Begin typing your search above and press return to search.

ర‌ఘువీరా!..ఉండ‌వ‌ల్లికి ఆన్స‌ర్ చెప్పండి!

By:  Tupaki Desk   |   25 Feb 2019 11:32 AM IST
ర‌ఘువీరా!..ఉండ‌వ‌ల్లికి ఆన్స‌ర్ చెప్పండి!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌తో కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించిన న‌వ్యాంధ్ర‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌ని నాడు ఏపీ నేత‌లు ప‌ట్టుబ‌ట్ట‌గా... ప్ర‌ధాని హోదాలో నాటి పీఎం మ‌న్ మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ ఓటమి పాలైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే నాడు ఏపీకి ప్ర‌త్యేక హోదా ప‌దేళ్ల పాటు ఇవ్వాల‌ని నిన‌దించిన బీజేపీ... తాను అధికారంలోకి వ‌చ్చినా... మాట నిలుపుకోక‌పోగా.. ఏపీని మోసం చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ద‌ఫా త‌మకు అధికారం క‌ట్ట‌బెడితే... తొలి సంత‌కం ఏపీకి ప్ర‌త్యేక హోదాపైనే పెడ‌తానంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మొన్న తిరుప‌తి వేదిక‌గా ఘ‌నంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను ప‌ట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇప్పుడు ఏపీలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. రాహుల్ పీఎం కావ‌డం గ్యారెంటీ అని - ఆ వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా రావ‌డం కూడా గ్యారెంటీ అని డంక బ‌జాయించి చెబుతున్నారు.

విన‌డానికి బాగానే ఉన్నా... ఈ మాట‌లో ఏ మేర వాస్త‌వ‌ముంద‌న్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీలోనే మొన్న‌టిదాకా కొన‌సాగిన సీనియ‌ర్ రాజకీయ‌వేత్త‌ - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అస‌లు ప్ర‌ధాని అయ్యే అవ‌కాశాలు రాహుల్ గాంధీకి ఏమాత్రం లేవ‌ని తేల్చేసిన ఆయ‌న.... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎలా తెస్తారో చెప్పాలంటూ ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నేత‌లకు - ముఖ్యంగా పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డిని సూటిగా ప్ర‌శ్నించేశారు. నిన్న తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కేంద్రంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఉండ‌వ‌ల్లి ఈ దిశ‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పిన ఆయ‌న‌... 250 సీట్లు వ‌స్తే గానీ రాహుల్ గాంధీ పీఎం కాలేని ప‌రిస్థితి ఉంటే... 150 సీట్ల‌తోనే ప్ర‌ధాని ఎలా కాగ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు. ఈ మాట‌తోనే స‌రిపెట్ట‌ని ఉండ‌వ‌ల్లి... అస‌లు రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయ్యే ప‌రిస్థితే లేద‌ని కూడా తేల్చి పారేశారు. రాహుల్ గాంధీ ప్ర‌ధాని కాలేన‌ప్పుడు... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎలా తెస్తార‌ని కూడా ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు.

ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌డం చాలా ఈజీనే అయినా వాటిని అమ‌లు చేసే విష‌యంలో నేత‌లు కాస్తంత క్లారిటీతో మాట్లాడితే బాగుంటుంద‌ని కూడా ఉండ‌వ‌ల్లి సూచించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తిరుప‌తి స‌భ‌లో చేసిన ప్ర‌సంగాన్ని గుర్తు చేసిన ఉండ‌వ‌ల్లి... కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్లిచ్చారు. కేంద్రంలో ప్ర‌భుత్వం మారిన వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని రాహుల్ చెప్పార‌ని, అస‌లు కేంద్రంలో ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి ఎక్క‌డుంద‌ని ఉండ‌వల్లి ప్ర‌శ్నించారు. క్లియ‌ర్ మెజారిటీ కాంగ్రెస్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని, అలాంట‌ప్పుడు ఏ పార్టీ కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తు ఇస్తుందో కూడా చెప్ప‌కుండా... ఊరికే మేం అధికారంలోకి వ‌స్తున్నాం - ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆ పార్టీ నేత‌ల‌కు స‌రికాద‌ని కూడా ఉండ‌వ‌ల్లి చెప్పారు. మ‌రి రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం ఖాయ‌మ‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్న ర‌ఘువీరారెడ్డి.... ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.