Begin typing your search above and press return to search.

ఉండవల్లి మాట విన్నారా జగన్..పవన్..కామ్రేడ్స్

By:  Tupaki Desk   |   24 Sep 2016 7:49 AM GMT
ఉండవల్లి మాట విన్నారా జగన్..పవన్..కామ్రేడ్స్
X
సీమాంధ్ర నేతలు అన్నంతనే అందరికి గుర్తుకు వచ్చేది వారు రాజకీయ నాయకుల కంటే కూడా.. బడా బడా పారిశ్రామివేత్తలుగా మదిలో మెదులుతారు. నిజానికిదే సీమాంధ్రుల దురదృష్టంగా చెప్పాలి. రాజకీయ నాయకులు అంటే.. అయితే ఉద్యమనేతలో.. లేదంటే కేవలం రాజకీయమే వ్యాపకంగా పెట్టుకున్న నేతలు ఎంతమంది అని లెక్క వేస్తే.. నిరుత్సాహం నిలువెత్తున ఆవరిస్తుంది. ఇందుకు మినహాయింపుగా చూస్తే.. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటోళ్లు కొద్దిమందే కనిపిస్తుంటారు. అయితే.. వీరు సైతం యాక్టివ్ గా లేకుండా అప్పుడో మాట.. అప్పుడో మాట చెప్పటమే తప్పించి నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండటం కనిపించదు. దీనికి తోడు వీరికున్న ఇమేజ్ సైతం అంత ఎక్కువగా లేకపోవటం ఒక పెద్ద లోపంగా చెప్పాలి.

ప్రజాకర్షక నేతలు ఎవరైనా వారికి నేతృత్వం వహిస్తే వీరెన్ని సంచలనాలు సృష్టిస్తారన్నది దివంగత మహానేత వైఎస్ ను గుర్తుకు తెచ్చుకుంటే ఉండవల్లి ఎంతటి మొనగాడో తెలుస్తుంది. అయితే.. అదే ఉండవల్లి ఆ తర్వాత కాలంలో ఎందుకు కొరగాకుండా పోయారన్న విషయం మర్చిపోకూడదు. మంచి వాగ్ధాటి.. తెలివితేటలు ఉన్నప్పటికీ.. అలాంటి నేతలకు దిశానిర్దేశం చేసే వైఎస్ లాంటోళ్లు ఉంటే తప్ప వారు మెరవరు.

ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. తాజాగా ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. మేధావిగా..విశేష రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చూసినప్పుడు ఆయన చేసిన సూచనలో ఎంతోకొంత అర్థం ఉందనే చెప్పాలి. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కమ్యూనిస్ట్ లు అంతా కలిసి ఒకే వేదికగా పోరాడితే ఏపికి ప్రత్యేక హోదా రావటం ఖాయమని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. ప్రాక్టికల్ గా చూస్తే ఇలాంటివి సాధ్యం కాదనిపించక మానదు. అయితే.. ఏపీకి ప్రత్యేక హోదానే ధ్యేయంగా పని చేస్తే ఇదేమీ అసాధ్యం కాదన్న భావన కలగటం ఖాయం. అంతేకాదు.. తాను చెప్పిన వారంతా ఒక కూటమిగా అవతరించి.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీలపై పోటీ చేస్తే ఫలితం ఉంటుందన్నారు. వినటానికి బాగానే ఉన్నా.. ఉత్తర - దక్షిణ ధ్రువాలుగా ఉన్న వీరంతా ఒక జట్టు కట్టే ఛాన్స్ ఉందా? నిజానికి వీరంతా ఒక జట్టు కట్టే కన్నా.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటమే ఈజీనేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/