Begin typing your search above and press return to search.

విభజన ఎపిసోడ్ లో కుట్ర కోణమట!

By:  Tupaki Desk   |   24 Sep 2016 5:30 PM GMT
విభజన ఎపిసోడ్ లో కుట్ర కోణమట!
X
తెలుగునేల ముక్కలై.. రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తోంది. విభజన తాలూకు లాభాలు.. నష్టాలు.. కష్టాలు.. సుఖాలు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు అనుభవిస్తున్నారు. సామాన్య ప్రజల్లో ఎవరికి గుర్తు లేని ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ.. దాని కోసం తాను పోరాడుతున్నట్లుగా చెప్పే వ్యక్తి ఒకరున్నారు. న్యాయశాస్త్రాన్ని చదవటంతో పాటు.. మేధావి అన్న ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుతూ.. ఏ రోజుకైనా తాను చెప్పింది నిజమన్న విషయాన్ని లోకానికి చాటాలని తపిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో అర్థమైందా? అవును.. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సీమాంధ్రుల్లో ఒక్క శాతం ప్రజలు కూడా విభజన జరిగింది చట్టబద్ధమా? కాదా? అన్న విషయం మీద అవగాహన ఉంటుందని చెప్పలేం. ఆ మాటకు వస్తే.. ఏపీ ప్రజా ప్రతినిధుల్లో పట్టుమని పది మంది కూడా ఆ విషయాన్ని ఆలోచిస్తున్నారో? లేదో?

అలాంటి అంశం మీద ఉండవల్లి పట్టువదలని విక్రమార్కుడి మాదిరి పోరాడుతున్నారు. విభజన జరిగిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయన.. లోక్ సభలో విభజన చట్టం ఆమోదం పొందలేదని.. అది చట్టబద్ధం కాదని.. ఏ రోజుకైనా విభజన బిల్లు పాస్ కాలేదన్నది నిరూపితమవుతుందని ఆయన నమ్మకంగా చెబుతుంటారు. చట్టబద్ధం కాని విభజన తన దృష్టిలో విభజనే కాదన్నట్లుగా మాట్లాడే ఉండవల్లి.. ఈ మధ్యన రెండు రాష్ట్రాలు విడిపోవటం వెనుక ఏం జరిగిందన్న విశ్లేషణ ఒకటి చేసుకొచ్చారు.

ఆ పుస్తకంలోని అంశాలు కొన్ని తాను ఊహించి రాసినవేనని చెప్పిన ఆయన.. అది కట్టుకథ అంటే అంతెత్తు ఫైర్ అవుతారు. తన పుస్తకంలో తాను రాసింది విశ్లేషణగా ఆయన అభివర్ణిస్తారు. పుస్తకం విడుదల సందర్భంగా విభజన బిల్లును చట్టబద్ధంగా ఆమోద ముద్ర పొందకుండా చేయటంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కుట్ర చేసినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. తన పుస్తకం ఉత్త కట్టుకథేనని తేల్చేసిన జైపాల్ రెడ్డి మాటలపై అగ్గి మీద గుగ్గిలంగా మారిన ఉండవల్లి కాస్త కోపంగానే కొన్ని కొత్త విషయాల్ని.. మరికొన్ని పాత విషయాల్ని చెప్పుకొచ్చారు.

మొత్తంగా ఈ విషయాల్ని రికార్డు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ విషయాన్ని వివరంగా రాయాల్సి వస్తోంది. విభజన బిల్లు చట్టబద్ధంగా పాస్ కాకుండా ఏదో చేశామంటే చేశామనేసి.. మసిపూసి మారేడు కాయ కాచేసినట్లుగా అభివర్ణించే ఉండవల్లి.. తన వాదన నిజం అని చెప్పటానికి కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తారు. వాటిని విన్నప్పుడు ఆయన లాజిక్ లో అర్థం ఉందన్న భావన కలుగుతుంది.

విభజన బిల్లు అధికారిక ఆమోదం పొందిన విషయాన్ని ఆ రోజు జరిగిన బిజినెస్ లో పేర్కొనలేదని చెబుతారు ఉండవల్లి. అంతేకాదు.. టీవీ ప్రసారాలు నిలిపేసి (సాంకేతికంగా చూస్తే మాత్రం సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రసారాలు ఆగిపోయాయి) పార్లమెంటు తలుపులు మూసేసి మరీ.. జరిగిన వ్యవహారం ఏదీ అధికారికంగా నమోదు కాలేదన్నది ఉండవల్లి వాదన. ఇదే విషయాన్ని ఉండవల్లి మాటల్లోనే చెబితే.. ‘‘నా వాదన ఒకటే. విభజన బిల్లు పాస్ కాలేదు. ఓటింగ్ జరగలేదు. కాంగ్రెస్.. బీజేపీ కలిసినా మెజారిటీ లేదు. ఏంచేయాలో అర్థం కాని సమయంలో ఓటింగ్ లేదు. గీటింగు లేదని జైపాల్ సలహా ఇచ్చారు. అంతకు మించి ఆయన చేయటానికి అక్కడ ఏముంది? బీజేపీ అడ్డుకోవటానికి సిద్ధంగా లేదు. సభలో అసలేం జరిగిందో జైపాల్ రెడ్డి చెప్పాలి. ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. అప్పట్లో స్పీకర్ ఛాంబర్లో జరిగింది చెబితే ఎన్నికల్లో ఓడిపోయే వాడిని కానని చెప్పారు. ఆ రోజు తాను చొరవ తీసుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు. పైగా కొంతవరకు రాజ్యాంగ మర్యాదలు పాటించాననీ చెబుతున్నారు. అంటే.. లోపల జరిగిన విషయాన్ని బయటకు చెప్పలేకపోయారంటే అక్కడ కుట్ర జరిగినట్లే’’ అని తేల్చేశారు. అదండీ విభజనలో ఉండవల్లి అరుణ్ కుమార్ కుట్ర కోణం.