Begin typing your search above and press return to search.

అద్భుతం జరిగితేనే బాబు సీఎం : ఉండవల్లి

By:  Tupaki Desk   |   10 Jan 2019 4:11 PM GMT
అద్భుతం జరిగితేనే బాబు సీఎం : ఉండవల్లి
X
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదా.. ? ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి ప్రయాణం చేయలేరా.. ? తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయా...? అవుననే అంటున్నారా.... రాజకీయ నాయకుడు, తనకు తాను రిటైర్ మెంట్ ప్రకటించుకున్న రాజకీయ మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్ కుమార్. గురువారం నాడు ఓ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఈ విషయాలు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని, అయితే నారా చంద్రబాబు నాయుడు చివరి వరకూ తన పట్టును వదలరని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సూపర్ హిట్ అయ్యిందని ఉండవల్లి ప్రశంసించారు. " గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రల కంటే జగన్ పాదయాత్ర చాలా హిట్ అయ్యింది. ఈ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు " అని ఉండవల్లి విశ్లేషించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ మక్తాయింపు ఇచ్చారు.
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోవాలని లేదని, మరో 15 సంవత్సరాలు వరకూ ఆయన వేచి చూస్తానని ఆయన తనతో అన్నారని ఉండవల్లి చెప్పారు.

రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిస్తే నష్టపోయేది పవన్ కల్యాణ్ మాత్రమేనని ఉండవల్లి అన్నారు. " గత ఎన్నికల్లో వీరిద్దరు కలిస్తేనే కేవలం నాలుగు, ఐదు లక్షల ఓట్ల తేడాతోనే జగన్ ఓడిపోయారు. ఇప్పుడు వారిద్దరు కలిసినా జగన్ కు పెద్దగా నష్టం ఉండదు" అని ఉండవల్లి అన్నారు. అయితే పవన్ కల్యాణ్, జగన్ కలిస్తే మాత్రం రాష్ట్రంలో ప్రభంజనమే అని ఉండవల్లి అన్నారు. " జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిస్తే అద్భుతమే. అయితే వారిద్దరు కలిసే అవకాశాలు చాలా తక్కువ" అని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. రానున్న ఎన్నికల్లో తాను తటస్థంగానే ఉంటానని, ఎవరికి మద్దతు పలకనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.