Begin typing your search above and press return to search.

ఓలా నుంచి ఊహించని ప్రకటన.. విన్నంతనే హ్యాపీగా ఫీల్ అవుతారంతే

By:  Tupaki Desk   |   22 Aug 2021 3:57 AM GMT
ఓలా నుంచి ఊహించని ప్రకటన.. విన్నంతనే హ్యాపీగా ఫీల్ అవుతారంతే
X
లీటరు పెట్రోల్ వంద రూపాయిలు దాటిపోతే.. లీటరు డీజిల్ రూ.వందకు దగ్గరకు వచ్చేసింది. మహా అయితే.. మరోమూడు నాలుగు రూపాయిలకు దూరంలో ఉంది. మోడీ మాష్టారి పుణ్యమా అని.. లీటరు డీజిల్ సెంచరీ సాధించేయటం పెద్ద కష్టమైన పనైతే కాదు. దీంతోరానున్న రోజుల్లో పెట్రోల్.. డీజిల్ వాహనాల్ని వాడే కన్నా.. నాలుగు రూపాయిలు ఎక్కువైనా ఎలక్ట్రిక్ మీదకు ఆలోచనలు మళ్లుతున్నాయి. కాకుంటే.. సమస్యల్లా ఎలక్ట్రిక్ బైకులు.. కారుల ధరలు భారీగా ఉండటం.. ఎంత రాయితీలు ఇచ్చినా.. సామాన్యుడికి అందనంత దూరంలో ఉండటం ఇబ్బందిని కలిగిస్తోంది. అయినప్పటికి.. కొన్ని కంపెనీల బైకులు కొనుగోలు చేయటానికి పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది.

పంద్రాగస్టు వేళ.. భారత మార్కెట్లోకి తన ఎలక్ట్రిక్ బైకును విడుదల చేసింది ఓలా. ఇప్పటికే ప్రీ బుకింగ్ లు చేస్తూ.. ఏకంగా లక్ష వాహనాల బుకింగులో పెద్ద ఎత్తున నమోదవుతూ రికార్డుల్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఓలా మోపెడ్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న వేళ.. కారు మాటేమిటన్న సందేహానికి సమాధానం వచ్చేసింది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో ఓలా కో ఫౌండర్ భవీష్ అగర్వాల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ట్విటర్ లో ఒక నెటిషఝన్ భవీష్ అగర్వాల్కు ట్యాగ్ చేస్తూ.. మీకు ఉన్న కారు పెట్రోలా? డీజిలా? లేదంటే ఎలక్ట్రికలా?. అని ప్రశ్నించారు. దీనికి ఎవరూ ఊహించని సమాధానం వచ్చింది. త్వరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తామన్న విషయాన్ని భవీష్ వెల్లడించారు. రెండు నెలల క్రితం వరకు తనకు కారు లేదన్న అతడు.. ఇప్పుడు తన వద్ద హైబ్రిడ్ కారు ఉందన్నారు. అయితే.. తాను 2023లో ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోబోతున్న విషయాన్ని చెప్పిన ఆయన.. 'ఓలా ఎలక్ట్రిక్ కారు' అంటూ బదులిచ్చారు. దీంతో.. ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన మాటల్ని వింటే అర్థం కాక మానదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైకులతో సంచలనాన్ని క్రియేట్ చేసిన ఓలా.. తన ఎలక్ట్రిక్ కారు మాటతో అందరిని తన వైపు చూపు పడేలా చేస్తుందని చెప్పక తప్పదు.