Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి మాట‌!..బాబు బెస్ట్ మానిప్యులేట‌ర్‌!

By:  Tupaki Desk   |   29 March 2018 8:08 AM GMT
ఉండ‌వ‌ల్లి మాట‌!..బాబు బెస్ట్ మానిప్యులేట‌ర్‌!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై సీనియ‌ర్ రాజకీయ‌వేత్త‌, రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఓ రేంజిలో ఫైరైపోయారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు సంబందించి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఉద్య‌మంపై మాట్లాడేందుకు నేటి ఉద‌యం రాజ‌మ‌హేంద్రవ‌రం వేదిక‌గా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశానికి వ‌చ్చిన ఉండ‌వ‌ల్లి... వ‌చ్చీరావ‌డంతోనే చంద్ర‌బాబుపై త‌న‌దైన శైలిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. నాలుగేళ్లుగా బీజేపీతో క‌లిసి సాగిన చంద్ర‌బాబుకు ఆ నాలుగేళ్ల‌లో ప్ర‌త్యేక హోదా ఎందుకు గుర్తుకు రాలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాడు ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మించిన వారంద‌రిపైనా బీజేపీ కంటే కూడా చంద్ర‌బాబే భారీగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని కూడా ఉండ‌వ‌ల్లి విరుచుకుప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా కంటే కూడా ప్ర‌త్యేక ప్యాకేజీనే మంచిద‌ని - అందుకే తాము ప్యాకేజీకి ఒప్పుకున్నామ‌ని చెప్పుకొచ్చిన బాబు... ప్ర‌త్యేక హోదా అంటే జైల్లో పెట్టిస్తాన‌ని చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా ఉండ‌వ‌ల్లి గుర్తు చేశారు.

బీజేపీతో దోస్తీ చెడిపోయాక ఇన్నాళ్లకు చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చిందని ఉండవల్లి మండిపడ్డారు. గతంలో మిగతా వారు పోరాడుతుంటే నీకేం తెలుసు అని అడగడం తప్ప చంద్ర‌బాబు ఏం చేయలేదన్నారు. మానిప్యులేషన్ చేయడంలో చంద్రబాబు దేశంలోనే ఎక్స్‌ పర్ట్ అని పేరు ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు - హైకోర్టులలో తాను - రామచంద్ర రావు పిటిషన్లు దాఖలు చేశామని, వాటిని సమర్థిస్తూ చంద్రబాబు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగాలన్నారు. విజయసాయి రెడ్డి తిట్టాడు, బీజేపీ మోసం చేసింది.. ఎప్పుడూ ఇదేనా అని కూడా ఉండ‌వ‌ల్లి ఎద్దేవా చేశారు. ఈ రోజు జరుగుతున్న దానికి చంద్రబాబే బాధ్యులని... మంచి జరిగినా, అన్యాయం జరిగినా ఆయనే బాధ్యులు అన్నారు. ప్రతి విషయాన్ని సీరియస్‌ గా తీసుకోవాలన్నారు. అయితే ఈ మిగిలి ఉన్న తొమ్మిది నెలల్లో చంద్ర‌బాబు సీన్ మార్చగలరని, ఆ సామర్థ్యం చంద్రబాబుకు ఉందని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు.

2014లో బీజేపీతో పొత్తు వల్ల తాము 15 సీట్లు కోల్పోయామని చంద్రబాబు చెబుతున్నారని, అదంతా ఏదో తాను బలవంతుడిని అని చెప్పుకునేందుకే లెక్కలు చెబుతున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. అందుకు ఆయన 2014కు ముందు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల లెక్కలు చెబుతున్నారని, కానీ అది సరి కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేరు అన్న విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తించాల్సి ఉంద‌న్నారు. నాడు నరేంద్ర మోదీ హవా బాగా ఉందని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జత కలిశారని, ఆ ఇద్ద‌రు కార‌ణంగానే చంద్రబాబు గెలిచారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ లెక్కన బీజేపీతో కలవకుంటే చంద్రబాబు ఓడిపోయేవారని, మోదీ హవా వల్లే చంద్ర‌బాబు గెలిచారని ఉండ‌వ‌ల్లి తేల్చేశారు. బీజేపీ - పవన్ పైన టీడీపీ విమర్శల పైనా ఉండవల్లి ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు తీరు ఏరు దాటాక తెప్పతగలేసినట్లుగా ఉందన్నారు. 2004లో బీజేపీ వల్ల ఓడిపోయామని చెప్పారని, 2014లో పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ వల్ల సీట్లు తగ్గాయని చెప్పడం విడ్డూరమన్నారు.