Begin typing your search above and press return to search.

వంగవీటి వర్థంతి వేళ.. బెజవాడలో ఇలా జరగటమా?

By:  Tupaki Desk   |   26 Dec 2021 12:31 PM GMT
వంగవీటి వర్థంతి వేళ.. బెజవాడలో ఇలా జరగటమా?
X
బెజవాడలో అంచనాలకు అందని రీతిలో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు జరిగింది? అన్నదిప్పుడు చర్చకు తెర తీసింది. ఈ రోజు (ఆదివారం) రంగా 33వ వర్థంతి. బెజవాడ నడిబొడ్డుగా చెప్పే రాఘవయ్య పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలు పార్టీల నేతలు నివాళులు అర్పించారు. వంగవీటి రంగా రాజకీయ వారసుడు కమ్ ఆయన కుమారుడు వంగవీటి రాధా తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసుకోవటానికి వచ్చారు.

అదే సమయంలో వల్లభనేని వంశీ.. పోతిన మహేశ్ తదితరులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒక సమయంలో వంగవీటి రాధా.. వల్లభనేని వంశీ కలవటం.. ఇరువురు కలిసి మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వంగవీటి రాధా.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం వైసీపీలో ఉంటున్న వల్లభనేని వంశీని కలవటం.. వారిద్దరి మధ్య మాటలు కలవటం ఇప్పుడు అందరూ మాట్లాడుకునేలా చేసింది.

ఇదిలా ఉంటే.. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత ప్రజలు గుర్తు పెట్టుకునే నేతలు.. గుర్తుండే వ్యక్తులు ముగ్గురే ముగ్గురని.. వారిలో ఒకరు ఎన్టీఆర్ అయితే రెండోవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మూడో వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు.

రంగా విగ్రహానికి పూలమాల వేసిన వారిలో జనసేనకు చెందిన పోతిన మహేశ్ కూడా ఉన్నారు. మూడు భిన్నదారుల్లో నడిచే పార్టీల నేతలు ఒకేచోట.. కలవటం.. ఒకేసందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించిన వైనం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. పార్టీ జెండా.. ఎజెండాలు ఎలా ఉన్నా.. అందరికి వంగవీటి రంగాను తాము అభిమానిస్తున్నామన్న విషయం తెలియజేయాలనుకునేలా వారి తీరు ఉందని చెప్పక తప్పదు.