Begin typing your search above and press return to search.

బాబు సీనియ‌ర్ మాట‌కు ఉండ‌వ‌ల్లి భారీ షాక్‌

By:  Tupaki Desk   |   11 March 2018 6:45 AM GMT
బాబు సీనియ‌ర్ మాట‌కు ఉండ‌వ‌ల్లి భారీ షాక్‌
X
తెలుగు రాష్ట్రంలో చిత్ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తాయి. కాస్త డొక్క‌శుద్ధి ఉండి.. ఇష్యూల మీద అవ‌గాహ‌న ఉన్న నాయ‌కుల‌కు గ్లామ‌ర్ పెద్ద‌గా ఉండ‌దు. అదే టైంలో డొక్క శుద్ధిలేకున్నా.. అడ్డ‌బ్యాటింగ్ చేసిన‌ట్లు నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే నేత‌ల్లో కొంద‌రికి ఉండే ప్ర‌జాద‌ర‌ణ చూస్తే.. నాయ‌కుడికి కావాల్సిందేమిట‌న్న‌ది ఒక ప‌ట్టాన అర్థం కాదు.

ఏపీ నేత‌ల్లో ఏ విష‌యం మీదనైనా మాట్లాడే నేత‌ల్లో ఒక‌రు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. స‌బ్జెక్ట్ ప‌రంగానూ.. విష‌యాల మీద అవ‌గాహ‌న ప‌రంగా చూస్తే.. ఆయ‌న‌కు సాటి వ‌చ్చే నేత‌లు.. మాట నేర్పు ఉన్న వారు అతి కొద్దిమందే క‌నిపిస్తారు. కానీ.. ఆయ‌న‌కున్న ప్ర‌జాద‌ర‌ణ అంతంత మాత్ర‌మే.

కానీ.. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన మ‌రికొంద‌రు నేత‌లు క‌నిపిస్తారు. మంది మార్బ‌లం వేసుకొని తిరుగుతూ.. అడ్డ‌గోలు దందాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే వారికి ప్ర‌జ‌ల్లో ఉండే ప‌ర‌ప‌తి చూస్తే నోట మాట రాని ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి నోటి వెంట ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది.

త‌న‌కంటే సీనియ‌ర్ తోపు ఈ దేశంలోనే లేర‌న్న మాట అన‌టం.. అందుకు ప‌ర‌వ‌శించిపోతూ తెలుగు త‌మ్ముళ్లు చ‌ప్ప‌ట్లు కొట్ట‌టం క‌నిపిస్తుంది. దానికి మ‌రింత‌గా చెల‌రేగిపోతూ బాబు మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. దీనిపై ఉండ‌వ‌ల్లి త‌న‌దైన శైలిలో చేసిన వ్యాఖ్య‌ల ప‌రంప‌ర చూసిన‌ప్పుడు బాబు మాట‌ల్లోని డొల్ల‌త‌నం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

ఇంత‌కూ అసెంబ్లీలో చంద్ర‌బాబు ఏం అన్నారు? దానికి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన బ‌దులేమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. బాబు అసెంబ్లీలో అన్న‌దేమంటే.. "తెలిసీ తెలియ‌కుండా.. ఏదేదో మాట్లాడుతున్నారు. లాలూచీ రాజ‌కీయాలు నా జీవితంలో లేవు. అంద‌రిని గౌర‌వంగా చూస్తాను. అంద‌రితో బాగుంటాను.. ఒక మాట‌లో చెప్పాలంటే ఈ దేశంలో సీనియ‌ర్ నాయకుల వ‌రుస‌లో నేను ఒక‌డిని. ఇది ప్ర‌జ‌లు నాకిచ్చిన గౌర‌వం" అంటూ గొప్ప‌లు చెప్పేశారు. దీనికి స‌మాధానంగా ఉండ‌వ‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఆయ‌న ఏ ర‌కంగా సీనియ‌ర్ నాయ‌కుడు అవుతారో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌న్నారు.

"ముఖ్య‌మంత్రిగా సీనియ‌ర్ అంటే.. మీ ప‌క్క‌నే ఉన్న ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ పట్నాయ‌క్ 17 ఏళ్లుగా నాన్ స్టాప్ గా సీఎంగా ఉన్నారు. మ‌రోవైపు బోర్డ‌ర్‌కు ద‌గ్గ‌ర ఉన్నా త‌మిళ‌నాడు డీఎంకే అధినేత క‌రుణానిధి ఐదుసార్లు సీఎంగా ప‌ని చేయ‌ట‌మే కాదు.. ఎమ్మెల్యేగా 60 ఏళ్లు ఈ మ‌ధ్య‌నే పూర్తి చేసుకున్నారు. మీక‌న్నా ముందుగా ముఖ్య‌మంత్రిగా అయినా ములాయంసింగ్ యాద‌వ్ ఉన్నారు..క‌ల్యాణ్ సింగ్ ఉన్నారు.. ఫారుఖ్ అబ్దుల్లా ఉన్నారు.. శ‌రద్ ప‌వార్ ఉన్నారు. వీళ్లంతా మీ కంటే ముందే సీఎం అయ్యారా? ముఖ్య‌మంత్రిగా మీరు సీనియ‌రా? అంటే కాదు. తెలుగుదేశం పార్టీలో మీరు ఏమైనా సీనియ‌రా? అంటే.. అదీ లేదు. మా రాజ‌మండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మీ కంటే సీనియ‌ర్. ఆయ‌న 1983లోనే ఎమ్మెల్యే. మీరు అప్పుడు కాంగ్రెస్ త‌ర‌ఫు పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన విష‌యం గుర్తుందో లేదో?" అని ఎద్దేవా చేశారు.

