Begin typing your search above and press return to search.

ఏపీ ఎంపీలు అలా చేస్తే అవిశ్వాసం పెట్ట‌చ్చు: ఉండ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   23 March 2018 10:38 AM GMT
ఏపీ ఎంపీలు అలా చేస్తే అవిశ్వాసం పెట్ట‌చ్చు: ఉండ‌వ‌ల్లి
X
ద‌క్షిణ భార‌త దేశంలోని కీల‌క‌మైన రాష్ట్రాల‌ను హ‌స్త‌గతం చేసుకునేందుకు ఆప‌రేష‌న్ ద్ర‌విడ‌ను బీజేపీ ప్రారంభించింద‌ని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆప‌రేష‌న్ గ‌రుడ అందులో ఒక భాగ‌మేన‌ని సినీ న‌టుడు శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. శివాజీ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజానిజాలెంత అన్న‌దానిపై రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా, శివాజీ వ్యాఖ్య‌ల‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. ఆపరేషన్ గరుడ - ఆపరేషన్ ద్రవిడ వంటివి సినిమాలలో మాత్ర‌మే చూడ‌గ‌ల‌మ‌ని - డ‌బ్బులిచ్చి పొలిటికల్ ఆపరేషన్ చేసే రాజ‌కీయ‌పార్టీలు నిజ జీవితంలో లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాల‌ని ప్ర‌తి పార్టీ క‌ల‌లు గంటుంద‌ని, అంత‌మాత్రాన సినీ ఫ‌క్కీలో ప్లాన్ లు - ఆప‌రేష‌న్ లు ఉంటాయ‌నుకోవ‌డం అవివేక‌మ‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. వ్యూహాలతో పార్టీలు గెల‌వ‌లేవ‌ని, ప్రజల ఓటింగ్ ను బట్టే గెలుపోట‌ములుంటాయ‌ని అన్నారు. డబ్బుతోనే ఎన్నిక‌ల్లో గెలుపు సాధ్య‌మ‌నుకుంటే టాటాలు, అంబానీలు క్ష‌ణాల్లో గవర్నమెంటు ఏర్పాటు చేయ‌గ‌ల‌న‌ర‌ని అన్నారు. శివాజీ క‌థ చెప్ప‌లేద‌ని, ఎవరో కల్యాణ్ జీ చెప్పిన‌ విష‌యాన్ని శివాజీ నమ్మి ఈ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

అవిశ్వాసం తీర్మానం విషయంలో బీజేపీ నాటకాలాడుతోందని, ఆ అంశం చర్చకు రావడం బీజేపీకి ఇష్టం లేదని ఉండ‌వ‌ల్లి అన్నారు. పార్ల‌మెంటులో ర‌చ్చ జ‌రిగిన త‌ర్వాత కూడా విభజన బిల్లును ఆమోదించారని ఆయ‌న గుర్తు చేశారు. లోక్ సభ వెల్ లో 100 మంది ఆందోళనలు చేస్తున్న స‌మ‌యంలో రాష్ట్రాన్ని విభజించార‌ని చెప్పారు. ఆనాడు సభలో సభ్యులను లెక్కించిన స్పీక‌ర్....ఈనాడు ఎందుకు లెక్కించ‌ర‌ని ప్ర‌శ్నించారు. టీడీపీ - వైసీపీలు ఒక‌రిపై ఒక‌రు ఆధిపత్య పోరు కోసం నానా పాట్లు ప‌డుతున్నార‌ని, ఆ పోరును ఆపేయాలని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని క‌నీసం మంగళవారం నాడు ఇరు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వాలని కోరారు. ఇరు పార్టీలు ఒక్క రోజు కొట్లాట‌ను వాయిదా వేసుకోవాల‌ని కోరారు. ఇరు పార్టీల ఎంపీలు ఒక్క‌తాటిపై నిల‌బ‌డి, క‌లిసి క‌ట్టుగా స్పీకర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి లెక్కించమని అడగాలని అన్నారు. అలా స్పీక‌ర్ అంగీక‌రించ‌ని ప‌క్షంలో 2014లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో జరిగింది తప్పని ప్రకటించమని స్పీక‌ర్ ను డిమాండ్ చేయాలని సూచించారు. 2014లో కరెక్ట్ అయింది..2018లో తప్పెలా అవుతుందని ఉండ‌వ‌ల్లి అన్నారు. మ‌రి, ఉండ‌వల్లి లాజిక్ ల‌ను టీడీపీ, వైసీపీలు ఎంత‌వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాయో వేచి చూడాలి.