Begin typing your search above and press return to search.

అరే.. ఉండవల్లి ఏపీ గుర్తుకొచ్చిందా?

By:  Tupaki Desk   |   30 July 2016 10:11 AM GMT
అరే.. ఉండవల్లి ఏపీ గుర్తుకొచ్చిందా?
X
తెలంగాణలోని ఏ పార్టీ నేత అయినా మాట వరసకు ఆంధ్రాని.. ఉమ్మడి రాష్ట్ర పాలనను మెచ్చుకునే సాహసం చేస్తారా? అలాంటి మాటలు మాట్లాడాలనే ప్రయత్నం చేసినా.. వారి రాజకీయ జీవితం అంతే సంగతులని చెప్పక తప్పదు. కానీ.. ఏపీలో మాత్రం అందుకు పూర్తి భిన్నం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి అయిన కేటీఆర్ పుట్టినరోజుకు ఏపీలో బ్యానర్లు.. ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి. ఏపీకి అనుకూలంగా తెలంగాణలో మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఇప్పటికి ఉంటే.. ఏపీలో మాత్రం విభజనలో కీలకభూమిక పోషించిన వ్యక్తి ఫ్లెక్సీ పెట్టి తమ అభిమానాన్ని చాటుకునే పరిస్థితి.

ఈ వైరుధ్యం వల్లే కావొచ్చు.. ఏపీ నేతలకు ఏపీ ప్రయోజనాల గురించి పెద్దగా పట్టదు. ఇదిసాదాసీదా నేతల దగ్గర నుంచి మేధావులుగా చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ వరకూ కనిపిస్తుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభకు విచ్చేసిన ఉండవల్లి.. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ఉదంతాన్న కామెడీ కామెడీగా చెప్పి సభలో నవ్వులు పూయించారు. ఆ రోజు.. ఆ ఘటన ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? వేలాది కోట్ల ఆస్తిపరుడైన లగడపాటి పెప్పర్ స్ప్పే కొట్టటం ఏమిటి కామెడీ? లాంటి ఎన్నో లాజిక్కులతో కూడిన ప్రశ్నలు వేసే ఉండవల్లి.. విభజన కారణంగా ఏపీకి ఎంత అన్యాయం? దాని వల్ల భవిష్యత్ తరాలు ఎన్ని ఇబ్బందులు పడనున్నాయి?

ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కేంద్రం ఎంత దన్నుగా నిలవాలి? మోడీ సర్కారు ఎంత మోసం చేస్తోంది? విభజన నాటి హామీల్లో కేంద్రం ఎంత నిర్లక్ష్యం చేస్తుంది? ఇలాంటి ఎన్నో అంశాల మీద తన మేధోతనానికి పదును పెట్టి.. కోట్లాది ఆంధ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేం దరిద్రమో కానీ.. ఇలాంటి పనికొచ్చే పనులు చేయని ఉండవల్లి.. ఏసీతో నిండిన వేదిక మీద సాటి ఆంధ్రుడి మీద జోకులేసే పరిస్థితి. అదే సమయంలో.. విభజన సమయంలో చాలా అపోహలు పడ్డామని.. అవన్నీ ఉత్త భ్రమలుగా చెప్పేసి.. ఆంధ్రోళ్ల ఆవేదనను కామెడీగా మార్చటమే కాదు.. తాను సైతం జోకర్ గా మారి.. పలు తెలంగాణ టీవీ ఛానళ్లలో దర్శనమిచ్చే పరిస్థితి.

ఇలాంటి ఉండవల్లికి తాజాగా ఏపీ మీదా.. ఏపీ ప్రజల మీద మోడీ సర్కారు కక్ష కట్టినట్లుగా కనిపించింది. ఏపీ ప్రజల్ని బీజేపీ మోసం చేస్తుందంటూ ఆయన గళం విప్పారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని.. అందుకే ప్రత్యేక హోదా అడుగుతున్నట్లుగా చెప్పిన ఆయన.. హోదా ఎందుకు అమలు చేయటం లేదో కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలపై కేంద్రానికి ఎందుకింత కక్ష అని అడిగిన ఉండవల్లి.. కేంద్రాన్ని చంద్రబాబుఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దాకా ఎందుకు.. లాజిక్కులు బాగా తెలిసిన ఉండవల్లి ఎందుకు గళం విప్పటం లేదు? తన వాగ్దాటితో మోడీ అండ్ కోను ఎందుకు దులిపేయటం లేదు..? తాను చేయాల్సింది చేయకుండా వాళ్లు.. చేయలేదు.. వీళ్లు చేయటం లేదని అనుడేంది ఉండవల్లి. తెలంగాణను పొగడటం తగ్గించి. ఆంధ్రోళ్ల అవస్థల మీద దృష్టి పెడితే బాగుంటుందేమో..?