Begin typing your search above and press return to search.

మోడీ ప్ర‌భుత్వంలో.. ఫార్మా క్యాపిట‌ల్ వ‌రల్డ్ నుంచి పేషంట్ క్యాపిట‌ల్ వ‌ర‌ల్డ్‌గా మారిందా?

By:  Tupaki Desk   |   21 April 2021 8:39 AM GMT
మోడీ ప్ర‌భుత్వంలో.. ఫార్మా క్యాపిట‌ల్ వ‌రల్డ్ నుంచి పేషంట్ క్యాపిట‌ల్ వ‌ర‌ల్డ్‌గా మారిందా?
X
భార‌త్‌లో క‌రోనా బీభ‌త్సం మామూలుగా లేదు. తొలిద‌శ‌ను మించిపోయి... రెండో ద‌శ‌లో క‌రోనా త‌న విశ్వ‌రూ పం చూపిస్తోంది. అయితే.. ఈ రెండిటి మ‌ధ్య తేడా ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ విష‌యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారు స్పందించిన తీరు.. తీసుకున్న చ‌ర్య‌ల్లో మ‌రింత స్ప‌ష్టత ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం మోడీ స‌ర్కారు నిష్ఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. తొలిద‌శ క‌రోనా దేశంలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే మోడీ ఊహించ‌ని విధంగా లాక్‌డౌన్ విధించారు. ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుంది? దేశం ఎటు పోతుంది? అనే ఆలోచ‌న కూడా చేయ‌కుండా.. రాత్రికిరాత్రి లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న చేశారు.

దీంతో ప్ర‌పంచ దేశాల్లో మోడీ ప్ర‌భ వెలిగిపోయింది. ముఖ్యంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ WHO మోడీని ఆకాశానికి ఎత్తేసింది. ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌ల‌తో భార‌త్‌లో క‌రోనా బాగా క‌ట్టడి అయింద‌ని కితాబు ఇచ్చింది.ఈ ఆనందంలో మోడీ ఛాతీ 76 అంగుళాల నుంచి 90 అగుళాల‌కు విస్త‌రించింద‌ని ప్ర‌తిప‌క్షాలు కామెంట్లు కూడా చేశాయి. ఇక‌, అప్ప‌టి లాక్‌డౌన్‌ను ఎవ‌రూ విమ‌ర్శించ‌లేక‌పోయారు. ఇక‌, ఈ ఆనంద డోలిక‌ల్లో ఊరేగిన మోడీ.. రెండో ద‌శ క‌రోనా వ‌స్తుంద‌ని కానీ, ఇంత తీవ్రంగా ప్ర‌భావం చూపిస్తుంద‌ని కానీ.. ఊహించ‌లేక పోయారు.

దీంతో దేశంలో గ‌తంలో లేని విధంగా క‌రోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. రోజుకు మూడు ల‌క్ష‌ల కేసులు .. అధికారికంగానే వెలుగు చూస్తున్న వికృత ప‌రిస్థితి దేశంలో దాపురించింది. ఇక‌, అన‌ధికార కేసుల సంఖ్య మ‌రిన్ని ల‌క్షల్లో ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆసుప‌త్రులు కిట‌కిట‌లాడుతున్నాయి. బెడ్లు కూడా ల‌భించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ప్ర‌భుత్వాలు సైతం చేతులు ఎత్తేసే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ప్ర‌జ‌ల ప‌ట్ల ఎంత బాధ్య‌త ఉన్నా.. సౌక‌ర్యాల లేమి ప్ర‌భుత్వాల‌ను చేష్ట‌లుడిగేలా చేస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. అంద‌రి వేళ్లూ ఇప్పుడు మోడీ వైపే చూపుతున్నాయి.

మోడీ ప్ర‌భుత్వం విఫ‌లం కాబ‌ట్టే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ప్ర‌తి ఒక్క‌రూ దుయ్య‌బ‌డుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ్యాక్సిన్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరేన‌ని చెబుతున్నారు. ముందుగానే వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల‌కు రుణాలు మంజూరు చేయ‌డ‌మో.. లేక ఆర్థిక ప్యాకేజీలు ప్ర‌క‌టించ‌డ‌మో చేసి ఉంటే.. వ్యాక్సిన్ భారీ ఎత్తున త‌యారై ఉండేది. అదేస‌మ‌యంలో దేశంలో 50 శాతం మంది ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అంది ఉండేది. దీంతో ఇంత ఘోర‌మైన ప‌రిస్థితి ఉత్ప‌న్నంఅయి ఉండేది కాద‌ని నిపుణులు చెబుతున్నారు.

