Begin typing your search above and press return to search.

చంద్రబాబుకే ఆ కెపాసిటీ ఉందంటున్న ఉండవల్లి

By:  Tupaki Desk   |   31 July 2016 10:49 AM GMT
చంద్రబాబుకే ఆ కెపాసిటీ ఉందంటున్న ఉండవల్లి
X
ఏపీ ప్రత్యేక హోదా విషయం ఊపందుకుంటోంది. ఏపీలోని పాలక టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న తన మిత్రపక్షంపై నిరసన గళం వినిపిస్తున్న తరుణంలో మిగతా పార్టీల నేతలూ ముందుకొస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందో చంద్రబాబుకు సలహాలిస్తున్నారు. కొందరు విమర్శల రూపంలో సలహాలిస్తుంటే ఇంకొందరు మంచి సలహాలే ఇస్తున్నారు. తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబుకు సలహా ఇచ్చారు. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగితే ఉద్యమం ఊపందుకుంటుందని కూడా చెప్పారు.

ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి ధర్నాలు - నిరసన ప్రదర్శనలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హితవు పలికారు. గుజరాత్ లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కోసం మోడీ అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడే నిరసనలకు దిగారని.. సీఎం హోదాలో ఉండి కూడా స్వయంగా ధర్నాలు చేశారని గుర్తు చేశారు. మోడీనే ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు కూడా హోదా విషయంలో డేరింగ్ స్టెప్ వేయాలన్నారు. చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తే మాత్రమే హోదా లభిస్తుందని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తామన్న విషయాన్ని ప్రభుత్వం తేటతెల్లం చేయాలని - విశాఖపట్నానికి రైల్వే జోన్ విషయంలోనూ చంద్రబాబు గట్టిగా రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేయాలని ఉండవల్లి సూచించారు. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగితే అన్నీ సాధించుకోవచ్చనట్లుగా ఆయన మాట్లాడారు. కాగా ఉండవల్లి గతంలోనూ చంద్రబాబుపై మంచి విశ్వాసం కనబరిచారు. విధానల పరంగా విమర్శలు చేసినా చంద్రబాబు సామర్థ్యంపై ఉండవల్లి గతంలోనూ విశ్వాసం కనబరిచారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మంచిదని ప్రజలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారని.. తాను కూడా చంద్రబాబే సమర్థుడని అనుకున్నానని గతంలో ఆయన ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబును స్వయంగా రంగంలోకి దిగమంటూ సూచిస్తున్నారు.