Begin typing your search above and press return to search.

బాబు ప్రాణానికి కేవీపీకి తోడైన ఉండ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   14 Dec 2017 9:25 AM GMT
బాబు ప్రాణానికి కేవీపీకి తోడైన ఉండ‌వ‌ల్లి
X
కోటి ఆశ‌లు పెట్టుకున్న పోల‌వ‌రం ప్రాజెక్టుతో మైలేజ్ త‌ర్వాత‌..ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కొత్త‌ త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టే అవ‌కాశాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా..అందుకు స్పందించిన కోర్టు కేంద్రాన్ని.. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌మ‌ని కోరింది.

కోర్టు ఇచ్చిన గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ స‌ర్కారు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేదు. దీనిపై ఇప్ప‌టివ‌కే అసంతృప్తి వ్య‌క్తం చేసిన కేవీపీ.. సీఎం చంద్ర‌బాబుకు ఘాటు లేఖ రాశారు. పోల‌వ‌రం ప్ర‌యోజ‌నాల్ని కాపాడేలా రాష్ట్ర స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న కేవీపీ ఆరోప‌ణ‌కు స‌మాధానం ఇవ్వ‌లేదు బాబు స‌ర్కారు. ప్ర‌తి చిన్న విష‌యానికి ఎదురుదాడి చేసే తత్త్వం ఉన్న టీడీపీ త‌మ్ముళ్లు సైతం పోల‌వ‌రం విష‌యం మీద పెద్ద‌గా మాట్లాడ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలాఉంటే.. బాబు ప్రాణానికి కేవీపీ స‌రిపోడ‌ద‌న్న‌ట్లుగా ఇప్పుడు ఆయ‌న‌కు ఉండ‌వ‌ల్లి కూడా తోడ‌య్యారు. త‌న ప‌దునైన వాద‌న‌తో తెగ ఇరుకున పెట్టే ఈ రాజ‌మండ్రి మాజీ ఎంపీ బాబుపై విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు అయ్యే ఖ‌ర్చు మొత్తాన్ని కేంద్ర‌మే భ‌రించేలా పోరాడాల‌న్న కేవీపీకి తోడుగా వాద‌న‌ను వినిపిస్తున్న ఉండ‌వ‌ల్లి మ‌రో విష‌యాన్ని హైలెట్ చేస్తున్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు కాంక్రీట్ ప‌నులు నాసిర‌కంగా జ‌రుగుతున్నాయ‌ని.. ఈ విష‌యంపై గ‌తంలో తాను ఫోటోల‌తో స‌హా వివ‌రాల్ని చంద్ర‌బాబుకు పంపిన‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు. పోల‌వ‌రం మీద కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక బాధ్య‌త‌ను 2014 ఏప్రిల్‌ కే ప‌రిమితం చేయ‌టం స‌రికాద‌న్నారు. ఈ విష‌యం మీద ఏపీ స‌ర్కారు పోరాడాల‌న్నారు. ఆర్థిక బాధ్య‌త‌ను 2014 వ‌ర‌కు ప‌రిమితం చేయ‌టం రాజ్యాంగానికి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టానికి విరుద్ద‌మ‌న్నారు. ఇప్ప‌టికే ఇచ్చిన హామీ మేర‌కు మొత్తం ఖ‌ర్చును భ‌రిస్తామంటూ కేంద్రం ఆదేశాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీ స‌ర్కారు పోరాడాల‌న్నారు. పోల‌వ‌రంపై వ్య‌తిరేక గ‌ళాలు రోజురోజుకి పెరిగిపోతున్న వేళ‌.. వారంద‌రికి స‌ర్దిచెప్ప‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అంత‌కంత‌కూ ఇబ్బందిగా మారుతుంద‌ని చెప్పక త‌ప్ప‌దు.