Begin typing your search above and press return to search.

జగన్ సీఎం... పోలీస్ సర్వే !

By:  Tupaki Desk   |   3 Jan 2019 1:30 AM GMT
జగన్ సీఎం... పోలీస్ సర్వే !
X
ఎన్నికల ప్రచారంలో సర్వే ఒక అస్త్రంగా మారింది. ఎవరికి వారు సర్వేల పేరిట తమ పార్టీ గెలుస్తుందంటే, తమ పార్టీ గెలుస్తుందని నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరకొడతారు. అయితే ఏ పార్టీ గెలుస్తుందో నిక్క‌చ్చిగా చెప్పగలిగేది ఓటరు మాత్రమే.. ఇదీ వాస్తవం... ఇదే వాస్తవం...

ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలలో వైఎస్‌ఆర్ పార్టీ అధినేత వైెఎస్ జగన్‌దే విజయమని ఉండవల్లి అరుణ్‌ కుమార్ అన్నారు. సర్వేలు, విశ్లేషణలు ఇవి ఏవీ కూడా నిజం కాదని, ప్రజల మధ్య ఉండి, వారిని దగ్గరగా చూసిన వారు మాత్రమే ప్రజల నాడి చెప్పగలడని ఆయన అన్నారు. పోలీసులు జనం మధ్యనే ఉంటారు కాబట్టి, వారి కదలికలు గమనిస్తే, కాబోయే సీఎం ఎవరు అన్నది మనం ఊహించవచ్చునని ఆయన విశ్లేషించారు.

ఒక పోలీస్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకు సెల్యూట్ చేయడం లేదంటే, ఆ పార్టీ అధికారంలోకి రాదని నిర్దరణకు రావచ్చని ఉండవల్లి అన్నారు. అదే ప్రతిపక్షనేతకు ఒక పోలీసు సెల్యుట్ చేసాడంటే ఆ నియోజకవర్గంలో ఆ నేత తప్పకుండా అధికారంలోకి వస్తాడని ఆయన విశ్లేషించారు.

పోలీసులు ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉంటారు కాబట్టి వారికి ఓటరు ఎవరి వైపు మొగ్గాతాడో తెలుస్తుందని ఆయన అన్నారు. పాదయాత్రలో జగన్‌కు వస్తున్న ప్రతిస్పందనను ఆయన అభినందించారు. జగన్‌ పాదయాత్రకు వస్తున్న స్పందన ఇప్పటి వరకూ ఏ నాయకుడికి రాలేదని, ప్రజలతో జగన్ కూడా బాగా ఇంట‌రాక్ట్‌ అవుతున్నారని ఉండవల్లి అన్నారు. జగన్ తన తండ్రి కంటే కూడా మంచి వక్త అని ఆయన అభివర్ణించారు. ఎక్కడ కూడా "వాట్ ఐయామ్ సేయింగ్" లాంటి పదాలు వాడటం లేదని ఆయన అన్నారు.

ప్రజలలో వచ్చిన స్పందనతో గెలుపుపై ధీమాగా ఉండవద్దని జగన్‌కు సూచించారు. చంద్రబాబు నాయుడు మామూలు రాజకీయ నాయకుడు కాదని, చివరి వరకూ కూడా గెలుపు కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉంటాడని ఆయన హెచ్చరించారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు జగన్‌పై కేసులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని, చంద్రబాబు మంచి వక్త కాదు కాని, ఆచీ తూచీ మాట్లాడతారని ఆయన విమర్శించారు.