Begin typing your search above and press return to search.

'పోల‌వ‌రం' పై కుటుంబ‌రావుకు ఉండ‌వల్లి స‌వాల్!

By:  Tupaki Desk   |   25 Sep 2018 12:41 PM GMT
పోల‌వ‌రం పై కుటుంబ‌రావుకు ఉండ‌వల్లి స‌వాల్!
X
గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లో అవినీతి పెరిగిపోయింద‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. మునుపెన్న‌డూ లేని విధంగా భూక‌బ్జాలు మొద‌లు.....రోడ్డు కాంట్రాక్టుల వ‌ర‌కు అన్నింటిలోనూ టీడీపీ స‌ర్కార్ అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డుతోంద‌ని ప్ర‌తిపక్షాలు ఆరోపిస్తున్న విష‌యం విదిత‌మే. ఇక ఏపీకి జీవ‌నాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టులో కూడా చంద్ర‌బాబు ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్ప‌డింద‌ని సీనియ‌ర్ పొలిటిషియ‌న్ ఉండవల్లి అరుణ్ కుమార్ ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. తాజాగా, పోల‌వంలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై కాగ్ నివేదిక నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై మ‌రోమారు ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. పోల‌వరం ప్రాజెక్టు నుంచి అన్న క్యాంటీన్ వరకూ చంద్ర‌బాబు పాల‌నంతా అవినీతిమ‌య‌మ‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదిక‌లో విష‌యాల‌ను చంద్ర‌బాబు సమాధానం చెప్పాలని ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబుపై ఉండ‌వ‌ల్లి నిప్పులు చెరిగారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీల‌క‌మైన పనులు పెండింగ్ లో ఉన్నాయ‌ని, 2019లో పోల‌వ‌రం పూర్తి చేయడం సాధ్యం కాద‌ని కాగ్ చెప్పింద‌ని ఉండవల్లి అన్నారు. అయినా కూడా - కాంట్రాక్టర్లకు కోట్లు ముట్ట‌జెప్పేందుకు రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారని ఆయ‌న ప్రశ్నించారు.అన్న క్యాంటీన్ల అంతా అవినీతేనని - 'ఆదరణ పథకం`లో ఎన్నో అవ‌క‌త‌వ‌క‌లున్నాయ‌ని ఆరోపించారు. ఏపీకి జీవ‌నాడి వంంటి పోల‌వ‌రం విష‌యంలో బాబు నిర్లక్ష్యపూరిత ధోర‌ణి స‌రికాద‌న్నారు. పట్టిసీమ కాంట్రాక్టర్లకు 22 శాతం నిధులు అదనంగా ఎందుకు ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్‌ చేశారు. థర్డ్‌ పార్టీతో పోలవరం పనుల నాణ్య‌త‌ను ఎందుకు ప‌రిశీలించ‌డం లేద‌ని, హెరిటేజ్‌ పనులపై పెట్టిన శ్రద్ధలో కాస్త‌యినా....పోలవరం పనులపై పెట్టాల‌ని సెటైర్లు వేశారు. పోలవరం - ఆదరణ - అన్న క్యాంటీన్లపై చర్చకు తాను సిద్ధ‌మ‌ని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావుకు ఉండ‌వ‌ల్లి సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రతీ నిర్ణయంలో కుటుంబరావు పాత్ర ఉంటుంద‌న్నారు. గోదావరి పుష్కర మరణాల పై సోమయాజులు ఇచ్చిన రిపోర్టుకు స్క్రిప్టు వేరేవారిద‌ని, ఆయ‌న కేవ‌లం సంతకం పెట్టార‌ని అన్నారు.