కానీ, మోడీ స‌ర్కారు గొప్ప‌ల‌కు పోయి.. ఇత‌ర దేశాల‌కు దాదాపు 6.5 కోట్ల డోసుల‌ను ఉదారంగా ఎగుమ‌తి చేసింది. దీంతో వ్యాక్సిన్ నిల్వ‌లు దేశంలో నిండుకున్నాయి. ఇప్పుడు త‌యారు చేస్తే.., త‌ప్ప‌.. వ‌చ్చే రోజుల్లో వ్యాక్సిన్ అందించ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు హుటాహుటిన క‌ళ్లు తెరిచిన మోడీ.. సీరం సంస్థ‌కు 3000 కోట్లు, భార‌త్ బ‌యోటెక్‌కు 1500 కోట్లు ఇచ్చామ‌ని చెప్పారు. అయితే.. నిజానికి ఆ నిధులు అంత పెద్ద మొత్తంలో ఆయా సంస్థ‌ల‌కు చేరాయో లేదో సందేహ‌మే. కానీ, ఇదే ప‌ని మూడు మాసాల ముందు .. చేసిఉంటే.. ఇప్ప‌టికి.. వ్యాక్సిన్ 10 రెట్ల మేర‌కు వారు ఉత్ప‌త్తి చేసి ఉండేవారని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి దేశ ఫార్మా రంగం ఏమీ చిన్న‌ది కాదు. ప్ర‌పంచంలోనే దాదాపు 60 శాతం మ‌న దేశం నుంచే ఔష‌ధాలు ఎగుమ‌తి అవుతున్నాయి. త‌యార‌య్యేది కూడా ఇక్క‌డే. దీంతో ప్ర‌పంచంలోనే ఫార్మా క్యాపిట‌ల్‌గా భార‌త్ పేరు తెచ్చుకుంది. అదే రికార్డు కూడా కొన‌సాగేది. కానీ, మోడీ అవ‌లంభించిన విధానం... తీవ్ర నిర్లక్ష్యం కార‌ణంగా ఇప్పుడు ఫ్యార్మా క్యాపిట‌ల్ కాస్తా.. పేషంట్ క్యాపిట‌ల్‌గా దేశం మారిపోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీవీ చానెళ్ల డిబేట్ల‌లోనూ ఇదే త‌ర‌హా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మోడీ స‌ర్కారుపై నిప్పులు చెబుతున్నారు.

ఇక‌, ఈ విష‌యంలో ఒక కీల‌క అంశం ఉంది. అదేంటంటే.. ప్ర‌భుత్వం ఎంత చేసినా.. ఎన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా.. క‌రోనా వంటి అత్యంత భ‌యంక‌ర‌మైన అంటు వ్యాధి, ప్రాణాంత‌క వ్యాధిని తుద‌ముట్టించేందుకు ప్ర‌జ‌ల్లోనూ సామాజిక బాధ్య‌త ఉండాలి. అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంది. మాస్కులు, శానిటైజ‌ర్ల వినియోగం పెంచాలి. కానీ, ఈ విష‌యంలో ప్ర‌జ‌లు నిర్లిప్తంగా ఉంటున్నారు. ``మాకు రాదులే`` అనే ధైర్యం.. వ‌చ్చాక చూసుకుందామ‌నే ఉదాసీన‌త ఎక్కువ మందిలో క‌నిపిస్తోంది. ఇక‌, ఇప్ప‌టికైనా.. దేశంలో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నించైనా.. ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని `Tupaki.com` కోరుతోందం. ప్ర‌భుత్వం మీదే ఆధార‌ప‌డ‌డం కాకుండా సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనాపై పోరు చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. సో.. మాస్కులు పెట్టుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి. అవ‌స‌రం ఉంటేనే బ‌య‌ట‌కు రావాలి. వీటి ద్వారానే క‌రోన‌ను జ‌యించ‌గ‌లం. లేక‌పోతే.. మ‌న దేశం కూడా అగ్ర‌రాజ్యం అమెరికా త‌ర‌హాలో చేతులు ఎత్తేయ‌డం ఖాయం!!