Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి చెప్పిన మాట‌ల్ని బాబు వింటే అంతే!

By:  Tupaki Desk   |   22 March 2018 8:16 AM GMT
ఉండ‌వ‌ల్లి చెప్పిన మాట‌ల్ని బాబు వింటే అంతే!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఒక చిత్ర‌మైన అల‌వాటు ఉంది. ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్న‌ప్పుడు.. పార్టీ నేత‌ల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని అదే ప‌నిగా పాత విష‌యాల్ని చెప్పుకుంటుంటారు. ఓటుకు నోటు కేసు ఎపిసోడ్ జ‌రిగిన‌ప్పుడు గుర్తు తెచ్చుకుంటే.. రోజుల త‌ర‌బ‌డి ఆయ‌న మీటింగ్ ల మీద మీటింగ్ లు పెట్టుకోవ‌టం మ‌ర్చిపోలేం. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌భుత్వంపైనా.. త‌న కొడుకు పైనా చేసిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అటు అసెంబ్లీలోనూ.. ఇటు టెలికాన్ఫ‌రెన్స్ ల‌లోనూ బాబు అదే ప‌నిగా మాట్లాడ‌టం మ‌ర్చిపోలేం.

ఇక‌.. మీడియాతో అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మామూలుగానే మీడియాతో త‌ర‌చూ మాట్లాడే బాబు.. తాను డిఫెన్స్ లో ప‌డిపోయిన వేళ‌.. మ‌రింత ఎక్కువ‌గా మాట్లాడ‌టం.. త‌న గురించి తానే గొప్ప‌లు చెప్పుకోవ‌టం చేస్తుంటారు.ఈ చెప్పుకునే క్ర‌మంలో కొన్నిసార్లుఆయ‌న అడ్డంగా బుక్ అవుతారు. తాజాగా అలాంటి వ్యాఖ్య చేసి.. ఫైర్ బ్రాండ్ ఉండ‌వ‌ల్లికి చిక్కారు.

ఇందిరాగాంధీని తాను ఎదుర్కొన్న‌ట్లుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పిన వైనంపై ఉండ‌వ‌ల్లి భారీ కౌంట‌ర్ వేశారు. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన ఆయ‌న వ్యాఖ్య‌ల్ని ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే.. "ఇందిరాగాంధీనే ఎదుర్కొన్నా? అని చెబుతున్నాడు. ఈయ‌న ఇందిరాగాంధీని ఎదుర్కొన్న‌ప్పుడు ఆమె పార్టీలోనే ఉన్నాడు. ఎందుకంత భ్ర‌మింప‌జేసే ప్ర‌య‌త్నం..? భ‌్ర‌మింప చేయొచ్చు కానీ.. మ‌రీ ఇంత దారుణంగానా? 30 ఏళ్ల క్రితం ఏం జ‌రిగింద‌న్న విష‌యం ఎవ‌రికి తెలీదని అనుకుంటున్నాడేమో? ఇందిరాగాంధీని టీడీపీ ఎదుర్కొన్న‌ప్పుడు ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 1984లో ఎన్నిక‌లు జ‌రిగి రామారావు గెలిచిన‌ప్పుడు ఇందిరాగాంధీ లేదు చ‌చ్చిపోయింది. ఇందిరాగాంధీని రామారావు ఎదుర్కొన్న‌ది 1983 ఎల‌క్ష‌న్ ఒక్క‌టే" అని వ్యాఖ్యానించారు.

తాను వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి టికెట్ ఇప్పించాన‌ని చెప్పుకుంటార‌ని.. అస‌లు రాజ‌శేఖ‌ర్ రెడ్డి గెలించింది రెడ్డి కాంగ్రెస్ లోన‌ని.. ఆయ‌న గెలిచింది ఆవుదూడ గుర్తు మీద‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు కాంగ్రెస్ లో ఉండి హ‌స్తం గుర్తు మీద గెలిచార‌న్నారు. మైకు ప‌ట్టుకొని ఏమైనా చెప్పేస్తానంటే ఎలా? అంటూ ప్ర‌శ్నించిన ఉండ‌వ‌ల్లి.. ఇంకా కొంత‌మందిమి బ‌తికే ఉన్నామ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దన్నారు.

చంద్ర‌బాబు ఎప్పుడూ ఆగ‌స్టు సంక్షోభం చెబుతాడే కానీ.. సెప్టెంబ‌రు సంక్షోభం గురించి చెప్ప‌డే? అని ప్ర‌శ్నించారు. "1983లో రామారావు ఏమీ ఏడ‌వ‌లేదు. నాదెండ్ల భాస్క‌ర్ రావు అలా చేశాడు... ఇలా చేశాడ‌ని.. కాంగ్రెస్ మీద ఏడ్చాడు. ఇక్క‌డైతే డైరెక్ట్ గా ఏడ్చాడు. జామాతా.. ద‌శ‌మ‌గ్ర‌హ అంటూ నేరుగా అనేశాడు.. ఇంకా మ‌ర్చిపోయామా? ఇప్ప‌టికి తెగ తిరిగేస్తుంది ఆ సీడీ" అని అన్నారు.

రామారావు గొప్ప‌త‌నం గురించి చంద్ర‌బాబు చెప్ప‌టం ఏమిట‌న్న ఉండ‌వ‌ల్లి.. చంద్ర‌బాబు త‌న గొప్ప‌త‌నం గురించి ఎప్పుడూ తానే చెప్పుకుంటార‌ని ఎద్దేవా చేశారు. "ఎప్పుడూ మీ గొప్ప‌త‌నం గురించి మీరే చెప్పుకోవ‌ట‌మా? అంత మంది బ్యాచ్ ఉందిగా.. ఎవ‌రి చేత‌నైనా చెప్పించొచ్చుగా? ఎవ‌రి మీదా న‌మ్మ‌కం లేదా?" అని ప్ర‌శ్నించారు. కాస్త వ్యంగ్యంగా శోభ‌న్ బాబులా ఉన్నార‌ని ఎవ‌రో పొగిడారుగా.. అదే తీరులో పొగిడించుకోడంటూ చుర‌క‌లేశారు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి