Begin typing your search above and press return to search.

నిరుద్యోగీ జిందాబాద్....క్రెడిట్ ఆ రాష్ట్రానికే...?

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 PM GMT
నిరుద్యోగీ జిందాబాద్....క్రెడిట్ ఆ రాష్ట్రానికే...?
X
ఏ మూలన చూసినా ఏమున్నది గర్వకారణం. ప్రతీ మనిషికీ మరో ముద్దు పేరు నిరుద్యోగి అని పెట్టుకోవడమే. ఇది మహాకవి శ్రీశ్రీ గేయానికి పేరడీగా చెప్పుకోవాల్సిందే. దేశంలో అంతకంతకు నిరుద్యోగం పెరిగి పెద్దదైపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎటూ లేవు, ప్రైవేట్ రంగంలో కూడా లేని దుస్థితి ఏర్పడుతోంది. గతంతో పోలిస్తే టెక్నాలజీ రావడంతో మానవ వనరుల అవసరాలు తగ్గిపోతున్నాయి. ఇంకో వైపు చూస్తే ఏ ఏటి కా ఏడు ఉపాధి వృద్ధి రేటు దారుణంగా పడిపోతోంది.

దానికి పాలకుల విధానాలే కారణం అని అందరికీ తెలుసు. కానీ సంస్కరణ పేరుతో ప్రభుత్వాలు కొత్త దిశను దశను చూపిస్తామని అంటున్నాయి. మొత్తంగా చూస్తే నిరుద్యోగ భారతం అన్న పేరు అయితే స్థిరపడిపోతోంది. లేటెస్ట్ గా సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ గణాంకాలను చూసుకుంటే మార్చిలో 7.6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌కు 7.83 శాతానికి పెరిగిందని తెలుస్తోంది.

ఇక ఇది పట్టణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉందని కూడా చెబుతున్నారు. పట్టణాల్లో మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 8.28 శాతంగా నుంచి 9.22 శాతానికి చేరగా, ఇదే సమయంలో గ్రామాలలో 7.29 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 7.18 శాతాంకి తగ్గింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఉంది.

మరో వైపు దేశంలో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో హర్యానాదే ఫస్ట్ ప్లేస్ గా చెప్పుకోవాలి. అక్కడ 34.5 శాతం ఉంటే ఆ తరువాత వరసలో రాజస్థాన్‌ 28.8 శాతం, బీహార్‌ 21.1 శాతం గా నమోదైంది. ఇక, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం వరుసగా 0.2 శాతం, 0.6 శాతం, 1.2 శాతం చొప్పున తక్కువ నిరుద్యోగిత రేటు నమోదు చేసుకున్నాయి అని ఈ గణాంకాలు తెలియచేస్తున్నాయి.

ఇక ఈ గణాంకాలలో మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఒక్క మార్చి నెలలోనే లేబర్ ఫోర్స్ ఏకంగా 38 లక్షలకు తగ్గిందట. అదే విధంగా చాలా మంది తమకు తగిన ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో ఉద్యోగాల వేటనే నిలిపేశారని అంటున్నారు. ఆర్ధికంగా మందగమనంతో పాటు ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయని విశ్లేషణలు ఉన్నాయి.

ఇక దేశంలో వృద్ధి రేటు ఆరు నుంచి ఎనిమిది శాతం మధ్య నమోదు అవుతోంది. ఇది ఏ మాత్రం ఆర్ధిక చురుకుదనానికి సరిపోదు అని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అది ఇంకా పెరిగితేనే దేశంలో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే అన్ని రంగాల్లో తాండవిస్తున్న ద్రవ్యోల్బనం ఆధిక వృద్ధి రేటు పెరగకుండా బ్రేకులు వేస్తోంది.

దీనికి జాతీయ అంతర్జాతీయంగా అనేక పరిణామాలు కూడా కారణం అవుతున్నాయి. మరి వీటిని ఛేదించుకుని ఆర్ధిక రంగం పరుగులు తీయడం అన్నది ఒక సవాల్ గానే చూడాలి. ఇవన్నీ ఇలా ఉంటే దేశంలో విద్యుత్, వ్యవసాయం, ఉపాధికల్పనా రంగాల్లో సంక్షోభాలు నెలకొన్నాయని మోడీ ఎనిమిదేళ్ళ పాలన అద్వాన్నపు పాలనకు ఇది కేసు స్టడీ లాంటిది అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. మొత్తానికి దేశం ఎటు పోతోంది అంటే ఆలోచించినా జవాబు దొరకేదేమో.