Begin typing your search above and press return to search.

ఉండవిల్లి ఫార్ములా : అవిశ్వాసంతో మోడీ పతనం!

By:  Tupaki Desk   |   16 Feb 2018 12:52 PM GMT
ఉండవిల్లి ఫార్ములా : అవిశ్వాసంతో మోడీ పతనం!
X
ఈ సమయంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే.. ఆ తీర్మానం నెగ్గుతుందా? అసలు ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా అవసరం లేకుండా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన భాజపాకే సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ఎలా ఊహించగలం. అంతర్గతం సాగే లెక్కలు మనకు తెలియదు గానీ.. మొత్తానికి అవిశ్వాసం అంటూ వస్తే మోడీ సర్కారు కుప్ప కూలుతుందని.. ఉండవిల్లి అరుణ్ కుమార్ జోస్యం చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలంటే.. వైసీపీ - తెలుగుదేశం ఎంపీలు రాజీనామాలు చేయడం వల్ల లాభం లేదని - అదే వారు పార్లమెంటులో నిరంతరాయ పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ.. మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆయన సూచిస్తున్నారు. దానివల్ల సర్కారు కుప్పకూలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలంటే కేంద్రం మీద ఒత్తిడిపెంచడం మాత్రం తప్పనిసరి ఇక్కడి అధికార పార్టీ తెదేపా - విపక్షం వైకాపా రెండూ పోరుబాటలోనే ఉన్నాయి. తెదేపా కొంత నెమ్మదించగా - వైకాపా మాత్రం స్పష్టమైన పోరు ఎజెండాతో.. రాజీనామాల షెడ్యూలు కూడా ప్రకటించేసి.. కార్యాచరణలో ఉంది. అయితే ఒత్తిడి పెంచాలన్న ఆలోచన మంచిదే కానీ.. అందుకు రాజీనామాలు మార్గం కాదని.. అనుభవజ్ఞుడు - న్యాయనిపుణుడు కూడా అయిన ఉండవిల్లి చెబుతుండడం గమనార్హం.

మోడీ సర్కారుకు ఎన్డీయేలో పూర్తి మద్దతు లేదని... ప్రధాన భాగస్వామి శివసేన ఇప్పటికే దూరమైందని - తెదేపా కూడా పోతే.. చిన్న పార్టీలే మిగులుతాయని, వారి మద్దతు ఎపీకి ఉన్నదని.. ఇక భాజపాలో అంతర్గతంగా ఉన్న లుకలుకల్ని ఎడ్వాంటేజీగా మార్చుకుంటే.. లాభపడవచ్చునని ఆయన ఊహలాగా కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం అంటూ ప్రవేశ పెట్టడం జరిగితే ఖచ్చితంగా అది మోడీ సర్కారు మీద విపరీతమైన ఒత్తిడి తెస్తుందని ఆయన అంటున్నారు. అయితే.. అవిశ్వాసం పెట్టడం అనేది అంతిమంగా ప్రయోగించగల బ్రహ్మాస్త్రం లాగా మాత్రమే ఉండాలి. ఒకసారి అది వృథా అయిందంటే.. తిరిగి అలాంటి అస్త్రాన్ని సమకూర్చుకోవడం కూడా కష్టం. అయినా ఇంతకూ సాధ్యాసాధ్యాలు ఎలాగ అనేది తేలకుండా.. అవిశ్వాసం పెడతారా? అందుకు తెదేపా లేదా వైకాపా సాహసిస్తాయా? అనేది కీలక ప్రశ్నగా ఉంది.