడీపీ పొత్తు ఇప్పుడ‌ప్పుడే ముగిసిపోయే అవ‌కాశాలు కూడా ఎంతమాత్రం లేవ‌ట‌. అయినా బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని చంద్ర‌బాబు సాధించేదేమీ లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. చంద్ర‌బాబు త‌మ‌తో పొత్తుకు వీడ్కోలు ప‌లికినంత‌నే బీజేపీ స‌ర్కారు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌ని, ఆ మాత్రం దానికి బీజేపీ కంగారుప‌డిపోయి... ఇప్ప‌టికిప్పుడు ఏపీకి న్యాయం చేసే దిశ‌గా చ‌ర్య‌లేమీ చేప‌ట్టే అవ‌కాశాలు లేవ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ మాట‌ల‌న్నీ నిజ‌మేనంటూ సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కాసేప‌టి క్రితం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వేదిక‌గా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి... పై విష‌యాల‌న్నీ అక్ష‌ర స‌త్యాల‌ని కూడా తేల్చేశారు.

అయినా ఉండ‌వ‌ల్లి ఈ దిశ‌గా ఏ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... చంద్రబాబునాయుడు కేంద్రంతో ఇప్పట్లో తెగదెంపులు చేసుకోరని ఆయ‌న‌ జోస్యం చెప్పారు. అంతేగాక, టీడీపీ బెదిరింపులతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంట్ వెల్‌లోకి టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తే ఏం ప్రయోజనం లేదని ఆయ‌న సెటైర్ వేశారు. ఆంధ్రాకు ఏమిచ్చినా.. కాంట్రాక్టర్ల కోసమే కానీ.. ప్రజల కోసం కాదన్న అభిప్రాయం కేంద్రంలో ఉందని ఆయ‌న‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేంద్రంతో పోరాటానికి ఇంకా అవకాశం ఉందని, నేరుగా పోరాటం చేస్తేనే ఏదైనా ఫ‌లితం ఉంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక కేంద్ర బ‌డ్జెట్‌పై పెద‌వి విరిచిన‌ ఉండ‌వల్లి... రైతులకు గిట్టుబాటు ధర శుద్ధ అబద్ధమన్నారు. వైద్యానికి ఐదు లక్షల బీమా పథకంలో అర్థం పర్థం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ కు గత నాలుగేళ్లుగా బడ్జెట్ ఏం జరిగిందో... ఇప్పుడూ అదే జరిగిందని ఉండవల్లి చెప్పారు. విభజన చట్టంలో భాగంగా విశాఖలో పెడతామన్న రిఫైనరీని ఇప్పుడు ముంబైలో పెడుతుంటే ఏమనాలని ఉండవల్లి ప్రశ్నించారు. మొత్తంగా కేంద్రంపై పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన బాబు మాట‌ల్లో ప‌స‌లేద‌ని ఉండ‌వ‌ల్లి తేల్చేశారు. మ‌రి ఈ మాట‌ల‌పై టీడీపీ ఏమంటుందో చూడాలి.