Begin typing your search above and press return to search.

అత్యంత అవమానం జగన్ అంటున్న వైఎస్సార్ ఫ్రెండ్ ?

By:  Tupaki Desk   |   3 Jan 2022 5:30 PM GMT
అత్యంత అవమానం జగన్ అంటున్న వైఎస్సార్ ఫ్రెండ్ ?
X
అవమానం అన్నది ఎవరికైనా ఒక్కటే కానీ స్థాయిల బట్టి దాని తీవ్రత, ప్రభావం ఉంటుంది. ఒక వ్యక్తి స్థాయిలో అవమానం జరిగితే దాని పరిధి వేరు, ఒక సంస్థకు జరిగితే ఇంకా విస్తృతి పెరుగుతుంది. అదే ఒక రాష్ట్ర ప్రభుత్వానికే జరిగితే దానికి అవమానం కంటే పెద్ద పదమే వాడాలేమో. ఇపుడు అలాంటి అతి పెద్ద అవమానం జగన్ సర్కార్ కి జరిగింది అంటున్నారు వైఎస్సార్ కి ప్రియమైన స్నేహితుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారు. ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ సర్కార్ మీద ఒక విధంగా నిప్పులే చెరిగారు.

అసలు ఈ ప్రభుత్వం దశ దిశా లేక‌ ఎటు వెళ్తోంది, ఏం చేస్తోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క పైసా ఆదాయ మార్గం లేదు, అప్పులు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. మరి ఏపీ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడానికి కూడా ముప్పయి మూడు షరతులు బ్యాంకులు కానీ ఇతర ఆర్ధిక ఏజెన్సీలు కానీ పెడుతున్నాయి. ఇపుడు అది కాస్తా శృతి మించేసి ఎస్క్రో అకౌంట్ అంటున్నారు. ఇంతకంటే అవమానం ఒక ప్రభుత్వానికి ఉంటుందా అని ఉండవల్లి సూటిగానే ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటి అంటే తాము ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవడానికి ఆ ఏజెన్సీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం చేతికి పైసా రాకముందే తామే ముందుండి వసూలు చేసుకుంటుంది అన్న మాట. అంటే ప్రభుత్వం కూడా తనకు వచ్చే ఆదాయం గురించి తెలుసుకుని తన చేతుల మీదుగా ఆ ఏజెన్సీకి అప్పును తీర్చడం కాదన్నమాట. అప్పులు ఇచ్చిన ఏజెన్సీవే తాను ఇచ్చిన రుణాన్ని ముందు తీసేసుకున్న మీదటనే మిగిలిన తృణమో ఫణమో ప్రభుత్వానికి దక్కడం అన్న మాట. ఎస్క్రో అకౌంట్ అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడమే కదా అని ఉండవల్లి భాష్యం చెబుతున్నారు.

ఇక ఒక వ్యక్తి అప్పుకు వెళ్తే ఆయన్ని నమ్మకుండా ఇంట్లో బంగారమో, మరోటో తాకట్టు పెట్టించుకుని అప్పులు ఇస్తారు. కానీ లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ఒక ప్రభుత్వాన్ని కూడా నమ్మకంపోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నామని ఉండవల్లి చెబుతున్నారు. ప్రభుత్వం అప్పుకు వెళ్తే ఏదైనా ఆస్తులను తాకట్టు పెట్టండి అని అడుగుతున్నారు అంటే అది దారుణమే కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండున్నరేళ్ళుగా తోచిక కాడికీ అప్పులు చేసుకుంటూ పోయారని, మిగిలిన రెండేళ్ల కాలానికి ఎలా అప్పులు తెస్తారు అంటే దానికి కూడా ఏదో ఆలోచన చేస్తున్నారే అనుకోవాలని ఆయన సెటైర్లు వేశారు. రానున్న రెండున్నరేళ్ళకు ఖర్చు ఎంత ఎన్ని అప్పులు చేయాలి, సంక్షేమ పధకాలు అమలుకు ఎంత అవుతుంది అని లెక్కవేసుకుని ఆ మీదట దేన్ని అమ్మాలో, తాకట్టు పెట్టాలో చూస్తారెమేమో అని ఆయన కామెంట్స్ చేశారు. అంతే తప్ప రాష్ట్రం ఏమైపోతంది అన్న ఆలోచన ఎవరికీ లేనట్లుగానే ఉందని విమర్శించారు.


ప్రభుత్వానికి ఆదాయం లేకనే సినిమా టికెట్ల మీద పడిందేమో అన్న డౌట్ ని కూడా వ్యక్తం చేశారు. ఇక మటన్ షాపులను కూడా తామే నడుపుతామని ప్రభుత్వం అంటోందని, అలా ఆదాయం పెంచుకుంటారేమో అని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షాలు కూడా ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని ఉండవల్లి విమర్శించారు. వారు ఎంతసేపూ అధికారంలోకి ఎలా రావడమా అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప రాష్ట్రం ఎలా ప్రజల సమస్యలు ఏంటి అని చర్చించడంలేదని అన్నారు. ఉన్నంతల్లో వామపక్షాలు నయం అనుకున్నా వారు కూడా ఈ మధ్య తగ్గిపోయారని ఉండవల్లి పేర్కొన్నారు.

మొత్తానికి చూసుకుంటే ఏపీ పరిస్థితి వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా భయంకరమే అన్న బాధను మాత్రం ఉండవల్లి వ్యక్తం చేయడం విశేషం. ఇక తాను జగన్ కి సలహాదారుడిగా మారాల్సిన అవసరం లేదని, తాను ఏ విధంగానూ ఏ రంగాన నిపుణుడిని కాదని ఉండవల్లి అంటున్నారు. తమది పాతతరమని, తమ అవసరం కూడా ఎవరికీ ఉండదని ఆయన కామెంట్స్ చేయడం గమనార్హం. మొత్తానికి వైఎస్సార్ కి ఒకనాడు నమ్మకస్థుడు, ప్రియ మిత్రుడు అయిన ఉండవల్లి జగన్ విషయంలో మాత్రం హాట్ హాట్ గానే రియాక్ట్ అవుతున్నారు.