Begin typing your search above and press return to search.

జైపాల్ ను అసలు కథ చెప్పమంటున్న ఉండవల్లి

By:  Tupaki Desk   |   24 Sep 2016 11:41 AM GMT
జైపాల్ ను అసలు కథ చెప్పమంటున్న ఉండవల్లి
X
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. విభజనకు ముందు నాటి పరిణామాలపై ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరించి సుమారు వారం అవుతున్నా అది రేపుతున్న రచ్చ ఇంకా ముగియలేదు. విభజన ముందు గంటలో స్పీకర్ చాంబర్‌ లో ఏమి జరిగిందన్నది ఉండవల్లి తన పుస్తకం లో రాయగా అదంతా కట్టుకథ అని తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆ వెంటనే ఆక్షేపించారు. ఉండవల్లివన్నీ కట్టుకథలని ఆరోపించారు. దీంతో తాజాగా ఉండవల్లి మళ్లీ జైపాల్ కు కౌంటరేశారు. తాను చెప్పింది కట్టు కథ అయితే అసలు కథేంటో జైపాల్ రెడ్డే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

విభజనకు ముందు గంట సమయంలో ఏం జరిగిందన్న నిజాన్ని బయటపెట్టాలని జైపాల్ రెడ్డిని ఉండవల్లి అరుణ్‌ కుమార్ డిమాండ్ చేశారు. తను రాసిన విభజన కథ పుస్తకం కట్టు కథ అయితే అసలు నిజమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలన్నారు. విభజన కథ పుస్తకంలో ఉండవల్లి కట్టు కథ రాశారని, అసలు విషయం బయటపెట్టాలంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి చెప్పడానికి వీల్లేదని జైపాల్‌ రెడ్డి ఇటీవల గాంధీభవన్‌ లో విమర్శించడంపై స్పందించిన ఉండవల్లి రీసెంటుగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పలు ప్రశ్నలను సంధించారు. పుస్తకంలో రాసిన తన ఊహ తప్పయితే నిజమేమిటో చెప్పాలని జైపాల్‌ రెడ్డిని నిలదీశారు. తనది అంతా కట్టుకథ అన్నా కూడా సరిపెట్టుకుంటానని... అయితే అసలు విషయమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలని కోరుతున్నానన్నారు.

విభజన జరిగే సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య స్పీకర్ చాంబర్‌ లో ఏమి జరిగిందో తాను ఊహించి రాశానన్నారు. లోపల జరిగింది కుట్ర, అనర్థం, రాజ్యాంగ విరుద్ధమని తాను ఊహించి రాసినప్పటికీ, నిజమేమిటో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జైపాల్‌ రెడ్డి వెళ్ళి చెబితేనే తెలంగాణ వచ్చిందని, లేదంటే తెలంగాణ లేదని ఆయనే స్వయంగా ప్రకటించారని, కాబట్టి రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఆ విషయం ఏమిటో బయటపెట్టాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అపార అనుభవం కలిగిన జైపాల్‌ రెడ్డికి ప్రజాస్వామ్యంపై గౌరవం వుంటే, పారదర్శకతకు అర్థం తెలిసివుంటే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని, నిజమేమిటో ఒప్పుకోవాలని కోరారు. జైపాల్‌ రెడ్డి స్థాయి వ్యక్తే సెంటిమెంట్‌ కులోనై తప్పుడు సలహా ఇచ్చానని ఒప్పుకుంటే ఆయన వ్యక్తిత్వం మరింత పెరుగుతుందన్నారు. మొత్తానికి ఏపీలో జైపాల్ ను విలన్ ను చేస్తున్నా తెలంగాణలో హీరోగా చేసే పనిని ఉండవల్లి ఎత్తుకుంటున్నట్లుగా ఉంది. విభజన నిర్ణయానికి కారణం జైపాలే అన్నట్లుగా ఉండవల్లి ఆరోపిస్తుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ - జైపాల్ రెడ్డిలు ఇద్దరి గ్రాఫ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది.