Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం పేషీని ముట్టడించటం ఇంత ఈజీనా?

By:  Tupaki Desk   |   1 Oct 2015 9:04 AM GMT
ఏపీ సీఎం పేషీని ముట్టడించటం ఇంత ఈజీనా?
X
వివిధ సమస్యలపై తమ నిరసన వ్యక్తం చేస్తూ.. ఛలో అసెంబ్లీ.. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడి లాంటివి ఆందోళనకారులు పిలుపునిస్తుంటారు. ఈ సందర్భంగా వారు చేసిన ప్రకటనలు వాస్తవ రూపం దాల్చకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. బాబు వస్తే జాబు పక్కా అంటూ ప్రచారం చేసి.. ఏపీ యువతలో కోటి ఆశలు కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరినా ఇప్పటివరకూ ఉద్యోగ భర్తీలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోలేదు.

దీంతో.. బాబు వస్తే జాబు గ్యారెంటీ అంటూ నాడు చంద్రబాబు చెప్పిన మాటలు కామెడీగా మారాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చని బాబు సర్కారుపై నిరసన వ్యక్తం చేస్తూ.. నిరుద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లుగా ప్రకటించింది.

సాధారణంగా ఇలాంటి పిలుపు ఇచ్చిన వెంటనే పోలీసులు అలెర్ట్ అయిపోతుంటారు. కానీ.. ఏం జరిగిందో ఏమో కానీ.. తాము చెప్పినట్లే ఏపీ సీఎం క్యాంపు ఆఫీసును విజయవంతంగా ముట్టడించటంలో నిరుద్యోగ సంఘాల కార్యాచరణ సమితి సక్సెస్ అయ్యింది. నిజానికి సీఎం క్యాంప్ ఆఫీసులో మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. అలాంటి సమయంలో ఆందోళనలు సాగుతూ.. సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడించటంలో విజయవంతం కావటం చూసినప్పుడు ఏపీ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు.