Begin typing your search above and press return to search.

ఊహించని విధంగా ‘ఒమిక్రాన్‌’ విజృంభణ .. మహారాష్ట్రాలో కలకలం

By:  Tupaki Desk   |   29 Nov 2021 5:30 AM GMT
ఊహించని విధంగా ‘ఒమిక్రాన్‌’  విజృంభణ ..  మహారాష్ట్రాలో కలకలం
X
కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్‌ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్‌’ యావత్‌ ప్రపంచ దేశాల్ని వణికిపోయేలా చేస్తుంది. ఒమిక్రాన్‌ గా రూపుమార్చుకున్న ఈ మహమ్మారి మరోసారి ప్రపంచం పై దండెత్తడానికి వస్తోంది. తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది.

సౌతాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్‌ ప్రపంచానికి పాకేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రాలోని థానే జిల్లాకు చెందిన డోంబివ్లిలో కరోనా కలకలం సృష్టించింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా వైరస్ పాజిటివ్‌ గా తేలింది. దీంతో ఒక్కసారిగా గందరోళ వాతావరణం నెలకొంది.

అయితే, ఇది ఒమిక్రాన్‌ వేరియంట్‌ అనడానికి మాత్రం ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. పరీక్షల నిమిత్తం అధికారులు శాంపిల్స్‌ ను ల్యాబ్‌ కు పంపించి, సదరు వ్యక్తికి క్వారంటైన్‌ కు తరలించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ ముప్పు సంక్షోభంగా మారకముందే ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

ఇప్పటికే పలు దేశాలు, అంతర్జాతీయ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో ఇజ్రాయెల్‌ ముందు వరుసలో ఉంది. సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.

ఇప్పటికే ఐరాపా ఖండంలోని కొన్న దేశాలతో పాటు, ఆస్ట్రేలియా కూడా ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. ఇక ఒమిక్రాన్‌ ను నిరోధించే క్రమంలో భారత ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియంత్రణ, నిఘా పెంచాలని సూచించారు. అలాగే టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

దీంతో మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల బాట పట్టాయి. సరిహద్దులను మూసివేశాయి. విదేశాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలన్న నిర్ణయంపై పునఃసమీక్షించాలనుకుంటున్నది. కొత్త వేరియంట్‌ ఉద్ధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలకి కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. వైరస్‌ భయాలతో పలు రాష్ట్రాలు కూడా కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి.