Begin typing your search above and press return to search.

రామోజీరావుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   7 Nov 2022 8:31 AM GMT
రామోజీరావుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు!
X
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావుపై ఎలాంటి కేసులు పెట్టినా స్టేలు తెచ్చుకోగల ఘనుడని హాట్‌ కామెంట్స్‌ చేశారు. తన వద్ద ఆధారాలన్నీ జగన్‌ ప్రభుత్వాన్ని అందిస్తానన్నారు. రామోజీరావు చట్టాలకు అతీతుడు కాదనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు రామోజీరావుపై ఉండవల్లి చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

చట్టాలను ఎలా మలుపు తిప్పవచ్చో దానికి మార్గదర్శే కేసు ఉదాహరణ అని ఉండవల్లి చెప్పారు. దీనిపై తానొక పుస్తకాన్ని రాస్తానని తెలిపారు. మార్గదర్శి కేసు తేలేవరకు రామోజీరావు, తాను ప్రాణాలతో ఉంటామో లేదో కూడా తెలియదన్నారు.

రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కి డిపాజిట్లు సేకరించే హక్కు లేదని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మార్గదర్శికి, రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. బ్యాలెన్స్‌ షీట్‌లో ఛైర్మన్‌గా రామోజీరావు సంతకం చేశారని ఉండవల్లి గుర్తు చేశారు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. రామోజీరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించే హక్కు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కి లేదు. మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడ్‌విట్‌లో మార్గదర్శి నాదే అని రామోజీ సంతకం చేశారు. సెక్షన్‌ 10 ప్రకారం ఏ చిట్‌ఫండ్‌ కంపెనీ ఇతర ఏ వ్యాపారం చేయకూడదు. కానీ రామోజీరావు మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్‌ కింద సేకరించిన డబ్బులను మిగతా వ్యాపారాలకు వాడుకున్నారు. ఇలా డిపాజిట్లు సేకరించి.. వేరే వ్యాపారాలకు వాడుకోవడం చట్టవిరుద్ధం’ అని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తేల్చిచెప్పారు.

'చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్న రామోజీరావు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది పచ్చి అబద్ధం. చట్టం అనేది కొరడా లాంటిది. కోర్టులో ఒకసారి చిట్‌ఫండ్‌ తనదే అని రామోజీ అన్నారు.. మరోసారి కాదన్నారు. నేను చెప్పే ప్రతీ అంశానికి డాక్యుమెంటరీ ఆధారం ఉంది. మార్గదర్శి రామోజీదా? కాదా? అనేది తేల్చాలి. రామోజీరావుకు చిట్‌ఫండ్‌ కంపెనీకి సంబంధం ఉందా లేదా?. మార్గదర్శితో రామోజీకి సంబంధం లేకుంటే కేసు విత్‌డ్రా చేసుకుంటాను. రామోజీపై ఎలాంటి కేసులు పెట్టినా వెంటనే స్టే తెచ్చుకోగలరు. రామోజీరావు లాంటి వ్యక్తితో పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరు’ అంటూ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

మార్గదర్శిపై తాను కేసు పెట్టి 16 ఏళ్లు అయ్యిందని ఉండవల్లి గుర్తు చేశారు. దానిపై చర్యలు చేపట్టకుండా మిగిలిన చిట్‌ఫండ్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. కాగా ఏపీ రాజధానిగా అమరావతిని తాను ఒప్పుకుంటున్నానని జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలిపారని ఉండవల్లి గుర్తు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.