Begin typing your search above and press return to search.

జగన్ కో దండం

By:  Tupaki Desk   |   16 April 2022 1:30 PM GMT
జగన్ కో దండం
X
ఉండవల్లి అరుణ్ కుమార్. రాజకీయ నేతగా కంటే మేధావిగానే అంతా చూస్తారు. ఆయన వైఎస్సార్ కి దోస్తీ. ఆయన చలవతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటారు. ఇక రెండు సార్లు ఎంపీగా కూడా ఉండవల్లి వైఎస్సార్ హయాంలో పనిచేశారు. తండ్రి అంటే ప్రాణం, తనయుడు అంటే మాత్రం కాస్తా కోపం. ఇదీ ఉండవల్లి పొలిటికల్ స్టాండ్.

ఆయనకు మొహమాటం లేదు. ఏ విషయాన్ని అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా చెబుతారు. ఇక ఆయనకు వైఎస్సార్ ప్రాణ స్నేహితుడు. ఇక ఆ కుటుంబంలో వైఎస్సార్, ఆయన సతీమణి విజయమ్మ వరకే తనకు తెలుసు అని ఉండవల్లి చెబుతున్నారు. ఇక వారిద్దరి తరువాత తనతో చనువుగా ఉండేది అల్లుడు బ్రదర్ అనిల్ మాత్రమే అని కూడా ఆయన ఎక్కడా దాచకనే చెప్పుకున్నారు.

వైఎస్సార్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిలతో తనకు అతి తక్కువ పరిచయమేనని అసలు నిజాలు వెల్లడించారు. ఇక ఏపీలో మూడేళ్ల జగన్ పాలన మీద ఆయన తనదైన విశ్లేషణ చేస్తూ జగన్ మీద సెటైర్లు వేశారు. ఏపీ ఫ్యూచర్ అగమ్యగోచరం అని కూడా అన్నారు.

దీని మీద మీడియా ప్రతినిధులు మీ మేధస్సుతో తెలివితో తగిన సలహా సూచనలు జగన్ కి ఇవ్వవచ్చు కదా అంటే ఉండవల్లి ఒక పెద్ద దండం పెట్టేశారు. జగన్ కి తాను సలహాలు ఇవ్వలేనని, ఇచ్చే స్థాయి లేదని ఆయన అనడమే ఇపుడు అతి పెద్ద విశేషం. జగన్ ఎవరి సలహాలు స్వీకరించడని కూడా ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలే చేయడం ప్రస్థావనార్హం.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మీడియా అధిపతులు రామోజీరావుతోనో, రాధాక్రిష్ణతోనో కాస్తా చర్చలు ఏమైనా జరిపి సలహాలు సూచనలు తీసుకుంటారేమో తెలియదు కానీ జగన్ కి ఎవరి సలహాలూ సూచనలు అసలు అవసరం లేదని ఉండవల్లి వారి ఉవాచ. అందుకే వైఎస్సార్ కి ప్రియ నేస్తంగా ఉన్న ఉండవల్లి జగన్ కో దండం అనేశారు.