Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు సింప‌తీ పాలిటిక్స్‌పై ఉండ‌వ‌ల్లి కామెంట్స్‌

By:  Tupaki Desk   |   27 Nov 2021 10:30 AM GMT
చంద్ర‌బాబు సింప‌తీ పాలిటిక్స్‌పై ఉండ‌వ‌ల్లి కామెంట్స్‌
X
ఇటీవల ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వైకాపా మంత్రులు... వైకాపా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంతో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరోవైపు వైసీపీ చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఏమీ అనలేదని కౌంటర్ ఇచ్చేందుకు ముప్పుతిప్పలు ప‌డుతోంది. చంద్రబాబు సైతం ప్రచారంలో అసెంబ్లీలో తన భార్యను అవమానించారంటూ చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సంఘటనలపై సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఒక డ్రామాగా తాను భావించడం లేదని చెప్పారు. అసలు దాని గురించి అంత ఎక్కువగా స్పందించాల్సిన అవసరం కూడా ఉందని తాను భావించ‌డం లేద‌న్నారు.

చంద్రబాబు కేవలం సానుభూతి కోసమే అలా చేస్తారని అందరూ భావిస్తున్నారని... గతంలో ఆయనపై బాంబు దాడి జరిగి శరీరమంతా రక్తసిక్తం అయినప్పుడు కూడా సానుభూతి పని చేయలేదని ఆయన గుర్తు చేశారు. సింపతీ రాజకీయాలు ఎప్పుడూ పనిచేయవని వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక 2014 ఎన్నికల్లో జగన్ ఎందుకు గెలవలేకపోయారు అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ మరణం త‌ర్వాత‌ జరిగిన ఎన్నికల్లో తాము ప్రచారానికి వెళుతుంటే మహిళలు తమకు ఎదురు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారని... అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 42 సీట్ల‌కు కేవ‌లం 6 సీట్ల‌లో మాత్రమే విజయం సాధించిందని చెప్పారు.

చంద్రబాబు ఎన్టీఆర్‌ను గద్దె దింపి నప్పుడు కూడా ఎన్టీఆర్ స్వయంగా కేవలం లక్ష్మీపార్వతి వల్లే తాను బతికే ఉన్నానని చెప్పారని.. అప్పుడు కూడా సానుభూతి పని చేయలేదని... ఒక్క‌ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మాత్రమే కొంత సానుభూతి పనిచేసిందని ఉండవల్లి స్పష్టం చేశారు. ఇక వైసీపీ మంత్రులు మాట్లాడుతున్న మాటలు పూర్తిగా అవాస్తవాలు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ తెలిసినవే అని చెప్పారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ ? ఉంటుందని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్ మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకుని... మళ్ళీ తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పటం ప్రభుత్వ వైఫ‌ల్య‌మే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనేది అవసరాన్ని బట్టి ప్రతిపక్షం సలహాలు కూడా తీసుకోవాలని... చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు అసెంబ్లీలోనే అగౌరవంగా మాట్లాడుతున్నప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఏదేమైనా అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఉండవల్లి తన అసహనాన్ని వ్యక్తం చేశారు.