"టీడీపీలోనూ మీరు సీనియ‌ర్ కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొద‌టి ఎమ్మెల్యేనా అనుకుంటే.. కేఈ కృష్ణ‌మూర్తి.. అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. ఇంకా చాలామంది 1978లోనే ఎమ్మెల్యే అయినోళ్లు ఉన్నారు. ఇలా మీ పార్టీలోనే సీనియ‌ర్లు చాలామంది ఉన్నారు. ఉన్న‌ట్లుండి మీకు ఇప్ప‌టికిప్పుడు మీరే సీనియ‌ర్ మోస్ట్ అన్న భావ‌న క‌లుగుతోంది? అదేమైనా అభ‌ద్ర‌తా భావ‌నా? అన్న‌ది ఒక‌సారి ఆలోచించండి. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తికి వ్య‌క్తిగ‌తంగా అభ‌ద్ర‌తా భావం క‌లిగితే ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. ఎందుకంటే ఇంత దారుణ‌మైన స్టేట్ మెంట్ ఇవ్వ‌టానికి కొంచెమైనా ఆలోచిస్తారు. నాకు తెలిసినంత‌వ‌ర‌కూ జ్యోతిబ‌సు మాదిరి ఏక‌ధాటిగా ముఖ్య‌మంత్రి చేసినోళ్లు ఈ దేశంలో ఇంకెవ‌రూ లేరు. ఆయ‌న సైతం

నేనే ఈ దేశంలో సీనియ‌ర్ మోస్ట్‌.. నాకంటే మించినోళ్లు ఈ దేశంలో లేర‌న్న మాట చెప్పిన‌ట్లుగా గుర్తు లేదు" అని చెప్పారు.

జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు లాంటి నేత సైతం తానెప్పుడూ సీనియ‌ర్ అన్న మాట చెప్పుకున్న‌ది లేదని.. అలాంటిది మీకు మీరుగా నేనే సీనియ‌ర్ అన్న మాట చెబుతుంటే.. ఏదో తేడా వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోందన్నారు ఉండ‌వ‌ల్లి. ఇవాల్టి వ‌ర‌కూ మీరు సొంతంగా ఒక్క ఎలక్ష‌న్ నెగ్గ‌లేదంటూ.. "వైఎస్ నే తీసుకుంటే.. 2004లో టీఆర్ఎస్‌.. క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లారు. 2009 వ‌చ్చేస‌రికి టీఆర్ఎస్ అక్క‌ర్లేదు.. క‌మ్యునిస్ట్ లు అక్క‌ర్లేదంటూ ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళతాన‌న్నాడు. ఢిల్లీలో పెద్ద గొడ‌వ‌. పార్టీలో చాలామంది ఒప్పుకోలేదు. నేను అప్పుడు పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలో ఉన్నా. వైఎస్ చాలా పెద్ద త‌ప్పు చేస్తున్నాడు.. పార్టీ పోతుంది.. ఓడ‌టం ఖాయ‌మ‌న్నారు చాలామంది. లేదు.. క‌చ్ఛితంగా గెలుస్తామ‌న్నాడు.. 2009లో ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్లాడు.. గెలిచాడు. అది రాజ‌శేఖ‌ర్ రెడ్డి స్పిరిట్‌. మీరు తెలివైనోళ్లు కాబ‌ట్టి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏపార్టీతో వెళితే బాగుంటుందో చూసుకొని వెళ్ల‌టంలో మీరు ఎక్స్ ప‌ర్ట్‌. మీకు ఆ నైపుణ్య ఉంది. ఫ‌లితాలు సాధించారు.. అందులో త‌ప్పు లేదు" అని వ్యాఖ్యానించారు.

న‌న్ను మించినోళ్లు లేరీ దేశంలో అంటూ చెప్పుకోవ‌టం మొద‌లైందంటే.. మీలో ఆత్మ‌నూన్య‌త భావం స్టార్ట్ అయిన‌ట్లేన‌ని త‌ప్పుప‌ట్టారు ఉండ‌వ‌ల్లి. ఆ ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ అన్న‌ది చంద్ర‌బాబులో స్టార్ట్ అయ్యిందని.. అది బాబుకే కాదు.. రాష్ట్రానికి కూడా ప్ర‌మాదంగా ఉండ‌వ‌ల్లి అభివ‌ర్ణించారు.