Begin typing your search above and press return to search.

జగన్ కు ఉండవల్లి సలహా

By:  Tupaki Desk   |   19 Sep 2016 7:10 AM GMT
జగన్ కు ఉండవల్లి సలహా
X
వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న ప్రజాదరణ వారసత్వంగా జగన్ కు వచ్చింది... ఆయనంటే అభిమానిస్తున్నవారు కోట్లాది మంది ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారనుకున్న జగన్ కొద్దిలో ఆ అవకాశాన్ని మిస్సయ్యారు. ఆ తరువాత చంద్రబాబు రాజకీయాల కారణంగా తమ ఎమ్మెల్యేలను కొందరిని కోల్పోయారు. అయినా... ఒంటరి పోరాటంలా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ పోరాడుతూనే ఉన్నారు. అయితే... జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఒకప్పుడు ముఖ్యమైన సలహాదారులా ఉన్న ఉండవల్లి ఇప్పుడు జగన్ కు అదే పెద్ద లోపమని చెబుతున్నారు. జగన్ మంచి నేతయినప్పటికీ ఆయన టీం బాగులేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

వైసీపీ ఏం చేయాలో కూడా ఉండవల్లి సూచించారు. ప్రతిపక్షంగా ప్రభుత్వంపై వైసీపీ పూర్తి స్థాయిలో పోరాటం చేయాలన్నారాయన. గతంలో వైఎస్ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా చేసినా ఆయనకు అనుకున్నంత పేరు రాలేదని.. కానీ 1999 నుంచి 2004 మధ్యలో ప్రతిపక్ష నేతగా ఆయన స్వర్ణ యుగం నడిచిందన్నారు. అసెంబ్లీలో వైఎస్‌ మాట్లాడుతుంటే అప్పటి సీఎం చంద్రబాబుకు మతిపోయేదన్నారు. అందుకు కారణం చుట్టూ ఎవరిని టీంగా పెట్టుకోవాలో వైఎస్‌ గుర్తించడమేనన్నారు. ఇప్పుడు జగన్‌ కూడా ఆ విషయంలో ఆలోచించుకోవాలన్నారు. అలాంటి మేధావులు - వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని ఉండవల్లి చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్‌ బాగుండాలనే తానూ కోరుకుంటానన్నారు. అదేసమయంలో ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబుకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని కాపర్ డ్యాంతో నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. కాపర్‌ డ్యాం అన్నది గట్టిగా ఊదితే ఎగిరిపోతుందన్నారు. అలాంటి దానితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం ప్రపంచంలోనే అద్బుతమన్నారు. మొత్తానికి తాను మంచి సలహాదారునని... ఒకప్పుడు వైఎస్ దూకుడు వెనుక తానున్నానని.. ఇప్పుడు ఓకే అంటే నీ దగ్గరకు వచ్చేస్తా జగన్ అంటున్నట్లుగా ఉన్నాయి ఉండవల్లి మాటలు. మరి జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.