Begin typing your search above and press return to search.

ఉద్యోగాల భ‌ర్తీ.. ఎన్నిక‌ల వ‌ర‌కూ సాగ‌దీసేలా!

By:  Tupaki Desk   |   12 Nov 2021 3:30 AM GMT
ఉద్యోగాల భ‌ర్తీ.. ఎన్నిక‌ల వ‌ర‌కూ సాగ‌దీసేలా!
X
అదిగో ఉద్యోగాల భర్తీ.. ఇదిగో నోటిఫికేష‌న్ అంటూ నిరుద్యోగుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఊరిస్తూనే ఉంది. రెండేళ్లుగా నోటిఫికేష‌న్ వేస్తామంటూ కాల‌యాప‌న చేస్తోంది. ఏదో ఓ కార‌ణాన్ని అడ్డంకిగా చూపించి కావాల‌నే ప్ర‌భుత్వం ఈ విష‌యాంలో జాప్యం చేస్తోంద‌ని నిరుద్యోగుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఏదో చేస్తున్నామ‌నే భావన క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్రభుత్వం.. యువ‌త ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్న నోటిఫికేష‌న్‌ను మాత్రం విడుద‌ల చేయ‌డం లేదు. తాజాగా ఉద్యోగ నియామ‌కాల‌పై విధివిధానాలను రూపొందించడం కోసం క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ క‌మిటీ పేరుతో మ‌రింత కాల‌యాప‌న చేయ‌డమే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని నిరుద్యోగులు మండిప‌డుతున్నారు.

50 వేల ఉద్యోగులు త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌బోతున్నాం.. 60 వేల ఖాళీల‌ను గుర్తించాం.. 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తాం.. రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తాం.. ఇవీ గ‌త కొంత‌కాలంగా ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌లు. ఒక్కోసారి ఒక్కోలా చెప్తూ ఖాళీల సంఖ్య‌ను పెంచుతూ నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భ‌ర్తీ అంశం టీఆర్ఎస్ పార్టీకి ఎన్నిక‌ల అస్త్రంగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే నోటిఫికేష‌న్ విష‌యాన్ని తెర‌మీద‌కు తెస్తున్నార‌ని ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోతున్నార‌ని ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ఉద్యోగాల భ‌ర్తీ చేస్తుంద‌ని టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు, తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లోనూ ఆ పార్టీ నేత‌లు అవే మాట‌లు మాట్లాడారు. ఖాళీల సంఖ్య‌ను పెంచి చెప్ప‌డం ఒక్క‌టే మారింది.

ఇక ఇప్పుడేమో క‌మిటీ నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో కొత్త జోన‌ల్ విధానం అమ‌లులో జాప్యం కార‌ణంగానే నోటిఫికేష‌న్లు వేయ‌లేక‌పోతున్నామ‌ని గ‌తంలో కేసీఆర్ అన్నారు. కానీ 33 జిల్లాల‌కు సంబంధించి కొత్త జోన‌ల్ విధానానికి కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమోదం తెలిపింది. దానికి రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇక ఉద్యోగాల భ‌ర్తీకి ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగుల వ‌ర్గీక‌ర‌ణ‌ను ప్ర‌భుత్వం సాకుగా చూపిస్తుంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉమ్మ‌డి జిల్లాల వారీగా ఉన్న ఉద్యోగుల‌నే విభ‌జించిన జిల్లాల‌కు క్యాడ‌ర్ వారీగా పంపాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అనుకుంటుంది. కానీ అందుకు ఉద్యోగ సంఘాలు ఒప్పుకోవ‌డం లేదు. ముందు ఖాళీలు గుర్తించి వాళ్ల‌ను కొత్త నియామ‌కాల ద్వారా తీసుకోవాల‌ని ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి.

కొత్త జోన్ల వారీగా ఉద్యోగుల సంఖ్య, ఖాళీల నిర్ధార‌ణ‌, జోన్ల‌లో బ‌ద‌లాయింపుల త‌ర్వాతే నోటిషికేష‌న్ వేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఆ నియామ‌కాల‌పై విధివిధానాల రూప‌కల్ప‌న కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివ‌శంక‌ర్ అధ్య‌క్ష‌త‌న క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఏయే ఉద్యోగాల‌ను ఏ నియామ‌క సంస్థ‌ల ద్వారా భ‌ర్తీ చేయాలి? వాటిని ఎలా నిర్ణ‌యించాలి? అనే విష‌యాల‌పై ఈ క‌మిటీ ప్ర‌భుత్వానికి మార్గ‌ద‌ర్శ‌కాలు అందిస్తుంది. అయితే ఈ క‌మిటీ పేరుతో ప్ర‌భుత్వం కాల‌యాప‌న చేస్తుంద‌ని.. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ వ్య‌వ‌హారాన్ని లాగుతుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి అప్పుడు యువ‌త ఓట్ల‌ను ద‌క్కించుకునేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతుంద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం కూడా లేదు. అందుకే అప్ప‌టివ‌ర‌కూ ఈ విష‌యాన్ని నాన్చ‌డ‌మే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌నే అభిప్రాయ‌లు వినిపిస్తున్నాయి.