Begin typing your search above and press return to search.

ఓట్లు ఊరికే రావు.. ఎంతో పంచాలి.. ఎన్నో చేయాలి

By:  Tupaki Desk   |   16 April 2022 3:28 AM GMT
ఓట్లు ఊరికే రావు.. ఎంతో పంచాలి.. ఎన్నో చేయాలి
X
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం.. మిగిలిన సమయాల్లో పాలన.. అభివృద్ధి మీదనే ఫోకస్ అని చెప్పే అధినేతలు పోయి చాలాకాలమే అయ్యింది. అధికారం చేతికి వచ్చిన క్షణం నుంచే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఏమేం చేయాలన్నట్లుగా చేస్తున్న ఆలోచనలు.. తెర మీదకు తెస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు షాకింగ్ పరిణామాలకు కారణమవుతున్నాయి.

మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం సంక్షేమ పథకాల పేరుతో వివిధ వర్గాలకు అవసరం ఉన్నా లేకున్నా తాయిలాలు పంచేస్తున్న తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ఏపీ తాజా ఆర్థిక పరిస్థితి మీద మాజీ ఎంపీ.. దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడు ఉండవల్లిఅరుణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ పెద్ద బిజినెస్ మ్యాన్ అని భారీ జూదం ఆడుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చాలా చిత్రంగా మారిందన్నారు. ఓవైపు డబ్బులు పంచుతూ.. మరోవైపు పన్నుల రూపంలో లాగేస్తున్నారన్నారు. విద్యుత్ విషయంలో జగన్ కు ముందు చూపు లేదని తప్పుపట్టిన ఆయన.. గతంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు.

తెలంగాణలో పవర్ కట్ లేదని.. ఏపీలో కరెంట్ కట్ విపరీతంగా ఉందన్న ఆయన.. విద్యుత్ కష్టాల నుంచి బయట పడటానికి ఎన్ని యుగాలు పడుతోందనన్న ఆందోళనను వ్యక్తం చేశారు. తెలంగాణ రిచ్ స్టేట్ గా మారితే.. ఏపీ పూర్ స్టేట్ గా తయారైందన్నారు. జగన్ఎంతకాలం బటన్స్ నొక్కి డబ్బులు ఇవ్వగలడో ఇప్పుడే చెప్పలేమన్న ఆయన.. జగన్ చేస్తున్నది తప్పని చెప్పేవారు లేరన్నారు.

ఎవరి మాట వినని తత్త్వం జగన్ సొంతమని.. ఏపీలో ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లేదన్నారు. తెలంగాణ రిచ్ స్టేట్.. ఏపీ పూర్ స్టేట్ గా తయారైందన్న ఆయన మాటల్ని విన్నప్పుడు తెలంగాణలో కాసులు రాల్చే హైదరాబాద్ మహానగరం ఉండటం.. ఏపీలో అలాంటిదేమీ లేకపోవటం ఒక ఎత్తు అయితే.. అవసరం ఉన్నా లేకున్నా సంక్షేమ పథకాల పేరుతో తాయిలాలు పంచే వైనం తాజా పరిస్థితి కారణంగా చెప్పక తప్పదు.

ఎంత ఎక్కువగా తాయిలాలు ఇస్తే అంతలా ఓట్లు వస్తాయన్నది కూడా సరికాదని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు రూ.10 వేలుచొప్పున పంచినా ఎన్నికల్లో గెలవలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. సీఎం జగన్ తీరు చూస్తే.. ఓట్లు రావాలంటే ఎన్నో చేయాలి.. మరెన్నో ఇవ్వాలన్నట్లుగా ఉండటం.. అందుకు తగ్గట్లే ఆయన పాలనా విధానాలు ఉండటం గమనార్హం.