Begin typing your search above and press return to search.

కేసీఆర్‌తోనే బీజేపీ ఓట‌మి: ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   13 Jun 2022 5:30 PM GMT
కేసీఆర్‌తోనే బీజేపీ ఓట‌మి:  ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌లు
X
దేశ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ 10 రోజుల క్రితమే ఫోన్‌ చేసి ఆహ‍్వానించారు. జాతీయ పార్టీ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. బీజేపీ గురించి నా అభిప్రాయం, కేసీఆర్‌ అభిప్రాయం ఒక్కటే. బీజేపీ అంటే వ్యక్తిగతంగా నాకేమీ వ్యతిరేకత లేదు. విధానాలపరంగానే విమర్శిస్తాను`` అని పేర్కొన్నారు.

ఏపీలో బీజేపీ బలంగా ఉందని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. బీజేపీకి తాను వ్యతిరేకం కాదని, ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ప్రకటించారు. బీజేపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలన్నారు. దేశంలో ప్రతిపక్షం ఉండొద్దన్నది బీజేపీ విధానమని పేర్కొన్నారు. వ్యతిరేకించినవారిపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని ఉండవల్లి అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు.

``రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుని సంతోషంగా ఉన్నాను. రాజకీయాల్లో కొనసాగే ఆసక్తిలేదని కేసీఆర్‌తో చెప్పాను. బీజేపీ వ్యతిరేకులను ఏకం చేసే శక్తి కేసీఆర్‌కు ఉంది. మా భేటీలో భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్‌ఎస్‌) గురించి ప్రస్తావన రాలేదు. కాంగ్రెస్‌ వీక్‌ అవుతుంది కాబట్టి.. బీజేపీకి గట్టి కౌంటర్‌ అటాక్‌ ఇవ్వాలి. బీజేపీ వైఖరి వల్ల అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట దెబ్బతోంటోంది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన తాఖీదులతో దేశ గుడ్‌ విల్‌ దెబ్బతింటోంది. బీజేపీ పాలనలోని లోపాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు లేరు.`` అని వ్యాఖ్యానించారు.

బీజేపీ లక్ష్యం కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కాదు. అపోజిషన్‌ ముక్త్‌ భారత్ అని ఉండ‌వ‌ల్లి అన్నారు. బీజేపీకి ఆల్టర్నేటివ్‌గా ఒక ప‍్రత్యామ్నాయాన్ని అభివృద్ది చేయాలన్నదే కేసీఆర్‌ ముఖ్య ఉద్దేశ్యమ‌ని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రుకి కేసీఆర్‌ పెద్ద అభిమాని అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు అన్ని విషయాలపై చాలా క్లారిటీ ఉందన్న ఉండ‌వ‌ల్లి బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో ప్రమాదం పెరుగుతుంద‌న్నారు. దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ నాకన్నా ఎక్కువ స్టడీ చేశారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ కన్నా అన్ని విషయాలపై కేసీఆర్‌ బాగా వివరణ ఇవ్వగలరని కితాబిచ్చారు. కేసీఆర్ త్వ‌ర‌లో అన్ని విషయాలను క్లియర్‌గా చెబుతారు అని ఉండ‌వ‌ల్లి వివ‌రించారు. బీజేపీకి కేసీఆర్‌తోనే చెక్ ప‌డుతుంద‌ని అన్నారు.